ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – టాలీవుడ్ ఒకే మూసలో సినిమాలు చేస్తుందనే వారికి సమాధానమే ‘అనుక్షణం’.

ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – టాలీవుడ్ ఒకే మూసలో సినిమాలు చేస్తుందనే వారికి సమాధానమే ‘అనుక్షణం’.

Published on Sep 12, 2014 12:34 AM IST

manchu-vishnu
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న కమర్షియల్ సినిమాలకు, మూస ధోరణి సినిమాలకు చెక్ పెడుతూ మంచు విష్ణు – రామ్ గోపాల్ వర్మ కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘అనుక్షణం’. మొట్టమొదటి సారిగా ఆక్షన్ ద్వారా రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాసేపు మంచు విష్ణుతో మాట్లాడి అనుక్షణం విశేషాలను, ఆక్షన్ కి సంబందించిన విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) కమర్షియల్ ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కకి వచ్చి ఓ చిన్న బడ్జెట్ మరియు పూర్తి డిఫరెంట్ సినిమా చేయడానికి గల కారణం ఏమిటి.?

స) ప్రస్తుతం మన ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేస్తేనే స్టార్స్ అని ఒక మూస ధోరణిలో కొట్టుకుపోతున్నాం. అందువల్లే బడ్జెట్ లు కూడా పెరిగిపోతున్నాయి. అలాగే మనవాళ్ళు ఎప్పుడు ఇవే సినిమాలు చేస్తారా డిఫరెంట్ సినిమాలు చేయరా అని అంటుంటారు వాటన్నిటికీ అనుక్షణం సినిమా సమాధానం. గతంలో మా నాన్న గారు, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వారు డిఫరెంట్ సినిమాలు చేసారు కాబట్టే వాళ్ళకి ఇప్పటికీ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. నేను కూడా వాళ్ళ బాటలో వెళ్ళాలనుకుంటున్నాను.

ప్రశ్న) మరి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మోహన్ బాబు గారు ఏమన్నారు.?

స) మొదట నాన్నగారికి పెద్దగా ఇష్టం లేదు. ఎంటిరా అందరూ మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతుంటే నువ్వేమో ఇలాంటి సినిమాలు ఎంచుకుంటున్నావని అన్నారు. నేనేమో ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు నాన్నా, కానీ యాక్షన్ సినిమా నచ్చే వాళ్ళందరికీ నచ్చే సినిమా. సినిమా చూసే ఆడియన్స్ ని టెన్షన్ పెట్టిస్తుందని చెప్పాం. ఒకవైపు నేను, మరోవైపు వర్మ మమ్మల్ని చివరికి కాదనలేక ఓకే అన్నారు. సినిమా అంతా అయ్యాక నాన్నగారికి చూపించాం.. ఆయన బయటకి వచ్చి ఒకే ఒక మాట బాగా టెన్షన్ పడ్డాను రా అన్నాడు. దాంతో మేము చెప్పాలనుకొన్న విషయంలో సక్సెస్ అయిపోయామని అనుకున్నాం, ఇక ఫైనల్ రిజల్ట్ ఏంటనేది 13న ప్రేక్షకులే నిర్ణయించాలి.

ప్రశ్న) ‘అనుక్షణం’ సినిమా ఎంచుకోవడంలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి.?

స) బయట ఇండస్ట్రీల్లో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి.. తెలుగులో కొత్త సినిమాలు రావు అనే వారికి సమాధానమే ‘అనుక్షణం’. నాకు బాగా నచ్చినది అంటే కాన్సెప్ట్.. సినిమాలో ఏం జరుగుతుందా అనేది ఊహించలేరు. జస్ట్ తన ఆనందం కోసమే హత్యలు చేసే ఓ సైకో కిల్లర్ ని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకుంటాడా.? అనేది ఆడియన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ప్రశ్న) అసలు ఈ ఆక్షన్(వేలం పాట) అనే కాన్సెప్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది.? ఆ విశేషాలు చెప్పండి.?

స) ఒకరోజు ఆఫీసులో ఉండగా వర్మగారు సినిమా రిలీజ్ విషయంలో ఒక కాన్సెప్ట్ చెబుతాను, విను నచ్చితే చేద్దాం అన్నారు.. అదే ఆక్షన్ కాన్సెప్ట్.. నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఇప్పటి వరకూ ఎవరికీ ఎందుకు ఇలాంటి ఐడియా రాలేదని.. ఉదాహరణకి ఒక థియేటర్ ని 40 వేలకి వేలంపాట వేస్తే కొనుక్కోవడానికి చాలా మంది బిడ్డర్స్ వస్తారు. దీనివల్ల నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇలా అందరికీ లాభమే.. ప్రస్తుతం ఈ బిడ్డింగ్ అనేది అన్ని థియేటర్స్ లో జరగకపోవచ్చు కానీ ప్రతి సినిమాకి 70% ఈ ఆక్షన్ ద్వారా థియేటర్స్ దొరుకుతాయి. అలాగే వేలంపాట పేటెంట్ హక్కులు మావే. ఈ విధానంలో సినిమా రిలీజ్ చెయ్యాలి అంటే మమ్మల్ని సంప్రదించే చేయాలి. నా బ్యానర్ లో వచ్చే కంటెంట్ తీగ, మిగతా సినిమాలు కూడా ఇలానే రిలీజ్ అవుతాయి.

ప్రశ్న) కంటిన్యూగా వర్మతో పనిచేయడం ఎలా ఉంది.? వర్మ విషయంలో మీరు టెక్నికల్ గా ఇంప్రెస్ అయ్యారా లేక స్క్రిప్ట్, పెర్ఫార్మన్స్ వైపు ఇంప్రెస్ అయ్యారా.?

స) భారతదేశం గర్వించదగ్గ దర్శకుడైన వర్మతో కలిసి వరుసగా రెండో సినిమా చేయడం అదృష్టంగానే కాకుండా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రతి నటుడు వర్మ లాంటి డైరెక్టర్ దగ్గర పనిచేయాలి. అప్పుడు గానీ వాడికి యాక్టింగ్ వచ్చా లేదా అన్నది బయటపడుతుంది. వర్మ విషయంలో టెక్నికల్ గా నేను ఇంప్రెస్ కాలేదు, నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నా కెరీర్లో డీ సినిమాలో చాలా బాగా చేసానని అంటారు. కానీ నేను బయట ఎలా ఉంటానో డీ లో కూడా అలానే ఉంటాను. కానీ అనుక్షణం లో పూర్తిగా వేరే ఓ కొత్త పాత్ర చేసాను. అందుకే నాకు నటుడిగా గౌరవాన్ని పెంచే సినిమా ‘అనుక్షణం’.

ప్రశ్న) ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తున్నట్టున్నారు.?

స) అవును.. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. పోలీస్ ఆఫీసర్ పాత్ర అని చెప్పగానే కాస్త లుక్ మార్చుకున్నాం. చొక్కావిప్పి బాడీ చూపించము కానీ టఫ్ గా ఉండాలి అని చెప్పడంతో ఫిజిక్ పై కేర్ తీసుకున్నాం. అలాగే వర్మ సినిమా అంటే రెస్ట్ ఉండదు. ఎప్పుడు పాత్ర మూడ్ లోనే ఉండాలి. ఒకవేళ సరిగా రాలేదు అంటే బాగా రాలేదు అని చెప్పేస్తాడు. ఆ మాట అనిపించుకోకూడదని అదే మూడ్ లో ఉండి ఈ సినిమాని చేసాను. నా గత సినిమాలకంటే పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తాను.

ప్రశ్న) సీనియర్ నటి రేవతి గారితో కలిసి పనిచేయడం ఎలా ఉంది.?

స) నేను చూసిన వాళ్ళలో ది బెస్ట్ ప్రొఫెషనలిస్ట్ రేవతిగారు.. హంగామా, డ్రామాలు ఏమీ ఉండవు. చాలా సైలెంట్ గా సెట్ కి వచ్చి తన పని పర్ఫెక్ట్ చేసి వెళ్ళిపోతారు. ఒక నిర్మాతగా కూడా ఆమె విషయంలో నేను చాలా హ్యాపీ..

ప్రశ్న) ‘అనుక్షణం’ మేజర్ హైలైట్స్ ఏంటి.?

స) మొదట స్టొరీ లైన్ తర్వాత కథ చెప్పిన విధానం మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ మూవీకి మేజర్ హైలైట్స్ అవుతాయి.

ప్రశ్న) ‘ఎర్రబస్సు’ ఎంతవరకూ వచ్చింది. మొదటిసారి మా నాన్నగారి గురువైన దాసరి గారితో పనిచేయడం ఎలా ఫీలవుతున్నారు.?

స) మా నాన్నగారిని పరిచయం చేసిన దాసరి గారితో సినిమా చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన డైరెక్షన్ లో చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సెట్స్ లోకి వచ్చాక చూస్తే ఆయన ఇప్పటి ట్రెండ్ డైరెక్టర్ ఎలా ఉండాలో అలా ఉన్నారు. టైం టు టైం మారుతూ వస్తే వాళ్ళని గోల్డ్ అంటారు. సో దాసరి గారు గోల్డ్. ఈ సినిమా చూసాక దాసరి గారెంటనేది మీకు తెలుస్తుంది.

ప్రశ్న) ‘రావణ’ సినిమా స్టేటస్ ఏమిటి.?

స) ప్రస్తుతం రాఘవేంద్రరావు అంకుల్ స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. 2015లో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ పౌరాణిక మూవీలో నాన్న టైటిల్ రోల్ చేస్తారు. నా రోల్ ఏంటనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.

ప్రశ్న) చివరిగా ‘అనుక్షణం’ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు.?

స) యాక్షన్ సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు నచ్చే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ విష్ణు గత సినిమాల(డీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా) మాదిరిగా ఈ సినిమా ఉంటుంది, పాటలు, కామెడీ, ఫైట్స్ ఉంటాయని ఆశించి మాత్రం సినిమాకి రావద్దు. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. చూసి ఎంకరేజ్ చెయ్యండి..

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, ఓ కొత్త ట్రెండ్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న మంచు విష్ణు అందులో సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు