ఎన్నో కథలు విని చివరికి ఈ కథను ఓకే చేశా : బాలకృష్ణ

balakrishna
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వేడుక నిన్న రాత్రి తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర టీమ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ‘తెలుగు జాతి రాజహంస గౌతమిపుత్ర శాతకర్ణి. అయన గొప్పతనాన్ని నాలు దిశలా చాటేలా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. పౌరుషంతో పాటు విజ్ఞానం కూడా ఉంటే జీవితం సార్థకమవుతుంది. అలాంటి వ్యక్తే శాతకర్ణి. నా వందవ సినిమా ఏం చేయాలని ఆలోచిస్తూ చాలా కథలు విన్నా. కొన్ని నచ్చాయి. కానీ క్రిష్ చెప్పిన ఏ కథ నచ్చి ఓకే చేశా. ఈ సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం’ అన్నారు.

అలాగే చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ‘మా అమ్మకు, భార్యకు మంచి సినిమా తీస్తానని మాటిచ్చా. అన్నట్టే ఈ సినిమా తీశా. బాలయ్య 10 నిముషాల్లో కథ విని, 14 గంటల్లో సినిమా అనౌన్స్ చేశారు. సినిమా కోసం ఎంత సమయమైనా సెట్లోనే ఉండేవారు. నాతో పాటు ఆయన కూడా కెప్టెనే. ఆయనకు నా ధన్యవాదాలు. శాతకర్ణి కథ చదువుతుంటే నా రక్తం మరిగింది. ఒకవేళ శాతకర్ణి గ్రీసులో పుట్టి ఉంటే ఆయనపై 100 పుస్తకాలు రాసి 10 సినిమాలు తీసేవారు. మూడు ఆస్కార్లు వచ్చేవి. అలాంటి వ్యక్తి గురించి సినిమా తీసినందుకు గర్విస్తున్నాను. సమయం లేదు మిత్రమా సినిమా సంక్రాంతికి వస్తోంది’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.

 

Like us on Facebook