‘ఆపలేను బ్రదర్’.. సాయిధరమ్ తేజ్ డైలాగ్!
Published on Jul 31, 2016 2:00 pm IST

sai-dhram-tej
తెలుగు సినీ అభిమానులకు ‘చెప్పను బ్రదర్’ అన్న డైలాగ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ‘సరైనోడు’ సక్సెస్ మీట్‌లో పవన్ గురించి రెండు మాటలు చెప్పమని అడగ్గా, దానికి నిరాకరిస్తూ అల్లు అర్జున్ ఇచ్చిన ‘చెప్పను బ్రదర్’ అన్న సమాధానం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పవన్ అభిమానులు అల్లు అర్జున్‌పై అప్పట్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఇదే పవర్ స్టార్ అభిమానులు యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ముందు కూడా పవర్ స్టార్ అని నినాదాలు చేశారు.

ఇక దీనికి సాయిధరమ్ తేజ్, “‘అరవండి బ్రదర్’ మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పవర్ స్టార్ అని చెబుతా. మీ ప్రేమను నేను ‘ఆపలేను బ్రదర్’. అరవండి.. ఇంకా అరవండి.. మీతో పాటు నేనూ అరుస్తా అని పవర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్” అని అన్నారు. సాయిధరమ్ తేజ్ నుంచి వచ్చిన ఈ ఉత్సాహవంతమైన సమాధానంతో అభిమానులంతా హ్యాపీ అయిపోయారు. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగిన ‘తిక్క’ ఆడియో ఆవిష్కరణ వేడుకలో సాయిధరమ్ తేజ్ పై డైలాగ్ వదిలారు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook