ఇంటర్వ్యూ : రవితేజ – ఎంటర్టైనింగ్ సినిమాలకే నా ప్రాధాన్యత.

ఇంటర్వ్యూ : రవితేజ – ఎంటర్టైనింగ్ సినిమాలకే నా ప్రాధాన్యత.

Published on Aug 18, 2015 5:44 PM IST

Ravi-teja
మాస్ డైలాగ్స్ చెప్పాలన్నా, మాస్ గా కనిపించాలన్నా, తన డైలాగ్స్ తో ఆడియన్స్ ని పిచ్చి పిచ్చిగా నవ్వించాలన్నా గుర్తొచ్చే పేరు మాస్ మహారాజ్ రవితేజ. అలాంటి రవితేజ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘కిక్ 2’. 2009లో వచ్చిన కిక్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేము రవితేజతో కాసేపు ముచ్చటించాము.. ‘కిక్ 2’ గురించి రవితేజ చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) మొదటగా.. మీ ప్రజంట్ లుక్ లో చాలా తేడా వచ్చింది. మీరు ఇంతలా వెయిట్ తగ్గి ఇంత స్లిమ్ గా మారడానికి గల కారణం.?
స) నా తదుపరి సినిమాల కోసం వెయిట్ తగ్గానని అందరూ అనుకుంటున్నారు, కానీ అందులో నిజం లేదు. నేను పర్సనల్ గా ఫిట్ నెస్ కోసం వెయిట్ తగ్గాను. ఇక మీదట కూడా బాగా హెల్తీగా ఉండడం కోసం 10 కిలోల వెయిట్ తగ్గాను.

ప్రశ్న) ‘కిక్’ తో పోల్చుకుంటే ‘కిక్ 2’ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది.?
స) చెప్పాలంటే కిక్ సినిమాతో పోల్చుకుంటే ‘కిక్ 2’ అనేది టోటల్ డిఫరెంట్ స్క్రిప్ట్ తో రూపొందిన సినిమా. ఇంకా చెప్పాలంటే ఇది సీక్వెల్ లా ఉండదు. ‘కిక్ 2’ లో సెపరేట్ స్టొరీ లైన్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి.

ప్రశ్న) సినిమా రిలీజ్ దగ్గర పడింది, టెన్షన్ గా ఫీలవుతున్నారా.? అలాగే మీ సినిమాల సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ ని ఎలా తీసుకుంటారు.?
స) నేను చాలా కూల్ గా ఉన్నాను, రిలీజ్ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఇక నా కెరీర్ విషయానికి వస్తే.. నేను ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటాను. సక్సెస్ వచ్చింది కదా అని దాన్ని తలకి ఎక్కించుకోను. అలాగే గతంలోకి వెళ్లి నేను చేసిన తప్పుల గురించి బాధపడుతూ కూర్చోను. తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటూ, నా తదుపరి సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తాను.

ప్రశ్న) ‘కిక్ 2’ ట్రైలర్ లో చూపిన ‘కంఫర్ట్’ విశేషాలేంటో కాస్త చెబుతారా.?
స) ఫుల్ టూ నవ్వులు.. ఆ కఫర్ట్ లో ఉన్న కిక్ ఏంటో తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్రశ్న) ‘కిక్ 2’ లో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) కిక్ 2 లో నేను రాబిన్ హుడ్ అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండడమే కాకుండా ఇదివరకూ చూడని ట్రేడ్ మార్క్ మానరిజమ్స్ ఉంటాయి.

ప్రశ్న) ‘కిక్ 2’ సినిమా అనుకున్న టైం కంటే కాస్త ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏమిటి.?
స) అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడానికి కారణం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకోవడం. ఆ తర్వాత బాహుబలి రిలీజ్ అయ్యింది. దాంతో పర్ఫెక్ట్ టైం చూస్కొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం.

ప్రశ్న) ‘కిక్ 2’ సినిమాపై మీకున్న అంచనాలు ఏమిటి.?
స) ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫుల్ జోష్ మీదుంది. వరుసగా సూపర్బ్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. నా పరంగా ‘కిక్ 2’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అనే నమ్మకం ఉంది. కానీ ప్రేక్షకుల ఫైనల్ రిజల్ట్ కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) ‘కిక్’ లానే ‘కిక్ 2’ కి సీక్వెల్ గా ‘కిక్ 3’ ఉంటుందా.?
స) అంతా అనుకున్నట్టు జరిగి, ‘కిక్ 2’ కూడా ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ అయితే.. కచ్చితంగా కిక్ 3 కూడా ఉంటుంది. మాకు ప్లాన్స్ ఉన్నాయి కానీ కిక్ 2 రిజల్ట్ మీదే అంతా ఆధారపడి ఉంది.

ప్రశ్న) డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి.?
స) నాకు సురేందర్ రెడ్డికి చాలా కాలం నుంచి పరిచయం ఉంది. సూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పటి నుంచే నాకు తెలుసు. తనతో పని చేయడం చాలా సరదాగా ఉంటుంది.

ప్రశ్న) మీ ప్రాధాన్యత ఎంటర్టైన్మెంట్ వైపేనా.? మీ కెరీర్లో ఎప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తారు.?
స) అవును.. ప్రస్తుతానికి నా ప్రాముఖ్యత అంతా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలకే.. గతంలో నేను కొన్ని సార్లు ప్రయోగాలు చేస్తే అవి సరిగా వర్క్ కాలేదు. ఉదాహరణకి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, శంభో శివ శంబో లాంటి సినిమాలు నాకు చాలా దగ్గరిగా అనిపించాయి, కానీ కమర్షియల్ గా ఆడలేదు.

ప్రశ్న) వెంకటేష్ గారితో చెయ్యాలనుకున్న మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఏమైంది.?
స) చివరి నిమిషంలో అన్నీ వర్క్ అవుట్ కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.

ప్రశ్న) రీసెంట్ టైంలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సినిమాలు ఏమిటి.?
స) రీసెంట్ అంటే గత వారం వచ్చిన సినిమా చూపిస్త మావ సినిమా చూసాను. రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చింది. సినిమా కథని చాలా క్లవర్ గా రాసుకోవడమే కాకుండా పూర్తి ఎంటర్టైనింగ్ గా సినిమాని తీయడం నాకు బాగా నచ్చింది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, కిక్ 2 సినిమా మంచి విజయం సాధించాలని రవితేజకి ఆల్ ది బెస్ట్ చెప్పాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు