ఈ సంవత్సరం భీభత్సమైన స్టార్ వార్ జరగనుంది !

ఈ సంవత్సరం భీభత్సమైన స్టార్ వార్ జరగనుంది !

Published on Jan 16, 2017 11:02 PM IST

TFI
ఈ 2017 వ సంవత్సరం టాలీవుడ్ పరిశ్రమకు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈసారి స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు తలపడనున్నారు. సంవత్సరం ఆరంభంలోనే ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య తమ ‘ఖైదీ నెం 150’, ‘గౌతమిపుత్రశాతకర్ణి’ చిత్రాలతో ఈ పోటీకి తెరలేపగా తరువాతి తరం హీరోలంతా దాన్ని కొనసాగించనున్నారు.

పవన్ కళ్యాణ్, డాలి డైరెక్షన్లో చేస్తున్న ‘కాటమరాయడు’ తో బరిలోకి దిగుతుండగా మహేష్ బాబు, మురుగదాస్ తో చేస్తున్న చిత్రంతో తన సత్తా చూపడానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రభాస్ అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ తో మరోసారి మార్కెట్ ను షేక్ చేసేందుకు ఉబలాటపడుతున్నారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరో వైపు అల్లు అర్జున్, హరీష్ శంకర్ తో చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’తో మరో వరుస విజయాన్ని అందుకోవాలని తహతహలాడుతున్నాడు.

అలాగే జూ. ఎన్టీఆర్ సైతం బాబీ డైరెక్షన్లో మొదలుపెట్టనున్న కొత్త చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ ను అందుకుని తన మార్కెట్ రేంజును మరింత పెంచుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు. మరో మెగా హీరో రామ్ చరణ్ కూడా ‘ధృవ’ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాతో మరోసారి టాప్ లిస్టులోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సీనియర్ హీరోలైన వెంకటేష్ ‘గురు’ చిత్రంతో, నాగార్జున ‘నమో వెంకటేశాయ’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేకతను చాటుకోనున్నారు. ఇక నాగ చైతన్య, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాని, నిఖిల్, రానా, రామ్ వంటి హీరోలంతా కూడా సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఉన్న హీరోలందరూ పోటా పోటీగా తలపడుతుండటంతో సంవత్సరమంతా తెలుగు పరిశ్రమ కోలాహలంగా ఉండనుంది. కోలాహలంతో పాటే వందల కోట్ల బిజినెస్ ను కూడా కళ్ళ చూడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు