Like us on Facebook
 
చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన చిరు!

chiru
మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా? అన్న ఆయన అభిమానుల కల మరో మూడు రోజుల్లో నెరవేరనున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు చేసిన ‘ఖైదీ నంబర్ 150’ అనే సినిమా ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్. తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న సాయంత్రం హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్‌చరణ్‌లతో పాటు ఇతర మెగా హీరోలైన అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు ఈ వేడుకకు హాజరై చిరంజీవి సినిమా గురించి తామెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నామో తెలిపారు.

ఇక ఈ వేడుకలోనే చిరంజీవి మాట్లాడుతూ తన తనయుడు రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ మొదట 150వ సినిమాను నిర్మిస్తా అన్నప్పుడు చాలా ఆలోచించానని, అలాంటిది చరణ్ ఇంత పకడ్బందీగా నిర్మించడం గర్వంగా ఉందని చిరు అన్నారు. “ఒక నిర్మాతకు కావాల్సిన అన్ని లక్షణాలు చరణ్ దగ్గర ఉన్నాయి. నేను పనిచేసిన సూపర్ నిర్మాతల్లో రామ్ చరణ్ ఒకరు.” అంటూ చరణ్‌పై చిరు ప్రశంసలు కురిపించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది.

Bookmark and Share