ఇంటర్వ్యూ : తేజ – ఈ సినిమాతో రానా స్టార్ హీరోల జాబితాలోకి వెళ్ళిపోతారు !

ఇంటర్వ్యూ : తేజ – ఈ సినిమాతో రానా స్టార్ హీరోల జాబితాలోకి వెళ్ళిపోతారు !

Published on Aug 8, 2017 3:38 PM IST


వరుస ఫ్లాపులతో వెనుకబడిన దర్శకుడు తేజ ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేశారు. ట్రైలర్ చూసిన చాలా మంది తేజ ఈసారి హిట్ అందుకోవడం ఖాయమనే అంటున్నారు. సినిమా ఈ శుక్రవారమే విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు మీకోసం…

ప్ర) ముందుగా ఈ కథను వేరే హీరోకి చెప్పారట కదా ?
జ) అవును. మొదటిసారి లైన్ అనుకోగానే ‘అహం’ అనే టైటిల్ పెట్టి రాజశేఖర్ కు చెప్పాను. కానీ కొన్ని కారణాల వలన అనుకున్న కథను చెడగొట్టడం ఇష్టం లేక ఆ ప్రయత్నం మానుకున్నాను. ఆ తర్వాత కొంచెం డెవలెప్ చేసి రానాకు చెప్పాను. ఆయన వెంటనే ఒప్పుకోవడం వలన సినిమా మొదలైంది.

ప్ర) సినిమా ఎప్పుడు మొదలైంది ?
జ) సినిమా ‘బాహుబలి -2’ కంటే ముందే మొదలుపెట్టాను. కానీ మధ్యలో ఆ సినిమా రావడం, హిట్టవడం అన్నీ జరిగిపోయాయి. ఆ సినిమా తరవాత మళ్ళీ రీ స్టార్ట్ చేసి పూర్తిచేశాను.

ప్ర) ఇంతకు ముందు తేజాకి ఈ సినిమా తీస్తున్న తేజాకి తేడా ఏంటి ?
జ) నా గత ఫెయిల్యూర్స్ అన్నీ కథలో లోపం ఉండటం వలనే పోయాయని నాకు తెలుసు. అందుకే ఈసారి కథను బలంగా చెబుదామనుకుని ఈ సినిమా చేశాను.

ప్ర) ట్రైలర్ కు ఎలాంటి స్పందన వస్తోంది ?
జ) రెస్పాన్స్ చాలా బాగుంది. అప్పటి వరకు నన్నుచూసి మొహాలు తిప్పుకున్న వాళ్లంతా దగ్గరికొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగుందంటున్నారు.

ప్ర) ఈ సినిమాలో రానాది నెగెటివ్ పాత్రా ?
జ) నెగెటివ్ పాత్రని కాదు. రెగ్యులర్ సినిమాల్లో అయితే హీరోలోని పాజిటివ్స్ మాత్రమే చూపిస్తారు. కానీ ఇందులో అలా కాదు. జోగేంద్ర పాత్రలోని మంచిని, చెడుని అన్నిటినీ చూపిస్తాం. నిజ జీవితంలో మనిషి ఎలా ఉంటాడో అలానే ఉంటాడు.

ప్ర) అంటే సినిమా ఎలా ఉంటుంది ?
జ) రెగ్యులర్ సినిమాలకు ఒక మీటర్ ఉంటుంది. కానీ ఈ సినిమాకి అలా ఉండదు. అలాగని కమర్షియల్ అంశాలు లేవని కాదు. అవి కూడా ఉంటాయి. కానీ పాత్రలన్నీ ఆర్ట్ సినిమాలో పాత్రల్లా ఉంటాయి. ‘చిత్రం’ సినిమా ఎలాగో ఇది కూడా అలాగే సినిమా మీటర్ లెక్కలన్నిటినీ తుడిచేస్తుంది.

ప్ర) రానా ఎలాంటి నటుడని అనిపించింది ?
జ) రానా ఒక తెలివైన నటుడు. స్మార్ట్ గా ఆలోచిస్తాడు. కొంతమంది మేమే గొప్ప నటులం అని ఫీలవుతుంటారు. కానీ రానా అలా కాదు. ముందురోజు సీన్ చెబితే దాని గురించే ఆలోచిస్తూ సెట్ కి ఆ పాత్రలో ఉండే మూడ్ తోనే వస్తాడు.

ప్ర) కథ పూర్తిగా కొత్తదా ?
జ) కాదు. కథ అందరికీ తెలిసిందే. ఎప్పుడూ మన చుట్టూ జరిగేదే. కానీ తీసిన విధానం, చెప్పిన నైపథ్యం కొత్తవి.

ప్ర) కాజల్ ఎలా నటించింది ?
జ) కథ చెప్పగానే సురేష్ బాబుగారు కాజల్ అయితేనే సినిమా చేద్దాం అన్నారు. కాజల్ కూడా చాలా డెవలప్ అయింది. ఈజీగా నటించేస్తుంది. పాత్ర గురించి చెప్పాక నాకన్నా ఎక్కువగా అందులో లీనమైపోయింది.

ప్ర) ఈ సినిమాలో క్యాథరిన్ చేత సిగరెట్ కూడా తాగించినట్టున్నారు ?
జ) ఆ పాత్ర అలాంటిది. నా ఏ సినిమా చూసినా అందులో ఆవావాళ్ల పాత్రలు చాలా బలంగా ఉంటాయి. వాళ్ళ చుట్టూనే కథ తిరుగుతుంది. ఇందులో కూడా అంతే. కాజల్, క్యాథరిన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి.

ప్ర) ఈ సినిమాతో ఎవరెవరికి పేరొస్తుంది ?
జ) ఈ సినిమాతో రానా స్టార్ హీరోల జాబితాలో చేరిపోతాడు. కాజల్ కి కూడా మంచి పేరొస్తుంది. అలాగే సినిమాటోగ్రాఫర్, సంగీతం ఇచ్చిన అనూప్ రూబెన్స్ కు కూడా పేరొస్తుంది.

ప్ర) సురేష్ ప్రొడక్షన్స్ లో చేయడం ఎలా ఉంది ?
జ) నాకు రామానాయుడుగారితో సినిమా చేయాలని ఉండేది. కానీ కుదరలేదు. ఇప్పుడు సురేష్ బాబుగారితో చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది.

ప్ర) సురేష్ బాబుగారు ఈ సినిమాకు ఎలా హెల్ప్ చేశారు ?
జ) నిర్మాతంటే దర్శకుడిని సెట్లో ప్రశాంతంగా పనిచేసుకునేలా చేయాలి. సురేష్ బాబుగారు అలానే చేశారు. ఆయన వలన సినిమా స్థాయి చాలా పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు