ప్రత్యేక ఇంటర్వ్యూ : బోయపాటి శ్రీను – ‘సరైనోడు’ విజయం.. ప్రేక్షకుడి తీర్పు!

ప్రత్యేక ఇంటర్వ్యూ : బోయపాటి శ్రీను – ‘సరైనోడు’ విజయం.. ప్రేక్షకుడి తీర్పు!

Published on Apr 25, 2016 2:03 PM IST

boyapati1
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు బోయపాటి శ్రీనుది ఓ ప్రత్యేక శైలి. మాస్ సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన ఆయన, దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’ గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఇక నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి, ఈ సందర్భంగా తన పుట్టినరోజుకి ప్రేక్షకులిచ్చిన గిఫ్ట్ ‘సరైనోడు’ విజయమని తెలుపుతూ మాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు..

ప్రశ్న) ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సరైనోడు’కి రెస్పాన్స్ ఎలా ఉంది?

స) థ్యాంక్స్. ‘సరైనోడు’కి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఇప్పటికీ చాలా ఏరియాల నుంచి డిస్త్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారని చెబుతున్నారు. ‘మీ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం సర్’ అని వాళ్ళంతా చెబుతూ ఉంటే మన ప్రయత్నం విజయం సాధించిన సంతృప్తి లభించినట్లనిపిస్తుంది.

ప్రశ్న) మొదటి రోజు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం గురించి ఏమంటారు?

స) అలాంటిదేమీ లేదండీ. ‘సరైనోడు’ లాంటి సినిమాకు అసలు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చే అవకాశమే లేదు. అయినా మొదటిరోజు ఏదో అక్కడక్కడా వినిపించింది. అయితే ఏ సినిమాకైనా ప్రేక్షకుడిదే అసలు సిసలైన నిర్ణయం. సాధారణ ప్రేక్షకుడు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నాడు. నేను బాక్సాఫీస్ నంబర్స్ గురించి చెప్పడం లేదు కానీ, ఈరోజు సినిమా ఈస్థాయిలో కలెక్ట్ చేస్తుందంటే అది ప్రేక్షకుడికి నచ్చడం వల్లే! నా పుట్టినరోజుకి ఈ విజయమే పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నా.

ప్రశ్న) సినిమాకు ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది?

స) ఇండస్ట్రీ సర్కిల్‌లో కొంతమంది పెదవి విరిచారు. చాలామంది ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ, ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదిచ్చారు. సినిమా చాలా బాగుంది’ అంటున్నారు. ఇండస్ట్రీలో రకరకాల టాక్స్ వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ పక్కనబెడితే, సినిమా ప్రేక్షకుడికి ఎంతమేరకు నచ్చిందన్నదే ఓ సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేస్తుంది.

ప్రశ్న) సినిమా రిలీజయ్యాక మీకందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?

స) బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చిరంజీవి గారిచ్చిందే! ‘మా ఫ్యామిలీలో కుర్రోడిలా కనిపించే హీరోలో ఈ స్థాయి మాస్ స్టామినా ఉందా? అనిపించేలా బన్నీని చూపించావ్!’ అని చిరంజీవి గారు మెచ్చుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. అలాగే పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్.. ఇలా చాలామంది ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నారు.

ప్రశ్న) ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ని చేసే స్టార్‌ని మాస్ హీరోగా చూపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

స) ‘సరైనోడు’ కథ చాలా కాలంగా ఉన్నదే! బన్నీతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. అతడి సినిమాలన్నీ చూశా. నేనెలా కొత్తగా చూపించాలన్న ఆలోచనతోనే అన్ని ఎమోషన్స్ నిండిన ఈ కథను సిద్ధం చేశా. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్, ఫన్, సెంటిమెంట్, ఒక సామాజిక కోణం.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సినిమాను ప్రేక్షకులు మెచ్చారన్నా ఈ కథలో అవన్నీ కుదరడం, బన్నీ ఈ కథకు సరిగ్గా సరిపోవడం వల్లనే అని చెప్పగలను.

ప్రశ్న) హీరోగా అల్లు అర్జున్‍లో ‘సరైనోడు’ తర్వాత చూసిన మార్పు ఏంటి?

స) అల్లు అర్జున్ ఈ సినిమాతో నటుడిగా పూర్తిస్థాయిలో పరిణతి చెందాడు. ఒక నటుడిగా ఏ ఎమోషన్‌ను ఎలా పండించాలో బన్నీకి బాగా తెలుసన్న విషయం ‘సరైనోడు’తో మరోసారి ఋజువు అయింది. సినిమాలో ఒక సీన్ అని చెప్పలేం కానీ, చాలాచోట్ల బన్నీ తానేంటో నిరూపించుకున్నాడు.

ప్రశ్న) విలన్‌గా ఆది పినిశెట్టి ఈ సినిమాకు ఓ స్థాయి తెచ్చారు. ఆయనను ఎంపిక చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

స) ఈ సినిమాలో హీరో, విలన్.. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు పవర్ఫుల్. బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పుకొని విలన్ తన వయలెన్స్‌ను చూపెడితే, బ్యాక్‍గ్రౌండ్ ఏం చేస్తుందని హీరో తన హీరోయిజం చూపిస్తాడు. ఇలాంటి రెండు పవర్ఫుల్ పాత్రల్లో విలన్ అంటే కచ్చితంగా అతడికీ ఓ క్రేజ్ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే హీరో ఆదిని ఎంపిక చేశా. ఆది కూడా తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించాడు. ఆ పాత్ర ప్రవర్తించే తీరులో కూడా కొత్తదనాన్ని ఆది బాగా పట్టుకున్నాడు.

ప్రశ్న) హీరోయిజంని హైలైట్ చేసే ప్రయత్నంలో హింస ఎక్కువైందని వినిపించింది. దాని గురించి మీరేమంటారు?

స) ఈ సినిమాలో ఎక్కడా అందరూ అంటున్న హింస అయితే లేదు. ఎమోషన్ నుంచి పుట్టుకొచ్చే ఫైట్స్‌లో హింస కనబడదు. నా సినిమాలన్నీ ఈ అంశాన్నే బేస్ చేసుకొని నడుస్తుంటాయి. ఇక మాస్ ఎంటర్‌టైనర్‌లో ఫైట్స్ విషయంలో కాస్త స్థాయి పెరుగుతుంది. అలా అని హింస అనిపించేలా అది ఉండకుండా నేనూ ఎప్పుడూ జాగ్రత్త పడుతూనే ఉంటా.

ప్రశ్న) కొద్దికాలంగా రన్‌టైమ్ అనే అంశాన్ని ప్రేక్షకులు కూడా పట్టించుకుంటూ వస్తున్నారు. అదే క్రమంలో సరైనోడు రన్‌టైమ్ ఎక్కువని వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు?

స) రన్‌టైమ్ అనేది కథకు సంబంధించిన విషయం. మనం చెప్పాల్సిన కథ ఎంతవరకు ఉండాలీ? కథ పరిధి ఎంత? లాంటి చాలా అంశాలు సినిమా నిడివిని ప్రభావితం చేస్తాయి. ‘సరైనోడు’లో కథ ప్రకారంగా వచ్చే పాటలు ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి.. ఇలాంటివన్నీ చెప్పాలనుకున్నపుడు రన్‌టైమ్‌‌ను కావాలని కుదించకూడదు.

ప్రశ్న) ఎక్కువగా మాస్ సినిమాలనే చేస్తున్నారు. మీ నుంచి పూర్తిగా డిఫరెంట్ జానర్ సినిమాలేవైనా ఊహించవచ్చా?

స) తప్పకుండా! ఇప్పటికి నేను ఈ ట్రాక్‌లో ఉన్నా కాబట్టి ఈ సినిమాలు చేస్తున్నా. రేపు కచ్చితంగా ఓ టైమ్ వస్తుంది. అప్పుడు వేరే ఇతర జానర్స్‌లోనూ సినిమాలు చేయడం అనే తప్పనిసరి అవుతుంది.

ప్రశ్న) కథ రాసేప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి?

స) నేనో కథ రాయాలంటే ముందుగా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. దాని చుట్టూ ఫ్యామిలీ, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటా. నా సినిమాల్లో మాస్ ఎక్కువ ఉంటుంది అంటూంటారు. అది కథలోని ఎమోషన్ నుంచి, దానిలో ఏదోమూల ఉండే సామాజిక కోణం నుంచి రావాలి. అప్పుడే ఆ మాస్ అంశానికి ఓ అర్థం ఉంటుంది.

ప్రశ్న) చివరగా మీ తదుపరి సినిమా గురించి చెప్పండి?

స) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేయనున్నా. దానికి స్క్రిప్ట్ పూర్తి చేసే పనుల్లో ఉన్నా. అది నా స్టైల్లో సాగే అంశాలతో కూడిన సినిమా అయినా కూడా, లవ్‌స్టోరీ ప్రధానంగా నడుస్తుంది. మరో రెండు, మూడు నెలల్లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

ఇక అక్కడితో దర్శకుడు బోయపాటికి మరోసారి అభినందనలు తెలుపుతూ మా ఇంటర్వ్యూ ముగించాం.

ఇంటర్వ్యూ – వి. మల్లికార్జున్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు