చిట్‌చాట్ : వరా ముల్లపూడి – రాజమౌళికి నచ్చకపోతే ఆ కథను పక్కనపెట్టేస్తా!

చిట్‌చాట్ : వరా ముల్లపూడి – రాజమౌళికి నచ్చకపోతే ఆ కథను పక్కనపెట్టేస్తా!

Published on Jun 20, 2016 5:25 PM IST

VARA-MULLAPUDI
ప్రఖ్యాత తెలుగు సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వరా ముల్లపూడి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రచయితగా, దర్శకుడిగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ వస్తున్నారు. గతంలో ‘నా అల్లుడు’, ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వరా, తాజాగా ‘కుందనపు బొమ్మ’ అనే సినిమాతో మెప్పించేందుకు మన ముందుకు వస్తున్నారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వరా ముల్లపూడితో జరిపిన చిన్న సంభాషణ..

ప్రశ్న) ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఓ సినిమా చేశారు. కారణం?

స) కారణమంటే నన్ను ఎగ్జైట్ చేసే అవకాశాలు రాకపోవడమే! విశాఖ ఎక్స్‌ప్రెస్ తర్వాత నా యాడ్ ఫిల్మ్స్, సీరియల్స్‌తో బిజీ అయిపోయా. ఈ గ్యాప్‌లో వచ్చిన అవకాశాలన్నీ నచ్చక, నేనూ ముందడుగు వేయలేదు. ఈ ‘కుందనపు బొమ్మ’ కథ మాత్రం నన్ను మళ్ళీ సినిమా దర్శకత్వం వైపు మళ్ళించింది.

ప్రశ్న) ‘కుందనపు బొమ్మ’ సినిమా ఎలా ఉండబోతోందీ?

స) కుందనపు బొమ్మ తెలుగుదనం ఉట్టిపడే ప్రేమకథ. అందరికీ నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఎక్కువగా బొబ్బిలి, విజయనగరంలో షూట్ చేశాం. సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రశ్న) షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన చాందిని చౌదరిని ఈ సినిమాకు ఎంపిక చేయడానికి గల కారణం?

స) నేను ఈ కథ అనుకున్నప్పుడే అచ్చ తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని అనుకున్నా. చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చూసినప్పుడు ఈ అమ్మాయి అయితే సినిమాకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నా. అందుకు తగ్గట్టే మా కథకు చాందిని మంచి స్థాయి తెచ్చింది. ఇక ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం సుధాకర్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించాడు.

ప్రశ్న) మీ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన రాజమౌళితో మీ సినిమాల గురించి చర్చిస్తుంటారా?

స) వీలున్నంతవరకూ నా ప్రతీ కథా రాజమౌళికి చెబుతుంటా. రాఘవేంద్ర రావు గారి దగ్గర పనిచేసేప్పట్నుంచే రాజమౌళి బాగా తెలుసు. అతడి జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఓ కథ బాలేదని రాజమౌళి నోటినుంచి వచ్చిందంటే, వెంటనే ఆ కథను పక్కన పెట్టేస్తా.

ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులు ఏంటి?

స) రమణ గారు-బాపు గారు కలిసి రాసిన ఓ మంచి కథ ఉంది. దాన్ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్చి ఓ సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నా. ఇంకా చాలా కథలే రాసి పెట్టుకున్నా. ‘కుందనపు బొమ్మ’ విడుదలయ్యాకే తర్వాత ఏంటనేది ప్రకటిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు