ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : వెన్నెల కిషోర్ లేకుండా ఈ సినిమా చేసేవాడిని కాదు – మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : వెన్నెల కిషోర్ లేకుండా ఈ సినిమా చేసేవాడిని కాదు – మోహన్ కృష్ణ ఇంద్రగంటి

Published on Jun 14, 2017 4:21 PM IST


ఇటీవల విడుదలైన అమీ తుమీ చిత్రంతో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అమీ తుమీ చిత్రం విజయంసాధించిన సందర్భంగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో జరిపిన ఇంటర్వ్యూ లో ఆయన చిత్రం గురించి పలు విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ప్ర )సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది ?

జ )మేము ప్రీరిలీజ్ ఈవెంట్ లు, భారీ స్థాయిలో ఆడియో ఫంక్షన్ లు లాంటి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు. చాలా తక్కువ స్థాయిలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాము. అయినా కూడా నా సినిమాలోని కంటెంట్ పై కమ్మకం ఉంది. కచ్చితంగా ఆడియన్స్ మనసు దోచుకుంటుందని నమ్మాను. నేను ఊహించిందే జరిగింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ వలన హైదరాబాద్ లోనే 17 షో లు పెంచాము.

ప్ర) చిత్ర విజయానికి కారణం ఏమని అనుకుంటున్నారు ?

జ) సినిమాలోని కొత్తదనంతో కూడిన క్లీన్ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి కామెడీ ఉన్న చిత్రాలు చాలా అరుదుగా వస్తూంటాయి. మా చిత్రానికి అనుకూలించిన ప్రధాన కారణం ఇదే. ఇక వెన్నెల కిషోర్, శ్యామల మరియు ఈషా ల ఫెర్ఫామెన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్లింది.

ప్ర) వెన్నెల కిషోర్ కామెడీ ఈ చిత్రంలో హైలైట్ అయింది..షూటింగ్ దశలో ఈ విషయాన్ని ఊహించారా ?

జ) అవును. అమీతుమీ చిత్రం ద్వారా వెన్నెల కిషోర్ మరో స్థాయికి చేరుకుంటాడని షూటింగ్ సమయంలోనే చెప్పేవాడిని. వెన్నెల కిషోర్ బిజీగా ఉండే ఆర్టిస్టు. అతడి డేట్స్ దొరకడం కష్టం. ఈ చిత్రం గురించి అతనికి వివరించే సమయంలోనే చెప్పాను. అతనికి సమయం లేకుంటే ఈ సినిమానే ఆపేస్తానని. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిది.

ప్ర) ఈ చిత్రంలో తెలంగాణ యాస ఎక్కువగా ఉపయోగించారు.. దానిగురించి..?

జ) నాకు తెలంగాణ సంప్రదాయాలు ఇష్టం. తెలంగాణ యాసని కేవలం కామెడీ కోసమే ఉపయోగిస్తున్నారని నాకు అనిపించేది. ఈషా, తనికెళ్ళ భరణి గారి పాత్రలకు సాధారణ తెలుగు ఉపయోగించి ఉంటే సినిమా అంత బాగా వచ్చి ఉండేది కాదు.

ప్ర) ఈ చిత్రంలో ముగ్గురు దర్శకులు నటించారు..వారు ఎలాంటి సలహాలు ఇచ్చారు ?

జ) అడవి శేష్, కిషోర్ మరియు అవసరాల శ్రీనివాస్ లు నా పనిలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. సాధారణ నటులుగానే వారు ఈ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ప్రారంభం నుంచే వారిలో ఉంది.

ప్ర) కామెడీ మీకు ఇష్టమైన అంశమా ?

జ) అవును ! ఈ విషయాన్ని చెప్పడానికి చాలా మంది కష్టపడతారు. ఓ థ్రిల్లర్ సినిమానో, మాస్ చిత్రాన్నో తీయడం కంటే కామెడీ చిత్రం తీయడం కష్టం.

ప్ర) ఈషా మరియు శ్యామల ల పెర్ఫామెన్స్ గురించి ?

జ) నేను ఇంతకు ముందు ఈషాతో రెండు సినిమాల కోసం పనిచేశాను. అప్పటికి ఈషా ఇంకా కుదురుకోలేదు. ఈ చిత్రం ఆమెకు మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నా. తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటులతో ఆమె నటించిన విధానం నిజంగా ప్రసంశనీయం. ఇక శ్యామల గురించి చాలా మందికి తెలియదు.ఈ చిత్రం లో హైలైట్ అయిన అంశాలలో ఆమె పాత్ర కూడా ఒకటి.

ప్ర) ఈ చిత్ర నిర్మాత నుంచి ఎలాంటి స్పందన వస్తోంది ?

జ) నా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే మంచి వసూళ్లని సాధించింది. నిర్మాతగా ఆయనకు ఇది తొలి చిత్రం. మొదటి సినిమానే విజయం సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నారు.

ప్ర) మీ తదుపరి చిత్రాలు ?

జ) అమీతుమీ ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాను. ప్రేమ కథ లేకుంటే గ్యాంగ్ స్టర్ కథతో అయినా సినిమా చేస్తాను.

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి వెల్లడించిన అమీతుమీ చిత్ర విశేషాలు ఇవి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు