ఇంటర్వ్యూ: విజయ్ దేవరకొండ – ‘పెళ్లి చూపులు’ తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకున్నా!

ఇంటర్వ్యూ: విజయ్ దేవరకొండ – ‘పెళ్లి చూపులు’ తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకున్నా!

Published on Feb 27, 2017 4:39 PM IST


హీరోగా చేసిన మొదటి చిత్రం ‘పెళ్లిచూపులు’ తోనే బ్రహ్మాండమైన విజయం అందుకుని స్టార్ గా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ చిత్రం ‘ద్వారక’ మార్చి 3వ తేదీన రిలీజుకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఆ చిత్ర సంగతులను మీడియాతో పంచుకున్నారు విజయ్. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమా అంతా ‘ద్వారక’ అనే అపార్ట్మెంట్ మీద జరుగుతుంది. ఈ అపార్టుమెంట్లో రకరకాల పాత్రలుంటాయి. ఆనందంగా ఉండేవాళ్ళు, మూఢనమ్మకాలతో ఉండేవారు, ఆశలు ఉన్నవారు, మంచి వారు ఇలా రకరకాల మనుషులుంటారు. కృష్ణుడు తన ద్వారకలో ఉన్న అంత మందిని ఎలా హ్యాండిల్ చేశాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలాంటిది ?
జ) ఈ సినిమాలో నాది ఎర్ర శ్రీను అనే పాత్ర. బ్రతకడం కోసం దొంగతనాలు చేస్తుంటాను. అలా ఒక విషయమై ఆ ఆపార్ట్మెంట్లోకి చేరిన నేను అక్కడి వారికి దేవుడిలా ఎలా మారాను, అక్కడి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాను అన్నదే నా పాత్ర.

ప్ర) సినిమా ఎందుకు లేటైంది ?
జ) సినిమా నవంబర్ ఎండింగ్ కు రావాల్సింది. కానీ అప్పుడే డీమానిటైజేషన్ వచ్చింది. అప్పుడే సినిమా బాగా వచ్చింది. వృధా చేసుకోవడం ఎందుకు. ఏటీఎంల ముందు రష్ తగ్గి జనాల చేతుల్లోకి డబ్బులు వచ్చిన తరవాతే సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకే ఆలస్యమై మార్చికి వస్తున్నాం.

ప్ర) పెళ్లిచూపులు తర్వాత వస్తుంది కదా ఇందులో ఏమైనా మార్పులు చేశారా ?
జ) లేదు.. పెళ్లి చూపుల టైమ్ కే పాటలు తప్ప సినిమా చాలా వరకు పూర్తయింది. మార్పులు లాంటివి ఏమీ చేయలేదు. అయినా నేను పని చేసింది సీనియర్ టీమ్ తో. మార్పులు చెప్పే స్టేజిలో నేను లేను.

ప్ర) ఈ కథలో మీకు అంతగా ఏం నచ్చింది ?
జ) సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. ఫస్టాఫ్ అంతా సరదగా అలా వెళ్ళిపోతుంది. ఒకదాని తర్వాత ఇంకో సీన్ అలా జరిగిపోతూ ఉంటాయి. పైగా దొంగ బాబా పాత్రను నేనెప్పుడూ చేయలేదు. కాబట్టి ట్రై చేస్తే బాగుంటుందని చేశా.

ప్ర) ఆ పాత్ర కోసం ఏమైనా హోం వర్క్ చేశారా ?
జ) చేశాను. ముందుగా యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను. రియల్ దొంగ బాబాలు ఎలా ఉంటారో తెలుసుకున్నా. వాళ్ళు మరీ అతిగా ఉన్నారు. అలాంటి పాత్రలని కథలో వాడుకోవడం సాధ్యం కాదు. అందుకే మా దర్శకుడు చెప్పిందే చేశా.

ప్ర) ‘పెళ్లి చూపులు’ తర్వాత ఈ కథ చేసుండేవారా ?
జ) ఖచ్చితంగా.. ఈ కథ ‘పెళ్లి చూపులు’ తర్వాత వచ్చి ఉన్నా చేసేవాడిని. అంత బాగా నచ్చింది నాకు.

ప్ర) ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నారు ?
జ) ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. ఇంకా నాలుగు సినిమాలున్నాయి. గీతా ఆర్ట్స్ లో అయితే రాహుల్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా, వచ్చే నెల పరశురామ్ తో మరో సినిమాని స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత నదిని రెడ్డి ప్రాజెక్ట్ ఉంది.

ప్ర) పెళ్లి చూపులతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకున్నారా ?
జ) క్యాష్ చేసుకోవడమంటే చేసుకున్నాను. రెమ్యునరేషన్ కాస్త పెంచాను (నవ్వుతూ). ప్రస్తుతానికి కోటికి దగ్గర్లో తిరుగుతున్నాను.

ప్ర) ఈ సినిమాలో మీరు ఎలాంటి వేరియేషన్ చూపుతారు ?
జ) ఫస్ట్ సినిమా ఎవడె సుబ్రమణ్యం చాలా ఎనర్జీగా చేసిన నేను పెళ్లి చూపుల్లో చాలా బద్దకంగా కనిపించా. ద్వారకలో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తా. నాలోని చాలా కోణాలు బయటపడ్డాయి. మన సొసైటీలోని చాలా మంది బాబాలు ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది నా క్యారెక్టర్ చూస్తే. అంత యాక్టివ్ గా ఉంటాను.

ప్ర) పర్సనల్ లైఫ్ ఏమైనా మిస్సవుతున్నారా ?
జ) కేవలం షూటింగ్స్, ప్రమోషన్స్ వలనే కాస్త బిజీగా ఉంది పర్సనల్ లైఫ్ మిస్సవుతున్నాను. అంతకు మించి పెద్దగా మిస్సయ్యేదేం లేదు. కానీ బయట తిరగాలంటే కాస్త ఇబ్బంది. అందరూ గుర్తుపడతారు. చాలా మంది ఫోటోలు అడుగుతారు. కానీ అలా అడిగేవాళ్లు వాళ్ళు చాలా రిక్వెస్టింగా వచ్చి అడుగుతారు. అది చాలా నచ్చుతుంది.

ప్ర) డైరెక్టర్ కాబోయి హీరో అయ్యారని విన్నాం ?
జ) డైరెక్టర్ అవ్వక హీరో కాలేదు. ఒక టైమ్ పెట్టుకుని హీరోగా ట్రై చేశా. 25 ఏళ్లలోపు హీరోగా ఒక బ్రేక్ రాకపోతే రైటర్, డైరెక్టర్ గా ట్రై చేద్దామనుకుని ఒక షాట్ ఫిల్మ్ కూడా చేశాను. అప్పుడే ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ ఛాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు