చిట్‌చాట్ : సురేష్ కె.వి. – త్రివిక్రమ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం మర్చిపోలేనిది!

చిట్‌చాట్ : సురేష్ కె.వి. – త్రివిక్రమ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం మర్చిపోలేనిది!

Published on Aug 23, 2016 11:26 PM IST

suresh-kv
తెలుగులో హర్రర్ థ్రిల్లర్ జానర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సురేష్ కె.వి. దర్శకుడిగా పరిచయమవుతూ ‘అవసరానికో అబద్ధం’ అనే హర్రర్ థ్రిల్లర్‌తో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. గీతాంజలి, రాజేశ్, శశాంక్, లోకేష్, రూపశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి దర్శకుడు చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ‘అవసరానికో అబద్ధం’.. టైటిల్ వెనుక కథేంటీ? సినిమా ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమా పక్కా హర్రర్ థ్రిల్లర్. ఒక నలుగురు యువతీయువకులు అడవిలో సరదాగా గడపడానికి వెళ్తే అక్కడ వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశం. థ్రిల్లింగ్ నెరేషన్‌తో సినిమా నడుస్తూ ఉంటుంది.

ప్రశ్న) దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం ఎంతవరకు కలిసి వచ్చింది?

స) త్రివిక్రమ్ గారికి ముందు ట్రైలర్ చూపించి నచ్చితే లాంచ్ చేయమని కోరాం. ఆయనకు ట్రైలర్ నచ్చి విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయనిచ్చిన కాంప్లిమెంట్, సలహాలు మర్చిపోలేను. ఇప్పటికీ త్రివిక్రమ్ గారు మా సినిమా ట్రైలర్ విడుదల చేశారా? అని ఆశ్చర్యపడుతూంటా. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం వల్లే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళగలిగింది. ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

ప్రశ్న) చిన్న సినిమా అనగానే వచ్చే సవాళ్ళను ఎలా ఎదుర్కున్నారు?

స) ఈ సినిమాను స్వయంగా మేమే ఓ గ్రూప్‌గా ఏర్పడి నిర్మించాం. సినిమాకు నిర్మాతలుగా పనిచేసిన వారంతా కథ కూడా వినకుండా నాకోసం ముందుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో, మేము అనుకున్న స్థాయి ఔట్‌పుట్‌ను తేవడంలో చాలావరకూ సఫలమయ్యామనే అనుకుంటున్నా.

ప్రశ్న) సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) సెకండాఫ్‌లో కథలోని అసలైన ట్విస్ట్ రివీల్ అయ్యేదగ్గర్నుంచి చివరివరకూ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ పార్ట్‌నే మేజర్ హైలైట్‌గా చెబుతా. ప్రేక్షకులు కూడా ఈ ట్విస్ట్‌ను బాగా ఆస్వాధిస్తారనుకుంటున్నా.

ప్రశ్న) రిలీజ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు?

స) మా స్థాయికి మించి థియేటర్స్‌లో సినిమా నడవాలని అనుకోట్లేదు. అందుకే లిమిటెడ్ థియేటర్స్‌లో సినిమా విడుదల చేస్తున్నాం. సినిమాకు మంచి టాక్ వస్తే, తర్వాతి వారం నుంచి థియేటర్స్ ఎలా పెరుగుతాయో ఈమధ్యే విజయం సాధించిన కొన్ని సినిమాల ద్వారా చూశాం. మా సినిమాకూ అలాగే జరగుతుందని ఆశిస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు