చిట్ చాట్: బెక్కం వేణుగోపాల్ – పెద్ద హీరోలతో చేసే అవకాశమున్నా కథ నచ్చి ఈ చిన్న సినిమా చేశాను !

చిట్ చాట్: బెక్కం వేణుగోపాల్ – పెద్ద హీరోలతో చేసే అవకాశమున్నా కథ నచ్చి ఈ చిన్న సినిమా చేశాను !

Published on Apr 26, 2018 2:23 PM IST

‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ వంటి చిత్రాల్ని నిర్మించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ మరో కొత్త సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో సినిమా గురించిన విశేషాల్ని పంచుకున్నారు. ఆ సంగతులు మీకోసం..

చెప్పండి సర్ మీ కొత్త సినిమా గురించి ?
గత ఏడాది దసరా నుండి ఒక కొత్త సినిమాను మొదలుపెట్టాను. పెద్ద హీరోలతో చేసే అవకాశమున్నా హర్ష కొనగంటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి సినిమా చేశాను. ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను సెట్ చేసే సినిమా అవుతుంది.

సినిమాకు టైటిల్ ఏమని పెట్టారు ?
ఈ చిత్రానికి టైటిల్ ‘హుషారు’ అని పేరు పెట్టాం. కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంతేగాక టైటిల్ కు సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చాం.

షూటింగ్ ఎంతవరకు వచ్చింది ?
దాదాపు అంతా పూర్తైపోయింది. ఇంకో నాలుగు రోజులు మాత్రమే మిగిలుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడ మొదలైంది.

ఇందులో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారు ?
ఇందులో మొత్తం నలుగురు హీరోలు. అందరూ కొత్తవాళ్ళే. హీరోయిన్లు ముగ్గురు కుడా కొత్తవారే. కథలోని ఒక కీలక పాత్ర కోసం ‘అర్జున్ రెడ్డి’లో నటించిన రాహుల్ రామకృష్ణన్ ను తీసుకున్నాం. అతని పాత్ర సెకండాఫ్లో వచ్చి సినిమాను ఎండ్ చేస్తుంది.

సినిమా ఎలా ఉండబోతోంది ?
ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో మంచి, చెడు రెండింటినీ చూపిస్తాం. విలువలున్న సినిమా. యువతని టార్గెట్ గా పెట్టుకుని తయారుచేసిన కథ ఇది.

చిత్రం ఎప్పుడు రిలీజవుతుంది ?
ఈరోజు టైటిల్ ను అనౌన్స్ చేసి తర్వాత ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వదిలి కాలేజీలు తెరిచే సమయానికి అంటే జూన్ నెల మధ్యలోనే విడుదలచేయాలని అనుకుంటున్నాను.

మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఎవరు ?
ఈ సినిమాకు ‘అందాల రాక్షసి’ ఫేమ్ రథన్ సంగీతమిచ్చారు. ఆరు పాటలు, రెండు బిట్ సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఇక ‘అర్జున్ రెడ్డి’కి కెమెరా వర్క్ చేసిన రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఎడిటింగ్ విజయ్ చేశారు. అందరూ మంచి టెక్నీషియన్స్.

దిల్ రాజుగారికి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారని విన్నాం ?
అవును. ఈ సినిమా పనులన్నీ పూర్తికాగానే దిల్ రాజుగారితో కలిసి ‘నేను లోకల్’ తరహాలోనే ఒక సినిమా చేస్తాను. త్వరలో దాని గురించిన ప్రకటన చేస్తాను.

ఆ సినిమా ఎలా ఉండబోతోంది ?
కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక ఫ్యామిలీ నుండి కొత్త హీరో పరిచయమవుతున్నాడు. పెద్ద ప్రాజెక్ట్. ఐదు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. జూన్లో షూట్ మొదలయ్యే అవకాశముంది. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు.

ఇంకా కొత్త సినిమాలేవైనా ఉన్నాయా ?
ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దాన్ని త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తాడు. వచ్చే సంవత్సరం మొదలవుతుంది. తర్వాత విఐ ఆనంద్ తో కూడ ఒక సినిమా చేస్తాను.

ఇండస్ట్రీలో మీ జర్నీ ఎలా ఉంది ?
2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ అనే సినిమాతో పరిశ్రమలోకి వచ్చాను. ఇప్పటికే 12 సంవత్సరాలు అవుతోంది. 10 సినిమాలు చేశాను. నా కెరీర్ మొత్తానికి మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది.

‘హుషారు’ సినిమా మీద ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారు ?
చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ కొత్త ప్రయత్నాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఆతురతగా ఉంది. సినిమా చూసిన అందరూ చిన్న సినిమా అయినా భలే చేశారు కదా అని అనుకుంటారనే నమ్మకమైతే నాకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు