సమీక్ష : గడ్డం గ్యాంగ్ – యావరేజ్ అనిపించే రీమేక్.!

సమీక్ష : గడ్డం గ్యాంగ్ – యావరేజ్ అనిపించే రీమేక్.!

Published on Feb 7, 2015 2:20 PM IST
Gaddam-Gang-movie-review విడుదల తేదీ : 6 ఫిబ్రవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : సంతోష్ పీటర్ జయకుమార్
నిర్మాత : శివాని – శివాత్మిక
సంగీతం : అచ్చు
నటీనటులు : రాజశేఖర్, షీన


యాక్షన్ హీరో డా. రాజశేఖర్ దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత హీరోగా చేసిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘గడ్డం గ్యాంగ్’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సూదు కవ్వం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ సరసన షీన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో ఇలాంటి తరహా కథ రావడం ఇదే మొదటిసారని చెప్పాలి. మరి ఈ గడ్డం గ్యాంగ్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకూ నచ్చిందో, రాజశేఖర్ కి కావాల్సిన హిట్ ని ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

రమేష్(సత్యం రాజేష్), సురేష్(అచ్చు), పండు మంచి ఫ్రెండ్స్. పలు కారణాల వల్ల వీరు ముగ్గురికి ఉద్యోగాలు పోతాయి. ఒకరోజు బారులో తాగి ఓ కారణం వల్ల అక్కడి వారితో గొడవ పెట్టుకుంటారు. అక్కడే వీరి ముగ్గురికీ గడ్డం దాస్(రాజశేఖర్) తో పరిచయం అవుతుంది. ఇప్పుడు గడ్డం దాస్ విషయానికి వస్తే గడ్డం దాస్ ఒక కిడ్నాపర్.. కానీ అందరిలా కాకుండా ఎలాంటి రిస్క్ లేకుండా కిడ్నాప్ చేసి మనీ సంపాదించే పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్న కిడ్నాపర్. అలాంటి గడ్డం దాస్ తో కలిసి రమేష్, సురేష్, పండు కలిసి కిడ్నాప్స్ చేస్తుంటారు.

ఒక రోజు బిజినెస్ మాన్ అయిన నమ్మిన బంటు(కాదంబరి కిరణ్) మినిస్టర్ ధర్మరాజు(సీనియర్ నరేష్) కుమారుడైన సత్య హరిశ్చంద్రని కిడ్నాప్ చెయ్యాలని అలా చేస్తే 2 కోట్లు ఇస్తానని చెబుతాడు. దాంతో గడ్డం దాస్ గ్యాంగ్ కిడ్నాప్ చెయ్యడానికి ఒప్పుకుంటారు. అనుకున్నట్టుగానే సత్య హరిశ్చంద్రని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ వల్ల గడ్డం గ్యాంగ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.? ఆ సమస్యల నుండి బయటపడటానికి ఏమేమి చేయాల్సి వచ్చిందనేది మీరు వెండితెర పైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ముందుగా క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ సినిమా స్క్రిప్ట్ కే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రీమేక్ కాన్సెప్ట్ లోని కొన్ని సీన్స్ మాత్రం తెలుగులో కూడా బాగా పేలాయి. పాత్రల ఇంట్రడక్షన్, రాజశేఖర్ ఇంట్రడక్షన్ బాగా నవ్వు తెప్పిస్తాయి.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి.. రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ కి లీడర్ పాత్రలో బాగానే సెట్ అయ్యాడు. అలాగే అక్కడక్కడా కన్ఫ్యూజ్ అవుతూ, సందర్భం ఒకటైతే ఆ సందర్భానికి సంబంధం లేకుండా రియాక్ట్ అవ్వడం లాంటి సీన్స్ లో రాజశేఖర్ ఎక్స్ ప్రెషన్స్ మనకు నవ్వు తెప్పిస్తాయి. ఇక ఆయనకీ సపోర్ట్ గా చేసిన సత్యం రాజేష్, అచ్చు, పండులు మంచి నటనని కనబరిచారు. ముఖ్యంగా పండుకి గ్యాంగ్ కి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అందరినీ బాగా నవ్విస్తాయి. షీనని హీరోయిన్ అని చెప్పుకోలేము కానీ గ్లామర్ ట్రీట్ కోసం ఉంది కావున హీరోయిన్ అనే చెప్పుకోవాలి. సినిమాలో అక్కడక్కడా గ్లామర్ కోసం మాత్రమే షీనని ఉపయోగించుకున్నారు.

సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యోగ్ జప్పీ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. సీరియస్ రోల్ కి అతని యాటిట్యూడ్ బాగా సెట్ అయ్యింది. ఇక సెకండాఫ్ లో నాగ బాబు పాత్ర ప్రేక్షకులను బాగానే నవ్విస్తుంది. ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని కామెడీ బిట్స్ బాగా పేలాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే చివరి క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ మరియు ముగించిన కామెడీ ఎలిమెంట్స్ చివర్లో ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఇదొక రీమేక్ సినిమా.. రీమేక్ అన్నప్పుడు ఒరిజినల్ కంటెంట్ ఎంత బాగున్నా దాన్ని మన నేటివిటీకి కనెక్ట్ అయ్యేలా చెప్తేనే ప్రేక్షకులకి తొందరగా కనెక్ట్ అవుతుంది. కానీ మన తెలుగు నేటివిటీ ఫ్లేవర్ తెలుగు రీమేక్ లో మిస్ అవ్వడం గమనార్హం. కాన్సెప్ట్ కి సెట్ అయ్యేలా మన తెలుగు కమెడియన్స్ నే పెట్టుకొని ఉంటే బాగుండేది. సత్యం రాజేష్ పాత్ర తప్ప మిగతా అంతా కొత్తవారే కావడం వలన కామెడీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. అలాగే డైలాగ్స్ ని మక్కికి మక్కి దించకుండా మన స్టైల్ పంచ్ డైలాగ్స్ రాసుకొని ఉంటే సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యేది. నేను పైన చెప్పిన కారణాల వల్ల తెలుగు ఫ్లేవర్ కంటే తమిళ ఫ్లేవర్ ఎక్కువ కనపడుతుంది.

ఇకపోతే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా సాగదీసినట్టు ఉంటుంది. దానికి మొదటి కారణం తమిళ్ కంటే తెలుగులో ఈ సినిమా లెంగ్త్ కాస్త పెంచడం. పోలీస్ ఆఫీసర్ గా యోగ్ జప్పీ పెర్ఫార్మన్స్ బాగున్నా మొదటి నుంచి సీరియస్ గా చూపించి ఫన్నీగా ఎండింగ్ ఇచ్చారు. ఇది కొంతమందికి ఎక్కకపోవచ్చు. అలాగే ప్రీ క్లిమాక్స్ ఎపిసోడ్ ని బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. వీటితో పాటు హీరోయిన్ అయిన షీన పాత్ర ఏంటి.? ఎందుకు వచ్చింది.? ఎందుకు వెళ్ళిపోయింది.? అనే విషయాలకు క్లారిటీ లేకుండా పోయింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో హైలైట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ్ నుంచి తీసుకున్న కథ. ఆ తర్వాత డెమెల్ ఎక్స్ ఎడ్వర్డ్స్ అందించిన సినిమాటోగ్రఫీ. ఇలాంటి ఓ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాకి బాగా మ్యాచ్ అయ్యేలా ఉంది. అతని లైటింగ్ ఎఫెక్ట్స్ మరియు నటీనటుల్ని పాత్రలకు తగ్గట్టు చూపించిన విధానం బాగుంది. ఆ తర్వాత అచ్చు అందించిన సంగీతం 75% మాత్రమే బాగుంది. కీలకమైన పార్ట్స్ లోనే మిగతా 25% వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ బాగున్నాయి, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లోనే కాస్త తడబడి అనుకున్న స్థాయికి అందించలేదు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆయనన్నా కాస్త స్పీడ్ గా ఉండేలా ఎడిటింగ్ చేయాల్సింది.

ఇకపోతే చెప్పుకోవాల్సింది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్ పీటర్ జయకుమార్ గురించి చెప్పాలి. ఇదొక తమిళ సినిమా కావున తెలుగు నేటివిటీ, ఇక్కడ ఆడియన్స్ పల్స్ తెలిసిన తెలుగు వారికి దర్శకత్వ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే సంతోష్ రీమేక్ అనగానే సీన్స్ టు సీన్ తీసుకురావడమే కాకుండా తమిళ ఫ్లేవర్ ని కూడా తీసుకు వచ్చాడు. సంతోష్ మంచి కాన్సెప్ట్ ఉంది కదా అని ధీమాగా ఉండడంలో తప్పు లేదు కానీ అది డిఫరెంట్ టేస్ట్ ఉన్న ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అన్నది మరచిపోవడం బాధాకరం, అందుకే సినిమా మిస్ ఫైర్ అయ్యింది. ఇక శివాని – శివాత్మిక నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి. విజువల్స్ బాగా గ్రాండ్ గా ఉండేలా చేసారు.

తీర్పు :

చాలా రోజుల తర్వాత రాజశేఖర్ ఒక డిఫరెంట్ డార్క్ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో చేసిన గడ్డం గ్యాంగ్ సినిమా కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఒరిజినల్ కథలో కంటెంట్ ఉండడం, ఆ కథలోని కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఇక్కడ వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా రాజశేఖర్ అతని గ్యాంగ్ చేసే కొన్ని కామెడీ సీన్స్, కొత్తగా అనిపించే కిడ్నాప్ ఎపిసోడ్, డిఫరెంట్ స్టొరీ లైన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే తెలుగు నేటివిటీ మిస్ అవ్వడం, స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం, కొన్ని పాత్రలకి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా రాజశేఖర్ బ్రాండ్ వల్ల మొదటి వారం ఈ సినిమా జనాల్ని థియేటర్స్ కి రాబట్టుకునే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు