ఇంటర్వ్యూ : చేతన్ చీను – నటుడిగా పవన్ కళ్యాణే నాకు స్ఫూర్తి.

ఇంటర్వ్యూ : చేతన్ చీను – నటుడిగా పవన్ కళ్యాణే నాకు స్ఫూర్తి.

Published on Jul 29, 2015 6:32 PM IST

Chethan Cheenu
హాట్ బ్యూటీ ఛార్మీ హీరోయిన్‌గా రూపొందిన హర్రర్ థ్రిల్లర్ ‘మంత్ర’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.! ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మంత్ర 2’ జూలై 31న విడుదల కానుంది. ఛార్మీ, చేతన్ చీను ప్రధాన పాత్రల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘అంజలి’తో ఎంట్రీ ఇచ్చిన చేతన్, ఆ తర్వాత అడ్వర్టైజింగ్ రంగంలో, తమిళ సినీ పరిశ్రమలో రాణించారు. తన మాతృభాషైన తెలుగులో కూడా తన సత్తా చాటుకోవాలని చేసిన మొదటి సినిమా ‘మంత్ర 2’. ఈ వారమే విడుదలకానున్న ‘మంత్ర 2’ గురించి చేతన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా మీ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చారు?

స) నేను పుట్టి పెరిగిందంతా అమలాపురంలోనే.. నాన్న సత్యనారాయణ మూర్తిది ఖమ్మం. ఆ రకంగా నాకు రెండు ప్రాంతాల అభిరుచులూ అలవడ్డాయి. నాన్న ‘చందమామ’ పత్రికలో ఆర్టిస్ట్‌గా పనిచేసేవారు. నా చిన్నపుడే మణిరత్నం గారి ‘అంజలి’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత మళ్ళీ చదువయ్యాక మోడల్‌గా పనిచేశా. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో చాలా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించా. ఈ క్రమంలోనే కొన్ని తమిళ సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ‘మంత్ర 2’తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నా.

ప్రశ్న) ‘మంత్ర 2’ అవకాశం ఎలా వచ్చింది?

స) తమిళంలో విశాల్ హీరోగా రూపొందిన ‘నాన్ సిగప్పు మణితన్’ అనే సినిమా తెలుగులో ఇంద్రుడు పేరుతో విడుదలైంది. ఆ సినిమాలో నేను ఓ కీలక పాత్రలో నటించా. అది తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమా చూసిన దర్శకుడు సతీష్, ‘మంత్ర 2’ కోసం నన్ను సంప్రదించారు. తెలుగులో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఒక మంచి గుర్తింపున్న సినిమాతో తలుపు తట్టడంతో వెంటనే ఒప్పేసుకున్నా.

ప్రశ్న) తెలుగులో ఎంట్రీకి ‘మంత్ర 2’ సరైన సినిమాయే అనుకుంటున్నారా?

స) కచ్చితంగా సరైన సినిమానే.. సాధారణంగా లవ్ స్టోరీనో, యాక్షన్ సినిమానో మొదటి సినిమా అవ్వాలని కోరుకుంటారు. అయితే ఇలాంటి ఒక హర్రర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే నాకూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని అనుకున్నా. ‘మంత్ర 2’ నాకు తెలుగులో ఓ మంచి గుర్తింపునిస్తుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమాలో నేను విజయ్ అనే ఓ పోలీసాఫీసార్‌గా నటించా. ఒక యంగ్ పోలీసాఫీసర్‌, కష్టాల్లో ఉన్న ఒక అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో ఆ అమ్మాయి పడే కష్టమేంటి? చివరకు ఎలా బయటపడింది? అనే అంశం చుట్టూ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో నా రోల్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. నటుడిగానూ నేను నిరూపించుకోదగ్గ క్యారెక్టర్ ఇది.

ప్రశ్న) ఛార్మీ తెలుగులో పాపులర్ హీరోయిన్. ఆమెతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

స) ఛార్మీ పెద్ద హీరోయిన్. షూటింగ్ మొదట్లో కొంత కంగారుపడ్డా కానీ ఆ తర్వాత అంతా సర్దుకుంది. ఛార్మీ కో యాక్టర్‌కు మంచి సపోర్ట్‌నిస్తారు. యాక్టింగ్ పరంగానూ అక్కడక్కడా కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది.

ప్రశ్న) ‘మంత్ర 2’ దర్శకుడి గురించి చెప్పండి?

స) సతీష్ నాకేదైతే చెప్పారో దాన్ని క్లియర్‌గా ఎక్కడా ఇబ్బంది పడకుండా తెరకెక్కించారు. ఒక హర్రర్ సినిమా చేయడానికి హర్రర్‌కు సంబంధించిన ఎలిమెంట్స్ కొన్ని తెలిసి ఉండాలి. ఆయన వాటన్నింటినీ చాలా నేర్పుతో తెరకెక్కించారు.

ప్రశ్న) నటుడిగా మీ రోల్ మోడల్ ఎవరు?

స) నాకు చిన్నప్పట్నుంచీ రఘువరన్ గారంటే చాలా ఇష్టం. ఇక ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ చూసి కూడా చాలా నేర్చుకున్నా. ఈ జనరేషన్‌లో అయితే నాకు పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి అభిమానం. పవన్ కళ్యాణ్ నటనే నాకు స్ఫూర్తి. ఇక తమిళంలో అజిత్ అంటే చాలా ఇష్టం.

ప్రశ్న) మీ తదుపరి ప్రాజెక్టులేంటి? నటుడిగా ఎలాంటి గుర్తింపు కోరుకుంటున్నారు?

స) ముందే చెప్పినట్లు తెలుగులో అవకాశాల కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తే ‘మంత్ర 2’ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయా. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది’తో పాటు వరుసగా మరో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కాలి. మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా ఆశయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు