‘ధృవ’ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు!
Published on Nov 23, 2016 6:20 pm IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తే, ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకొని దూసుకుపోతోంది. ఇక డిసెంబర్ 9వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ముందే ప్రకటించిన టీమ్, అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటోంది.

ఆడియో ఇప్పటికే విడుదలైపోవడం, విడుదలకు రెండు, మూడు రోజుల ముందే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండడం.. ఇవన్నీ చూశాక ఇక ‘ధృవ’కి ప్రత్యేకంగా ట్రైలర్ అంటూ ఏదీ ఉండదని ప్రచారం జరుగుతూ వచ్చింది. వీటన్నింటికీ తెరదించుతూ, టీమ్ ధృవ ట్రైలర్‌పై అప్‌డేట్ ఇచ్చేసింది. నవంబర్ 25న సాయంత్రం 7 గంటలకు ‘ధృవ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుందని గీతా ఆర్ట్స్ సంస్థ కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేసింది. స్టార్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook