ఇంటర్వ్యూ : బండ్ల గణేష్ – బాపుకి ‘ముత్యాల ముగ్గు’ – కృష్ణవంశికి ‘గోవిందుడు..’

ఇంటర్వ్యూ : బండ్ల గణేష్ – బాపుకి ‘ముత్యాల ముగ్గు’ – కృష్ణవంశికి ‘గోవిందుడు..’

Published on Sep 27, 2014 1:45 PM IST

bandla-ganesh

‘ముత్యాల ముగ్గు’ చిత్రం బాపు గారి సినీ ప్రయాణంలో చిరస్మరణీయంగా నిలిచినట్టు.. మా ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం దర్శకులు కృష్ణవంశి సినీ ప్రయాణంలో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా, వృతిపరంగా నాకు అత్యంత సంతృప్తిని కలిగించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఇటువంటి సినిమాను మా బ్యానర్ లో నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా నమ్మకం నిజమైతే ఇండస్ట్రీ హిట్ సినిమా అవుతుంది. అని అన్నారు నిర్మాత బండ్ల గణేష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు.

సెన్సార్ సభ్యుల ప్రసంశలు…

ఈ శుక్రవారం మా ‘గోవిందుడు..’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 1న ఉదయం 5 గంటల 18 నిముషాలకు విడుదల చేస్తున్నాం. తెలుగు సంస్కృతి – సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు – ఆప్యాయతల నేపద్యంలో చాలా గొప్ప సినిమా తీశారు. ఇలాంటి సినిమా మళ్లీ వస్తుందో.. రాదో.. అనుకుంటున్న తరుణంలో మీ సినిమా చూశాం. సినిమా పెద్ద విజయం సాదిస్తుంది అని సెన్సార్ సభ్యుల చెప్పారు. వారి ప్రసంశలు నా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి.

రామ్ చరణ్ సహకారం లేకపోతే…

నాలుగు నెలల ముందు సినిమా విడుదల తేదిని ప్రకటించాం. అనుకున్న సమయానికి విడుదల చేయడానికి ముఖ్య కారణం మా హీరో రామ్ చరణ్. అనుక్షణం నన్ను ముందుకు నడిపించారు. నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహించారు. సినిమా రీ షూటింగ్ చేసినా రామ్ చరణ్ సహకారంతో ముందు అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశాం. చరణ్ తో పాటు రాత్రి పగలు కష్టపడుతున్న మా దర్శకులు కృష్ణవంశికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, పరుచూరి బ్రదర్స్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడ్డారు.

బాపుకి ‘ముత్యాల ముగ్గు’ – కృష్ణవంశికి ‘గోవిందుడు..’

‘ముత్యాల ముగ్గు’ చిత్రం బాపు గారి సినీ ప్రయాణంలో చిరస్మరణీయ చిత్రంగా మన్ననలు పొందింది. అలాగే ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం కృష్ణవంశి సినీ ప్రయాణంలో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుంది. కృష్ణవంశి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సన్నివేశం కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. ‘అత్తారింటికి దారేది’లో క్లైమాక్స్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ నటన చూసి కంట తడి పెట్టుకున్నాను. ఈ సినిమాలో అలాంటివి ఒక 10 సన్నివేశాలు ఉన్నాయి. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాలో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. ఆ సన్నివేశాలు గుర్తొచ్చినప్పుడల్లా ఎమోషనల్ అవుతున్నాను.

రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్…

ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో ‘గోవిందుడు…’ సినిమా ది బెస్ట్ ఫిల్మ్. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, రామ్ చరణ్ కలసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. వాటిని కృష్ణవంశి అద్బుతంగా తెరకెక్కించారు. అభిరామ్ పాత్రలో రామ్ చరణ్ కనబరచిన నటన ఆయనలో నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తుంది. అతని కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ‘గోవిందుడు…’లో మీరు కొత్త చరణ్ ను చూస్తారు.

ఈ ఏడాది రెండు దసరా పండుగలు…

ఈ ఏడాది తెలుగు ప్రజలకు రెండు దసరా పండుగలు వస్తున్నాయి. ఒకటి విజయదశమి, మరొకటి ‘గోవిందుడు…’ సినిమా విడుదల. తెలుగు ప్రేక్షకులు గర్వించే సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా చూశామని ఆనందం వ్యక్తం చేస్తారు. వ్యక్తిగతంగా, వృతిపరంగా నాకు అత్యంత సంతృప్తిని కలిగించిన చిత్రమిది. మా బ్యానర్ ప్రతిష్టను పెంచే విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాను నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

రామ్ చరణ్ బైక్ మెగా అభిమానికే సొంతం…

‘గోవిందుడు..’ సినిమాలో రామ్ చరణ్ 17 లక్షల రూపాయల విలువ చేసే ట్రంప్ కంపెనీకి చెందిన బైక్ ఉపయోగించారు. తొలుత ఈ బైక్ ను ఎవ్వరికి ఇవ్వకూడదు, నేనే ఉంచుకోవాలి అనుకున్నాను. కాని, ఒక మెగా అభిమాని దగ్గర ఈ బైక్ ఉండడం సమంజసం అనిపించింది. అందుకే ఒక ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహించి ఆ బైక్ ను మెగా అభిమానికి బాహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాం. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. సినిమా విడుదల తర్వాత కాంటెస్ట్ రన్ చేస్తాం. అక్టోబర్ 14 లేదా 15వ తేదిలలో ఈ బైక్ ను ఇవ్వడం జరుగుతుంది.

సుమారు 2000 ధియేటర్లలో విడుదల…

తెలుగు సినిమా ప్రేక్షకులు, మెగా అభిమానులతో పాటు నేను కూడా అక్టోబర్ 1 కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. సినిమా చూసిన తర్వాత మీ స్పందన ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నాను. సుమారు 1800 నుండి 2000 వేల థియేటర్లలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆదివారం సాయంత్రానికి థియేటర్ల లిస్టు ఫైనలైజ్ అవుతుంది.

‘గోవిందుడు..’ ఇండస్ట్రీ హిట్ అని నా ఫీలింగ్…

నా నమ్మకం నిజమైతే ‘గోవిందుడు అందరివాడేలే’ ఇండస్ట్రీ హిట్ సినిమా అవుతుంది. పైన ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టాడో ..! వచ్చే ఏడాది ఎటువంటి రాజకీయం లేకుండా అవార్డులను ఇస్తే అన్ని అవార్డులను మా ‘గోవిందుడు..’ సొంతం చేసుకోవడం ఖాయం. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు