‘బ్రూస్ లీ’తో నా ఇమేజ్ డ్యామేజ్ అయింది : కోన వెంకట్

‘బ్రూస్ లీ’తో నా ఇమేజ్ డ్యామేజ్ అయింది : కోన వెంకట్

Published on Nov 28, 2015 5:16 PM IST

kona-venkat
దర్శకుడు శ్రీనువైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్‌ల కాంబినేషన్‌లో ఏ రేంజ్ సినిమాలొచ్చాయో ప్రత్యేకించి చెపాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీకి పలు బ్లాక్‍బస్టర్ సినిమాలను అందించారు. కాగా ‘బాద్‌షా’ సమయంలో వీరిద్దరికీ వచ్చిన బేధాభిప్రాయాలు తలెత్తి, శ్రీనువైట్ల తరువాతి సినిమా ‘ఆగడు’కి కోన వెంకట్ పనిచేయలేదన్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ తన సినిమా కోసం వీరిద్దరిని మళ్ళీ కలిపి ‘బ్రూస్ లీ’ అనే సినిమా చేశారు. గత దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.

కథ, కథనాల్లో ఎక్కడా కొత్తదనం లేదన్న పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు, ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయి రివ్యూలు రావడం గురించి మాట్లాడుతూ రచయిత కోనవెంకట్, ‘బ్రూస్ లీ’ సినిమా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందని తెలిపారు. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన శంకరాభరణం అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

“‘బ్రూస్ లీ’ సినిమాకు నేనో 72 సన్నివేశాలిస్తే, శ్రీనువైట్ల అందులో కొన్నిమాత్రమే వాడుకున్నాడు. అయితే కథ నా పేరు మీదే పడింది కాబట్టి బ్రూస్ లీ నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఒక దర్శకుడిగా శ్రీనువైట్ల ఏయే సన్నివేశాలను వాడుకోవాలి అనుకున్నది అతడిష్టం. అయితే నేను రాసిన సన్నివేశాలు ఉండి ఉంటే బ్రూస్ లీ ఇంకోలా ఉండేది అనిపిస్తోంది. శంకరాభరణంతో మళ్ళీ ఆ డ్యామేజ్‌ను పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నా” అన్నారు. ఇక శ్రీనువైట్లతో మళ్ళీ కలిసి పనిచేస్తారా? అన్న ప్రశ్నకు “మా ఇద్దరి బంధం ఇప్పుడు వెంటిలేషన్‌పై ఉంది. సో, ఏదైనా జరగొచ్చు” అన్న సమాధానం ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు