బాక్సాఫీస్ ప్రభంజనం : 500 కోట్ల ‘బాహుబలి’!

బాక్సాఫీస్ ప్రభంజనం : 500 కోట్ల ‘బాహుబలి’!

Published on Aug 3, 2015 9:21 PM IST

Baahubali-pposter
‘తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయి ఇదీ’ అని బలంగా చాటిచెప్పిన సినిమాగా ‘బాహుబలి’ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడంతో పాటు ఎన్ని భాషల్లో విడుదలైందో అన్ని భాషల్లోనూ కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లను కొల్లగొడుతూ బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలబడింది. ప్రస్తుతం ఈ సినిమా నాలుగో వారంలోకి ప్రవేశించాక కూడా అదే ప్రభంజనాన్ని కొనసాగిస్తూ, నిన్నటితో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఓ ప్రాంతీయ సినిమా అయిన ‘బాహుబలి’ వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టగలదా? అన్న నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఊహకు కూడా అందకుండా నిలిచింది. ఇక హిందీలో డబ్బింగ్ సినిమాల ఉనికి కూడా ఒక గగనమే అన్న పరిస్థితుల్లో ‘బాహుబలి’ ఏకంగా 100 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. మొత్తంగా బాహుబలి సినిమా అన్ని భాషల్లో కలుపుకొని, నిన్నటితో 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ చేరుకుంది. భారతీయ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ బాహుబలి తన ప్రభంజనాన్ని అలా కొనసాగిస్తూ దూసుకుపోతూనే ఉంది.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించారు. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున సుమారు 4000కు పైనే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ దాదాపు 2000కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు