Like us on Facebook
 
దర్శకుడు గీతావిష్కరణ

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తితో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు అశోక్, ఈషా, పూజిత జంటగా నటించారు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. సాయికార్తీక్ స్వరకర్త. శనివారం హైదరాబాద్ దర్శకుడు చిత్ర గీతావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీని ఆయన విడుదల చేశారు. చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని దర్శకులు సురేందర్‌రెడ్డి, వంశీపైడిపల్లి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో దర్శకులనగానే దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు గుర్తుకొస్తారు. వారిద్దరి ఆశీస్సులు ప్రతి దర్శకుడిపై వుంటాయి. నా అభిమాన దర్శకుడు సుకుమార్. అతి తక్కువ వ్యవథిలో ఆయన నా మనసులో చోటు సంపాదించుకున్నారు. నిర్మాత ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఓ వైపు దర్శకుడి నిర్మాణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే రంగస్థలం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ తీసే కథ ఎలాంటిదైనా అందులో ప్రేమకు సంబంధించిన గాఢమైన అంశం వుంటుంది. బలమైన లవ్‌పాయింట్ లేకుండా ఆయన సినిమాలు తీయరు. ఈ మధ్యే పెళ్లిచూపులు అమీతుమీ చిత్రాల్ని కుటుంబంతో కలిసి చూసి బాగా ఎంజాయ్ చేశాను. ఈ చిత్ర నాయిక ఈషా అమీతుమీలో అద్భుతమైన నటనను కనబరచింది అన్నారు. పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడాలని అభిమానులు రామ్‌చరణ్‌ను కోరగా ప్రేమ మాటల్లో కాదు మనసులో వుండాలి. మనం అమితంగా ప్రేమించే వ్యక్తుల గురించి రోజూ మాట్లాడుకోం. అందుకే అమ్మ గురించి రోజూ మాట్లాడుకోం. కుటుంబం పట్ల నా ప్రేమ మనసులో ఎక్కువగా వుంటుంది. మాటల్లో తక్కువుంటుంది అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ రామ్‌చరణ్ ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన ప్రవర్తన మట్టి మనిషిలా వుంటుంది. ఎటువంటి భేషజాలు ప్రదర్శించకుండా అందరితో సామాన్యుడిలా మసలుకుంటారు. చిత్ర దర్శకుడు హరిప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు. ఇద్దరం కలిసి అధ్యాపకులుగా పనిచేశాం. నేను మానసికైస్థెర్యం కోల్పోయిన సందర్భాల్లో నాకు అండగా నిలిచాడు. ఈ చిత్ర కథ చెప్పగానే అతన్నే దర్శకత్వ బాధ్యతలు తీసుకోమని ప్రోత్సహించాను. తొలి చిత్రమైనా ఎంతో అనుభవజ్ఞుడిగా తెరకెక్కించారు. సాయికార్తీక్ వినసొంపైన బాణీలిచ్చాడు అన్నారు. దర్శకుడిగా నా తొలిచిత్రమిది. సుకుమార్‌కు ఏదో సరదాగా కథ చెబితే…నన్నే డైరెక్ట్ చేయమన్నారు. సక్సెస్‌ఫుల్ దర్శకుల మొదటి సినిమాలన్నింటిని చూశాను. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల అండతో వారు మంచి విజయాల్ని అందుకున్నారని అర్థమైంది. ఈ సినిమాకు కూడా సృజనశీలురైన సాంకేతిక నిపుణులు పనిచేశారు అని దర్శకుడు చెప్పారు. సుకుమార్‌తో కలిసి సినిమాలు నిర్మిద్దామనుకున్నాను. అనుకోని కారణల వల్ల కుదరలేదు. మేమిద్దరం ఒకేసారి సినీ ప్రయాణాన్ని ప్రారంభించాం. అయినా నేను సుకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాను అని సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో సుకుమార్ అంటే అందరికి ప్రత్యేకమైన గౌరవమని వంశీపైడిపల్లి చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో సుకుమార్ ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారని, తాను దర్శకుడు కావడానికి ఆయనే స్ఫూర్తి అని వక్కంతం వంశీ చెప్పారు. వన్‌సైడ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేసిన గొప్ప దర్శకుడు సుకుమార్ అని తరుణ్‌భాస్కర్ ప్రశంసించారు. చిత్ర హీరో అశోక్ మాట్లాడుతూ హరిప్రసాద్‌కు దర్శకుడు కావాలని, నాకు హీరో కావాలని లేదు. మూడేళ్ల క్రిందటే నన్ను కథానాయకుడిగా పరిచయం చేయాలని హరిప్రసాద్ నిర్ణయించుకున్నాడు అన్నారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయిలే కథానాయికలుగా నటించాలనే పట్టుదలతో మమ్మల్ని ఎంపిక చేశారు. వినూత్న కథా చిత్రంలో భాగమవ్వడం ఆనందంగా వుంది అని కథానాయికలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీఎస్‌ఎన్‌ప్రసాద్, పీవీవీప్రసాద్, సతీష్ వేగేశ్న, దశరథ్, వాసువర్మ, కల్యాణ్‌కృష్ణ, అనిల్‌రావిపూడి, వక్కంతం వంశీ, తరుణ్‌భాస్కర్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Bookmark and Share