ప్రత్యేక ఇంటర్వ్యూ : వీరభద్రం – అందరం కసితో పనిచేసిన సినిమా ‘చుట్టాలబ్బాయి’!

ప్రత్యేక ఇంటర్వ్యూ : వీరభద్రం – అందరం కసితో పనిచేసిన సినిమా ‘చుట్టాలబ్బాయి’!

Published on Aug 17, 2016 4:50 PM IST

Veerabhadram-Chowdary
‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం, మూడో సినిమా ‘భాయ్’ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని తాజాగా ‘చుట్టాలబ్బాయి’ అనే సినిమాతో మనముందుకు వచ్చేస్తున్నారు. ఆది, నమితా ప్రమోద్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (ఆగష్టు 19న) పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘చుట్టాలబ్బాయి’ సినిమా గురించీ, తన కెరీర్ గురించీ దర్శకుడు వీరభద్రం చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ‘చుట్టాలబ్బాయి’ విడుదలకు సిద్ధమైపోయింది. సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారు?

స) ‘చుట్టాలబ్బాయి’ కచ్చితంగా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ‘భాయ్’ తర్వాత మళ్ళీ నేనేంటో నిరూపించుకోవాలనే ఈ కథ తయారు చేశా. అన్ని కమర్షియల్ అంశాలనూ మేళవించుకున్న ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని, కామెడీ సినిమాలను ఎంజాయ్ చేసేవారందరికీ విపరీతంగా కనెక్ట్ అవుతుందని ధీమాగా చెప్పగలను.

ప్రశ్న) ‘భాయ్’ పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారనే చెప్పొచ్చు. ఆ ఫేజ్‌ను ఎలా హ్యాండిల్ చేశారు. చుట్టాలబ్బాయి ప్రాజెక్టు ఎలా మొదలైంది?

స) సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసిందే కదా! సక్సెస్ ఉంటేనే ధైర్యంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ‘భాయ్’ తర్వాత చాలామంది హీరోలనే కలిశా. ఒకటి, రెండు ప్రాజెక్టులు చివరివరకూ వచ్చి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. అప్పుడే ‘చుట్టాలబ్బాయి’కి నిర్మాతలైన రామ్, వెంకట్ కలిశారు. నేను రాసిన కథ వాళ్ళకు నచ్చి సినిమా చేద్దామన్నారు. అదే కథ ఆదికి చెప్పగానే, అతడూ వెంటనే ఓకే చెప్పేశాడు. అలా అన్నీ కుదిరి ఇవాళ సినిమా మీ ముందుకు వచ్చేస్తోంది.

ప్రశ్న) సినిమాలో ఆది రోల్ ఎలా ఉండబోతోంది?

స) సిటీలో ఉండే ఓ సరదా సరదా కుర్రాడిగా ఆది ఈ సినిమాలో కనిపిస్తాడు. సరదాగా సాగిపోయే అతడి జీవితంలో కొన్ని అనుకోని మలుపులు రావడంతో, కథంతా ఏయే మలుపులు తిరిగిందీ అన్న అంశం చుట్టూ సినిమా నడుస్తూంటుంది. ఎనర్జిటిక్ రోల్‌లో ఆది చాలా బాగా చేశాడు.

ప్రశ్న) సాయికుమార్‌ గారికి సినిమాలో మొదట్నుంచీ రోల్ ఉందా? ఆది హీరో అవ్వడంతో ప్రత్యేకంగా ఆ పాత్రను రాసుకున్నారా?

స) కథలో సాయికుమార్ గారి స్థాయికి సరిపడే రోల్ మొదట్నుంచీ ఉంది. అయితే ఆ పాత్ర ఆయన చేస్తారని అనుకోలేదు. కథ విన్నప్పుడే ఈ పాత్ర చేస్తానని ఆయన అనడంతో సంతోషం వేసింది. ఇప్పుడు ఆయన వల్ల ఈ సినిమాకు స్థాయి పెరిగిందనే చెప్పాలి. సాయికుమార్ గారు, వాళ్ళబ్బాయి ఆదిల మధ్యన వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

ప్రశ్న) నిర్మాతలు కొత్తవారు, హీరో ఆదికి కొద్దికాలంగా హిట్స్ లేవు, మీ గత సినిమా పరాజయం పాలైంది. ఈ కారణాలేమైనా ప్రొడక్షన్ సమయంలో మీపై ఒత్తిడి తీసుకొచ్చాయా?

స) ఒత్తిడి అయితే తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇష్టంతో పనిచేస్తామో వాటన్నింటినీ సులువుగా ఎదుర్కోగలమన్నది నా నమ్మకం. ఈ కథకు ఒక యంగ్ హీరో అయితే బాగుంటుందని అనుకొని ఆదికి కథ చెప్పా. వినగానే ఆది ఓకే చెప్పేయడంతో సినిమా మొదలైంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎవ్వరికైనే హిట్ అవసరమే, మేం ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో పనిచేశాం. రేపు సినిమాలో మా కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఆడియో, ట్రైలర్ విడుదలైన రోజునుంచి అనూహ్యంగా సినిమా బిజినెస్ కూడా బాగా జరగడం మొదలైంది. ప్రేక్షకులూ సినిమాపై మంచి ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. నేడు ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున విడుదలవుతుందన్నా అదంతా మేము మొదట్నుంచీ సినిమాపై నమ్మకంగా పనిచేయడం వల్లే!

ప్రశ్న) స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడ్డారు?

స) ఈ సినిమాలో పాటలకు మంచి స్కోప్ ఉంది. థమన్ సంగీత దర్శకుడు అయితే బాగుంటుందని ముందునుంచీ అనుకున్నా. మేము అనుకున్నట్లుగానే అన్నీ మంచి పాటలు ఇచ్చాడు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. థమన్ ఈ సినిమాకు మరింత స్థాయి తెచ్చాడనే చెప్పొచ్చు.

ప్రశ్న) ‘చుట్టాలబ్బాయి’కి మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్. నేనొక గొప్ప కథ చెప్పట్లేదు. సరదాగా ఓ కామెడీ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవన్నీ ఓ కథగా అందించే ప్రయత్నం చేశా. ఆ కథే ఈ సినిమాకు మేజర్ హైలైట్ అనొచ్చు. ఆది ఎనర్జీ, థమన్ మ్యూజిక్, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్.. ఇలా అన్నీ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయి.

ప్రశ్న) ఫైనల్ ఔట్‌పుట్ చూశాక టీమ్ అంతా ఎలా ఫీలయ్యారు?

స) సాయికుమార్ గారితో సహా అందరం ఫైనల్ ఔట్‌పుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపూ అందరూ సరదాగా నవ్వుతూ ఉన్నారు. ఒక కామెడీ సినిమా టార్గెట్ అందరినీ నవ్వించడమే అయినపుడు, అందులో విజయం సాధించాక ఇంకేం కోరుకుంటాం? రేపు ప్రేక్షకులు కూడా సినిమా చూసి సరదాగా నవ్వుతూ, మంచి కామెడీ సినిమా చూశామన్న ఫీలింగ్‌తో బయటకొస్తారని కోరుకుంటున్నా.

ప్రశ్న) తదుపరి సినిమా గురించి ఏమైనా ప్లాన్ చేశారా?

స) ప్రస్తుతానికైతే రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఓ పెద్ద బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది. చుట్టాలబ్బాయి నిర్మాత రామ్‌తో కూడా ఓ సినిమా ప్లాన్ చేశా. అయితే ‘చుట్టాలబ్బాయి’ తర్వాత గానీ ఈ సినిమాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.

‘చుట్టాలబ్బాయి’ సినిమా మంచి విజయం సాధించాలని, వీరభద్రంకు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఇంటర్వ్యూ ఇక్కడితో ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు