చిట్ చాట్ : సత్యరాజ్ – ‘బాహుబలి 2’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది!

చిట్ చాట్ : సత్యరాజ్ – ‘బాహుబలి 2’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది!

Published on Jun 21, 2016 6:11 PM IST

satya-raj
సత్యరాజ్.. ప్రస్తుతం సౌతిండియన్ సినిమాలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బ్రహ్మోత్సవం’, ‘నేను శైలజ’ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన సత్యరాజ్, అన్నింటికంటే ముఖ్యంగా ‘బాహుబలి’లోని కట్టప్ప అనే పాత్రే తన సొంతపేరు అయ్యేంతగా పాపులర్ అయిపోయారు. ఇక తాజాగా ఆయన ఓ ప్రధాన పాత్రలో నటించిన ‘దొర’ అనే సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ గురించి, ‘దొర’ సినిమా గురించి చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ‘బాహుబలి’లోని కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. అలాంటి పాత్రలో నటించే అవకాశం రావడాన్ని ఎలా భావిస్తున్నారు?

స) కట్టప్ప లాంటి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం. ఈ సినిమాతో నాకు వచ్చిన క్రెడిట్ అంతా రాజమౌళి గారికే దక్కాలి. యంగ్ డైరెక్టర్స్ ఒక విజన్‌తో సృష్టించే పాత్రలే మాలాంటి నటులకు గుర్తింపు తెస్తుంటాయి. ‘బాహుబలి’ అయినా, ‘మిర్చి’ అయినా ఆ సినిమాలతో మాకు వచ్చే గుర్తింపంతా ఆయా దర్శకుల వల్లే!

ప్రశ్న) ‘బాహుబలి 2’లో కట్టప్ప పాత్ర ఎలా ఉంటుందీ?

స) చెప్పాలంటే ‘బాహుబలి 2’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే నేనూ అందులో జాయిన్ అవుతున్నా.

ప్రశ్న) దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అడుగుతోన్న ప్రశ్న ఇది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?

స) (నవ్వుతూ..) అందరూ ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. రాజమౌళి గారే ఎక్కడో చెప్పినట్టు, ఆయన చంపమంటే చంపాను, అంతే! (మళ్ళీ నవ్వుతూ..) వచ్చే ఏడాది పార్ట్ 2 వస్తుంది కదా, అప్పుడు రాజమౌళి గారే తన సినిమా ద్వారా చెప్పేస్తారు. అప్పటివరకూ ఎదురుచూడాల్సిందే!

ప్రశ్న) మీ కొత్త సినిమా ‘దొర’ గురించి చెప్పండి?

స) ‘దొర’ ఒక హర్రర్ కామెడీ. ఇందులో నేను ఓ దయ్యంగా కనిపించనున్నా. దయ్యం పాత్రకు ఎటువంటి పరిధులూ ఉండవు కాబట్టి, సులువుగా చేసేశా. మా అబ్బాయి సిబి సత్యరాజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. తమిళం, తెలుగులో ఒకేసారి సినిమాను విడుదల చేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు