బర్త్‌డే విషెస్ : నితిన్.. ఓ సినీ కెరటం!

బర్త్‌డే విషెస్ : నితిన్.. ఓ సినీ కెరటం!

Published on Mar 30, 2015 8:23 AM IST

nitin-birthday
‘జయం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో నితిన్, ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతా కొత్త వాళ్ళతో దర్శకుడు తేజ తీసిన జయం, నితిన్‌తో పాటూ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.జయం విడుదలై సంచలన విజయం సాధించిన తర్వాత నితిన్‌కు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. జయం తర్వాత కూడా ‘దిల్’, ‘సై’ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన నితిన్, ఆ తర్వాత వెనుకబడ్డారు. అయితే అనూహ్యంగా విక్రం కుమార్ దర్శకత్వంలో 2012లో విడుదలైన ఇష్క్ సినిమా ద్వారా నితిన్ మళ్ళీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ‘గుండెజారి గల్లంతయిందే’, ‘హార్ట్ అటాక్’ లాంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ అందుకున్న విషయం తెలిసిందే.

మొదట లవర్ బాయ్‌గా కెరీర్ మొదలుపెట్టిన నితిన్, ఆ తర్వాత మాస్ సినిమాలు చేశారు. తాజాగా వినూత్న అంశాలతో అందరూ మెచ్చే సరికొత్త సినిమాలు తీస్తున్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమాలో యాక్టింగ్‌తో పాటు అన్ని విషయాల్లో పరిణతి కనబరుస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైన నితిన్, నిర్మాతగా మారి అక్కినేని అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేసే అవకాశం దక్కించుకోవడం విశేషం. తనకు హార్ట్ అటాక్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు పూరీతో మరో సినిమా చేయనున్నారు.

చిన్న వయసులోనే హీరోగా అవకాశం దక్కించుకొని, ఆ తర్వాత కొద్ది రోజులకే స్టార్‌గా ఎదిగి, కొన్నాళ్ళు వరుస పరాజయాలతో దెబ్బతిని, ఒక్కసారిగా అన్నింటికీ ఎదురు నిలబడి మళ్ళీ స్టార్‌గా నిలబడగలగడం చూస్తుంటే.. నితిన్ జీవితం కూడా ఓ సినిమాను తలపిస్తోంది. నిరంతరం కొత్తదనం కోరుకోవడం, పట్టుదల, శ్రమతో మళ్ళీ ఈ విజయాలను సొంతం చేసుకున్నారనడంలో సందేహం లేదు. యువతకు నితిన్ కెరీర్ ఒక చిన్న పాఠంలా పనికి వస్తుండనడంలోనూ అతిశయోక్తి లేదు. ఈరోజు 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా 123తెలుగు తరపున నితిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలతో మనల్ని అలరించాలని కాంక్షిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు