తెలుగులో స్టార్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ సినిమా!

తెలుగులో స్టార్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ సినిమా!

Published on Apr 21, 2015 3:01 PM IST

teja
సరికొత్త ప్రయత్నాలతో, ప్రయోగాలతో దర్శకుడు తేజ సంపాదించిన పేరు, సృష్టించిన సినిమాలు మామూలు విషయాలు కాదు. ఒకప్పుడు అంతా కొత్తవాళ్ళతోనే వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించి, ఎంతోమంది కొత్తవాళ్ళను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత తేజకు దక్కింది. అయితే తాజాగా ఆయన సినిమాలేవీ ఆ ప్రాభవాన్ని చూపలేకపోయాయ్! వరుస అపజయాల తర్వాత మళ్ళీ ఓ సరికొత్త ప్రయత్నంతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తేజ. ప్రస్తుతం తేజ అంతా కొత్తవాళ్ళతో ‘హోరాహోరీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.

‘హోరాహోరీ’ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా తేజ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. “కొత్తవాళ్ళతో తీసినపుడు వాళ్ళకు స్టార్ స్టేటస్ లాంటిది లేకపోవడంతో ఎలాంటి ప్రయోగాలైనా చేయగలం. వారితో నటింపజేయడం కొంత కష్టతరమే అయినా వైవిధ్యమైన సినిమాలు తీయొచ్చు. అందుకే అంతా కొత్తవాళ్ళతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నా. ఇప్పటివరకూ నేను ఒకే ఒక్క స్టార్‌తో సినిమా తీశా. అదే మహేష్ బాబు ‘నిజం’. మహేష్ దర్శకుల నటుడు కావడంతో అతడితో ఏ ఇబ్బందీ రాలేదు. హోరాహోరీ తర్వాత ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నా” అని తెలిపారు తేజ.

దిలీప్, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న హోరాహోరీ సినిమా విషయంలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ అందరినీ తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ నుంచి ఎంపిక చేయడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు