ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – మొదటి నుండి దర్శకత్వం చేయాలనేదే నా కోరిక !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – మొదటి నుండి దర్శకత్వం చేయాలనేదే నా కోరిక !

Published on Oct 25, 2017 1:18 PM IST

హీరోగా పరిచయమై మెల్లగా సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ కెరీర్లో పెద్ద టర్న్ తీసుకుని దర్శకుడిగా మారుతున్నారు. సుశాంత్ హీరోగా ‘చి౹౹ల౹౹సౌ’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సందర్బంగా ఆయన మా 123తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) మీ రెండు కొత్త సినిమాల గురించి చెప్పండి ?
జ) నా రెండు సినిమాలు ‘హౌరా బ్రిడ్జ్, దృష్టి’ రెండూ కూడా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా ఉంటాయి. ‘హౌరా బ్రిడ్జ్’ లవ్ స్టోరీ అయితే ‘దృష్టి’ థ్రిల్లర్.

ప్ర) సినిమా పట్ల మీకు ఇష్టం ఎప్పుడు మొదలైంది ?
జ) కమల్ హాసన్ గారు చేసిన ‘నాయగన్’ సినిమా చుసిన క్షణం నుండి నాలో ఆ ఇష్టం మొదలైంది. ఆ సినిమా రెగ్యులర్ సినిమాలకన్నా భిన్నంగా ఉంటుంది. నన్ను చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. అప్పటి నుండి చేస్తే సినిమాల్లోనే చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్ర) సినిమాల్లోకి ఎలా వచ్చారు ?
జ) నేను సినిమాల్లోకి వెళతాను అనగానే మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ముందు చదువు పూర్తి చేసుకో అన్నారు. దాంతో ఎంబిఎ చేసి ముంబైలో ఉంద్యోగం కూడా చేసి సంవత్సరానికి సరిపడా దాచిపెట్టుకుని హైదరాబాద్ వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. కానీ నా లక్ వేరేలా మారింది. అది అందరికీ తెలిసిన సంగతే.

ప్ర) మీ యాక్టింగ్ కెరీర్ బాగానే ఉంది కదా మరి దర్శకుడిగా ఎందుకు మారడం ?
జ) అవును బాగా ఆలోచించిన తర్వాత కెరీర్ బాగున్నప్పుడే దర్శకత్వం చేయడం మంచిదని నాకనిపించింది. వయసులో ఉండి, కష్టపడగలిగినప్పుడే ప్రయత్నం చేయాలి.

ప్ర) సుశాంత్ నే ఎందుకు చూజ్ చేసుకున్నారు ?
జ) ఇప్పటి వరకు ఆయన అన్నీ కమర్షియల్ సినిమాలే చేశాడు. ఒక పార్టీలో కలిసినప్పుడు ఇదే చెప్తూ తనకు సరిపోయే, ఏదైనా కొత్తగా చేయాలనీ ఉందని అన్నాడు. దాంతో నా దగ్గరున్న కథ చెప్పాను. ప్రొడ్యూజర్ కూడా దొరకడంతో అన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయాయి.

ప్ర) దర్శకత్వంలోకి వచ్చి కెరీర్ ను రిస్క్ చేస్తున్నానని మీకనిపించలేదా ?
జ) నేనేదే గొప్ప గొప్ప సినిమాలు చేయాలని ఇక్కడకు రాలేదు. నాకు నచ్చిన సినిమాలనే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చేసేది కూడా మంచి రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్. మనస్ఫూర్తిగా ఆ సినిమా చేస్తున్నాను. దర్శకత్వం అనేది నా యాక్టింగ్ కెరీర్ కు ఏమాత్రం ఇబ్బంది కలిగించదు.

ప్ర) చిన్మయి నుండి మీకెలాంటి సపోర్ట్ లభించింది ?
జ) ఆమె నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంది. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న సంగతి మొదటగా ఆమెకే చెప్పాను. ఆమె సపోర్ట్ తోనే ఇంత వరకు వచ్చాను.

ప్ర) సినిమాని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ?
జ) ఈ సంవత్సరం ఆఖరుకల్లా పూర్తిచేయాలని అనుకుంటున్నాను. ఒకసారి పూర్తవగానే రిలీజ్ డేట్స్ పై నిర్ణయం తీసుకుంటాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు