ప్రత్యేక ఇంటర్వ్యూ : రామ్ – స్టార్ స్టేటస్ కోసం అలాంటివి అస్సలు చేయను!

ప్రత్యేక ఇంటర్వ్యూ : రామ్ – స్టార్ స్టేటస్ కోసం అలాంటివి అస్సలు చేయను!

Published on Sep 28, 2016 6:30 PM IST

ram
‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా ‘హైపర్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. దసరా సీజన్‌కు మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు పక్కాగా సిద్ధమైపోయింది. ఈ సందర్భంగా హీరో రామ్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ మాత్రమే చేస్తూ ఉండడం బోర్ అనిపించడం లేదా?

స) కమర్షియల్ సినిమా అంటే ఎందుకు చిన్న చూపు చూస్తారో నాకర్థం కాదు. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ జానర్‌నే ఇష్టపడతారు. ఈ జానర్‌కు రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది కూడా. ఇక ఇవన్నీ పక్కనబెడితే నా గత చిత్రం నేను శైలజ పూర్తిగా లవ్‌స్టోరీ, హైపర్ అందుకు భిన్నమైన సినిమా.

ప్రశ్న) హైపర్ సినిమాలో కొత్తదనం ఏం చూపిస్తున్నారు?

స) తండ్రి కొడుకుల బంధాన్ని ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించాం. సినిమాకు అదే హైలైట్‌గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది.

ప్రశ్న) ‘నేను శైలజ’కు ముందు సరైన హిట్ రాని సమయంలో ఎలా ఫీలయ్యేవారు?

స) ‘నేను శైలజ’కు ముందు సరైన హిట్ లేదన్న విషయం వాస్తవమే! అయితే అప్పుడు కూడా యాక్టింగ్ పరంగా నాకు విమర్శలు రాలేదు. ఎందుకంటే ప్రేమంట, జగడం, మసాలా ఇలా నేను డిఫరెంట్‌గా ఏదైనా చేస్తే వర్కవుట్ అవ్వలేదు. దాంతో అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ నేను శైలజతో మళ్ళీ హిట్ కొట్టా. ఇదంతా కాలంతో నేర్చుకోవడమే!

ప్రశ్న) కమర్షియల్ సినిమాల్లో కొత్త కథలు దొరకడం కష్టం కదా. దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు?

స) నిజమే. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడియన్స్ అభిరుచులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఒకరికి బాగా నచ్చింది ఇంకొకరికి అస్సలు నచ్చకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏవైతే సెట్ అవుతాయో అలాంటి కథలనే జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. అందులో కొన్నింటిని మెచ్చుతున్నారు, ఇంకొన్నింటిని మెచ్చడం లేదు.

ప్రశ్న) రభసతో భారీ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా?

స) ఇలాంటివి నేనస్సలు పట్టించుకోను. సినిమా ఎలా ఉంటుందన్నది ఎక్కువగా స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. కిషోర్ తిరుమలతో నేను శైలజ చేసేప్పుడు కూడా చాలా మంది వద్దన్నారు. నేను స్క్రిప్ట్‌నే నమ్మాను కాబట్టి సక్సెస్ వచ్చింది అనుకుంటున్నా.

ప్రశ్న) మీది, రాశిఖన్నాది మంచి జోడి అని అంటూంటారు. రాశిఖన్నాతో మరోసారి నటించడం గురించి చెప్పండి?

స) నిజమే! రాశిఖన్నాది, నాది మంచి జోడీ. ఈ సినిమాలోనూ మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. హైపర్‌లో రాశి పాత్రలోనూ మంచి ఫన్ ఉంటుంది.

ప్రశ్న) మీకున్న టాలెంట్‌కు మీరు ఇంకా పెద్ద స్టార్ అవ్వాల్సింది అన్న కామెంట్స్‌కు ఎలా స్పందిస్తారు?

స) స్టార్ స్టేటస్ కోసం లాబీలు చేయడం, రోల్స్ పనిగట్టుకొని అడగడం నాకు నచ్చదు. ఇప్పటివరకూ నాకంటూ ఒక దారి ఏర్పరచుకొని సినిమాలు చేస్తూ వచ్చా. ఏదో ఒకరోజు నా సినిమాలకు రావాల్సినంత గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) పరాజయాలే ఈ పాఠాలు నేర్పాయా?

స) ఒకరకంగా అదే అనొచ్చు. నా కెరీర్ మొదట్లోనే దేవదాస్, రెడీ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశా. అప్పట్లోనే మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇక అదే సమయంలో సినిమాలు ఫెయిలయ్యి కెరీర్ పక్కదారి పట్టింది కూడా. ఇప్పుడిప్పుడే నాకు ఎటువంటి సినిమాలు సెట్ అవుతాయో తెలుసుకొని ఆ రకంగానే ముందుకు వెళుతున్నా.

ప్రశ్న) మీ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరితో పంచుకోరు ఎందుకని?

స) నాకెందుకో వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పుకోవాలని అనిపించదు. అందుకే సమయం చిక్కినప్పుడల్లా నాతో నేను గడపడానికి ప్రపంచం చుట్టేసి వస్తూంటా.

ప్రశ్న) స్టార్ చక్రంలో ఇరుక్కోకుండా సినిమా చేయగలిగితే ఎలాంటి సినిమా చేస్తారు?

స) నటుడిగా నన్ను సంతృప్తి పరిచి, పాత్రల ద్వారా పుట్టే బలమైన కథలను ఎంచుకుంటానేమో!

ప్రశ్న) మీ సహచర హీరోలతో కాంపిటీషన్‌ను గమనిస్తుంటారా?

స) కచ్చితంగా! ఎవరెవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు లాంటివి ఎప్పుడూ చూస్తూనే ఉంటా. వారి సినిమాల నుంచి మనమేం నేర్చుకోవచ్చన్నది కూడా ఆలోచిస్తూంటా.

ప్రశ్న) పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు?

స) ఇప్పటికైతే పెళ్ళి ఆలోచన అస్సలు లేదు. ఆ రోజు వస్తే నేనే తెలియజేస్తా.

ప్రశ్న) హైపర్ సినిమాను ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు?

స) ఈ సినిమాకు నెరేషనే ప్రధాన బలం. నా సినిమాల స్టైల్లోనే ఎంటర్‌టైనింగ్‌గా హైపర్ ఉంటుంది.

ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులు ఏంటి?

స) ప్రస్తుతానికి ఒక సినిమా డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే కొత్త ప్రాజెక్టు ఏంటన్నది తెలియజేస్తా.

ఇక అక్కడితో ఈ శుక్రవారం విడుదలవుతోన్న హైపర్ సినిమా విజయం సాధించాలని కాంక్షిస్తూ రామ్‌తో మా ఇంటర్వ్యూ ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు