ప్రత్యేక ఇంటర్వ్యూ : అవసరాల శ్రీనివాస్ – ‘జ్యో అచ్యుతానంద’ను ఎలా రిసీవ్ చేసుంటారో అని భయపడ్డా!

ప్రత్యేక ఇంటర్వ్యూ : అవసరాల శ్రీనివాస్ – ‘జ్యో అచ్యుతానంద’ను ఎలా రిసీవ్ చేసుంటారో అని భయపడ్డా!

Published on Sep 15, 2016 5:07 PM IST

Avasarala-Srinivas
‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ తన రెండో సినిమాతోనూ ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. విడుదలకు ముందు నుంచే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న పెద్ద ఎత్తున విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా శ్రీనివాస్ మార్క్ క్లాస్ కామెడీకి అన్నివర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ..

ప్రశ్న) ‘జ్యో అచ్యుతానంద’కి మీకెలాంటి రెస్పాన్స్ వస్తోంది?

స) చాలా బాగుంది. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల దగ్గర్నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా సినిమా తమకెలా కనెక్ట్ అయిందో చెబుతూ కొందరు పంపిన మెయిల్స్ ఎంతో సంతృప్తినిచ్చాయి.

ప్రశ్న) సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ముందే ఊహించారా?

స) అస్సల్లేదు. నిజానికి నేను ఈ కథ రాసుకునేప్పుడు ఈ సినిమా జనాలకు కనెక్ట్ అవుతుందా? పేపర్‌పైనే కాస్త గందరగోళంగా ఉంటుంది. సినిమాగా ప్రేక్షకులకు చేరేలా నేను చెప్పగలనా? అని చాలా భయాలుండేవి. ప్రేక్షకులకు నేననుకున్నది చేరడంతో సక్సెస్ మరింత ఉత్సాహానిచ్చింది.

ప్రశ్న) బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?

స) నేను ఈ కలెక్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నిర్మాత సాయి కొర్రపాటి గారైతే కలెక్షన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు మరో సినిమా అవకాశం కూడా ఇచ్చారు.

ప్రశ్న) సినిమా మొదట్లోనే హీరోలిద్దరికీ పెళ్ళైనట్లు చూపించడం రిస్క్ అనిపించలేదా?

స) నిజమే! చాలామంది మొదట్లో కథను ఇలా మొదలుపెడితే బాగోదేమో అన్నారు. కానీ నాకు ముందునుంచీ ఈ విషయంలో పక్కా క్లారిటీ ఉంది. ఈ యాంగిల్ చాలా కొత్తగా ఉంటుందనే ఇలా నెరేట్ చేశా.

ప్రశ్న) రివ్యూలను మీరు పట్టించుకుంటారా?

స) రివ్యూలను ఫాలో అవుతుంటా. అయితే సినిమా గురించి నా ఆలోచనలన్నీ అయిపోయాక, పనులన్నీ తీరిపోయాక తీరిగ్గా రివ్యూలను చదువుతా. నా సినిమా గురించి ఎవరెలా రాశారో తెలుసుకోవాలని ఉంటుంది.

ప్రశ్న) ఇద్దరు అన్నదమ్ముల మీ కథలో నారా రోహిత్, నాగ శౌర్య ఇద్దరూ ఒదిగిపోయారు. ఈ ఇద్దరిలో మీకు ఎవరి రోల్ ఎక్కువిష్టం?

స) నేను మా ఫ్యామిలీలో చిన్నవాడ్ని కాబట్టి నాగ శౌర్య రోల్ బాగా కనెక్ట్ అయ్యేది. నారా రోహిత్ రోల్ కూడా ప్రేక్షకులంతా బాగా రిసీవ్ చేసుకున్నారు.

ప్రశ్న) సెకండాఫ్‌లో హీరోల తల్లి పాత్రను తగ్గించారని, ఆమె పాత్ర ఇంకొంచెం ఉంటే బాగుండేదని టాక్ వినిపించింది. దీనిపై మీరేమంటారు?

స) నేను ఈ జనరేషన్ అన్నదమ్ముల కథ చెబుతున్నానన్న కాన్షియస్‌తోనే తల్లి పాత్రను కావాలనే కాస్త తగ్గించా. ఈ జనరేషన్‌లో ఒకరు తమ నిర్ణయాన్ని ఎవ్వరూ ప్రభావితం చేయకూడదన్న ఆలోచనలో ఉంటారు.దాన్నే కథ ద్వారా ఇలా చెప్పాలనుకున్నా.

ప్రశ్న) ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి?

స) ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత మళ్ళీ అలాంటి రొమాంటిక్ కామెడీయే చేయకూడదని ముందే ఫిక్స్ అయ్యా. అలా అనుకొనే కొత్తగా ఉండేలా, మనదైన ఎమోషన్‌ను చెప్తూ ‘జ్యో అచ్యుతానంద’ కథ రాశా.

ప్రశ్న) యాక్టింగ్, డైరెక్షన్‌లో మీకేది ఇష్టం?

స) రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సరైన క్రెడిట్ ఇస్తే ఇతర దర్శకులకు పనిచేయడానికి కూడా సిద్ధమే!

ప్రశ్న) ఆర్ట్ వర్క్ విషయంలో ‘జ్యో అచ్యుతానంద’కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ ఇంటి సెట్ గురించి చెప్పండి?

స) ఓ ఎగువ మధ్య తరగతి ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఆ ఇంటి సెట్‌ను డిజైన్ చేయించాం. అందరూ అది సెట్ అనుకోలేదంటేనే మేం మంచి విజయం సాధించామని. కథకు అవసరమయ్యేలా ఆ ఇంటి సెట్‌ను తయారు చేయించిన నిర్మాత సాయి కొర్రపాటి గారికి థ్యాంక్స్ చెప్పాలి.

ప్రశ్న) జ్యో అచ్యుతానందకు మీరందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?

స) ఈ సినిమా చూశాక మేం ఇంతకు ముందులా లేమంటూ చాలామంది బ్రదర్స్ నాకు మెయిల్స్ పంపారు. అదెంతో సంతృప్తినిచ్చింది.

ప్రశ్న) హంటర్ అనే అడల్ట్ సినిమాలో నటించడానికి కారణం?

స) ప్రత్యేకమైన కారణమంటే ఆ కథలో బేసిక్ ఎమోషన్ బాగా నచ్చింది. అందుకే అడల్ట్ కథ అయినా ఓకే చెప్పా.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) ప్రస్తుతానికి నేను ఒక్క హంటర్ రీమేక్‌పైనే పనిచేస్తున్నా. ఆ సినిమా పూర్తయ్యాకే నా దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి సినిమా గురించి ఆలోచిస్తా.

ఇక అక్కడితో అవసరాల శ్రీనివాస్‌తో మా ఇంటర్వ్యూను ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు