ప్రత్యేక ఇంటర్వ్యూ : అనుష్క – లైఫ్‌లో ఇప్పటివరకూ ఏదీ ప్లాన్ చేసి చేయలేదు!

ప్రత్యేక ఇంటర్వ్యూ : అనుష్క – లైఫ్‌లో ఇప్పటివరకూ ఏదీ ప్లాన్ చేసి చేయలేదు!

Published on Nov 26, 2015 2:00 PM IST

anushka
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి రెండు ప్రతిష్టాత్మక సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సినిమా ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుష్కతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ఇప్పుడు ‘సైజ్ జీరో’.. టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది?

స) నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వరుసగా ఇలాంటి పెద్ద సినిమాలు, నన్ను నేను నిరూపించుకోదగ్గ సినిమాలు ఇలా రావడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. నేను నా లైఫ్‌లో కానీ, కెరీర్లో కానీ ఏదీ ప్లాన్ చేసి చేయలేదు. ప్లాన్ చేసి చేస్తే అది లైఫ్ ఎందుకవుతుంది? ఇవన్నీ అలా ప్లాన్ చేయకుండానే జరిగిపోయాయి. ఈ క్రెడిట్ ఏదైనా ఉంటే ఈ సమయంలో నాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చిన నా దర్శకులకు ఇవ్వాలి.

ప్రశ్న) ‘రుద్రమదేవి’ తర్వాత సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీన్ని ఎలా తీసుకుంటారు?

స) నాకు సూపర్ స్టార్ అన్న పేరు తీసుకునేంత అర్హత లేదండీ. ఏదో అభిమానం కొద్దీ కొందరు అన్నారని నేను సూపర్ స్టార్ ఎలా అయిపోతాను. రజనీ కాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్.. వాళ్ళు లెజెండ్స్. భవిష్యత్‌లో నేను వాళ్ళ స్థాయికి దగ్గరైతే సూపర్ స్టార్ అంటే ఒక అర్థం ఉంటుంది. నేను ఈ బిరుదులు, నంబర్స్ అవీ పెద్దగా పట్టించుకోను.

ప్రశ్న) ‘సైజ్ జీరో’ విషయానికి వద్దాం. స్టార్ హీరోయిన్‌గా చలామణి అవుతూ, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బరువు పెరగడం రిస్క్ అనిపించలేదా?

స) ప్రకాష్ గారు నాకీ కథ చెప్పగానే, ఈ కథలోని ఎమోషన్ విపరీతంగా నచ్చేసింది. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం బరువు పెరగడం అంటే రిస్క్ అనిపించలేదు. చెప్పాలంటే, ఇలా బరువు పెరగడం మంచిది కాకున్నా సినిమా కోసం చేయాలనిపించింది.. చేసేశా. సినిమా కోసం ఎన్నో సాహసాలు చేసిన వారున్నారు. నేను చేసింది అందులో ఓ చిన్న సాహసం.

ప్రశ్న) ‘సైజ్ జీరో’ సినిమా ఏం చెప్పబోతోంది?

స) ‘సైజ్ జీరో’ ఒక బలమైన భావోద్వేగాన్ని సున్నితమైన హాస్యంతో, రొమాన్స్‌తో కలిపి చెప్పిన సినిమా. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అందరిలాంటి సహజమైన మహిళ. ఒక హీరోయిన్ అనే స్టాండర్డ్‌కు దూరంగా ఆ పాత్ర నడుస్తుంది. ఇది కూడా అందరికీ కొత్తగా కనెక్ట్ అయ్యే పాయింట్.

ప్రశ్న) దర్శకుడు ప్రకాష్ గురించి చెప్పండి?

స) ప్రకాష్ గారికి సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. ఆయనో జెన్యూన్ సినిమా లవర్. కథ చెప్పినప్పుడే ఆయన చెప్పాలనుకున్న ఎమోషన్ సరిగ్గా అర్థమైపోయింది. ఇక సినిమా చేస్తున్నపుడు ఆయనకు సినిమా పట్ల ఉన్న విజన్ చూసి ఆశ్చర్యపోయా. ‘సైజ్ జీరో’లో ప్రకాష్ గారి పూర్తి ఎఫర్ట్‌ను చూడొచ్చు.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) సైజ్ జీరోకి బేసిక్ ఎమోషనే మేజర్ హైలైట్! ఇక ఇది కాకుండా స్టార్ కాస్ట్ ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. హీరో ఆర్య, ప్రకాష్ రాజ్, ఊర్వశి.. ఇలా భారీ తారాగణంతో పాటు నిరవ్‌షా సినిమాటోగ్రఫీ, కీరవాణి గారి మ్యూజిక్ స్పెషల్ హైలైట్స్‌గా నిలుస్తాయి.

ప్రశ్న) ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ప్రత్యేక కారణం?

స) తెలిసిందే కదండీ. ఇప్పుడు సినిమాను బాగా తీయడం ఎంత ముఖ్యమో, దాన్ని ప్రేక్షకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో పీవీపీ గారి పకడ్బందీ ప్లాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాంటెస్ట్స్ అని, డబ్స్‌మ్యాష్ అని, రైల్వేలో ప్రమోషన్స్.. ఇలా అన్నీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడీ సినిమా ఇంత భారీ క్రేజ్‌తో పెద్ద ఎత్తున విడుదల కాబోతోందంటే అది పీవీపీ గారి టీమ్ చేపట్టిన స్ట్రాటజీస్ వల్లే!

ప్రశ్న) ‘బాహుబలి 2’ ఎప్పట్నుంచి మొదలవుతుంది?

స) డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు దేవసేన పాత్రలోకి ప్రవేశం చేయాలి. ఇప్పుడు నా శ్రద్ధంతా దానిపైనే ఉంది. ఆ తర్వాత ‘సింగం 3’ కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ రెండే నా మెదడులో తిరుగుతున్నాయి. మరింకే ఇతర విషయాలకు చోటివ్వట్లేదు. (నవ్వుతూ..)

ఇక అక్కడితో అనుష్కతో మా ఇంటర్వ్యూ ముగించి, సైజ్ జీరో సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలిపాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు