షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్ ను ప్రకటించిన దర్శకుడు ‘మారుతి’
Published on Aug 18, 2016 12:39 pm IST

maruthi
‘ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ‘మారుతి’. నిర్మాణ రంగం నుండి దర్శకుడిగా ఎదిగిన మారుతి తక్కువ బడ్జెట్ లో సినిమాలకు తీస్తూ చిన్న నిర్మాతలకు, సినిమాలకు ప్రాణం పోశారు. అంతేగాక స్టార్ డైరెక్టర్ హోదా దక్కినా కూడా ఈయన చిన్న సినిమాలను వదలలేదు.

తన కథలతో కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య ‘మురళి కృష్ణ ముడిదాని’ అనే కొత్త దర్శకుడితో ‘గుడ్ సినిమాస్’ బ్యానర్ పై తెరకెక్కిన ‘రోజులు మారాయి’ చిత్రానికి కథ అందించింది మారుతియే. మళ్ళీ ఇప్పుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి ‘షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్’ ను ప్రకటించారు. సినిమాల పట్ల తపన, మంచి అభిరుచి ఉన్న దర్శకులు, నటీనటులు సరికొత్త షార్ట్ ఫిలిమ్ తీసి కాంటెస్ట్ లో గెలిస్తే వాళ్లకు తనతో కలిసి పనిచేసే అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ కాంటెస్టును త్వరలోనే లాంచ్ చేస్తామని, మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

 

Like us on Facebook