ఇంటర్వ్యూ : నిఖిల్ – 10, 15 మంది హీరోల మధ్య నాకో స్పెషాలిటీ ఉండాలి.

ఇంటర్వ్యూ : నిఖిల్ – 10, 15 మంది హీరోల మధ్య నాకో స్పెషాలిటీ ఉండాలి.

Published on Mar 2, 2015 3:39 PM IST

nikhil
ఈ సినిమా విజయం నాకు చాలా ఇంపార్టెంట్. కెరీర్ ప్రారంభంలో కొన్ని తప్పులు చేశాను. ఇప్పుడవి సరి చేసుకున్నాను. ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ సినిమాల తర్వాత ప్రేక్షకులు, నా సినిమాలను చూసే దృష్టి మారింది. నాపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకోవలసిన భాద్యత ఉంది. అని అన్నారు యువహీరో నిఖిల్. సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సంబందించిన పలు ఆసక్తికరమైన విషయాలు నిఖిల్ వెల్లడించారు. ఆ సంగతులు మీకోసం..

ప్రశ్న) సూర్యుడికి భయపడే ఈ సూర్య కథ ఏంటి..?

స) పగలు బయటకు రాని ఓ కుర్రాడు, పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడు. ఆ అమ్మాయి ప్రేమను ఎలా దక్కించుకుంటాడు. అనే ఆసక్తికరమైన కథతో సినిమాను రూపొందించాం. చాలా మంది ఇదొక థ్రిల్లర్, సస్పెన్స్ సినిమా అనుకుంటున్నారు, అది తప్పు. సినిమాలో థ్రిల్లర్, సస్పెన్స్ ఉంటుంది. కానీ, బేసిగ్గా ఇదొక లవ్ స్టొరీ. నా కెరీర్లో మాస్ ఫిల్మ్, కాలేజీ స్టూడెంట్ సినిమా చేశాను. ఫస్ట్ టైం కంప్లీట్ లవ్ స్టొరీలో నటించాను. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది.

ప్రశ్న) ఈ సినిమా కోసం ఎటువంటి హోం వర్క్ చేశారు..?

స) క్యారెక్టర్ ఆధారంగా సినిమా నడుస్తుంది. అందుకే నా లుక్, బాడీ లాంగ్వేజ్ పరంగా కొంత హోం వర్క్ చేశాను. కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తాను. అందుకోసం ఓ 10 కిలోలు బరువు తగ్గాను. హీరో పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడతాడు. కోటి మందిలో ఒక్కరికి ఈ వ్యాధి వస్తుంది. వీళ్ళు పగలు బయటకు వస్తే చర్మం కాలిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై కూడా చాలా రీసెర్చ్ చేశాం.

ప్రశ్న) దర్శకుడు కథను చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి..?

స) ‘కార్తికేయ’కు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఆ సమయంలో ‘సూర్య వర్సెస్ సూర్య’ కథను చెప్పాడు. హీరో పగలు బయటకు రావడం కుదరదు అనే డిఫరెంట్ పాయింట్ నాకు బాగా నచ్చింది. దానికి తోడు లవ్ స్టొరీ, మదర్ సెంటిమెంట్, 60 ఏళ్ళ తనికెళ్ళ భరణి హీరోకు ఫ్రెండ్ ఇలా కమర్షియల్ అంశాలు కథలో యాడ్ చేయడం నాకు బాగా నచ్చింది. ఈ సినిమాను నిర్మించిన శివ కుమార్ కు మేజర్ క్రెడిట్ ఇవ్వాలి. ఇలాంటి సినిమాలు హిట్టయితే వైవిధ్యమైన సినిమాలను తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారు.

ప్రశ్న) వరుసగా డిఫరెంట్ స్టొరీలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారా..?

స) 10, 15 మంది హీరోలు ఉన్నారు. నేను అప్ కమింగ్ హీరో, ఇండస్ట్రీ బయట వ్యక్తిని. ఆ హీరోల మధ్యలో నాకో స్పెషాలిటీ ఉండాలి. అలాగే ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావాలి అంటే… కథలో కొత్తదనం ఉండాలి. ఆ కథలో నేను మాత్రమే కాదు, మరే ఇతర హీరో నటించినా ఖచ్చితంగా హిట్టవ్వాలి. అలాంటి కథలకు నేను ప్రాముఖ్యత ఇస్తాను.

ప్రశ్న) భవిష్యత్ లో కూడా ఇదే నిర్ణయాన్ని ఫాలో అవుతారా..?

స) 100 శాతం. ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ సినిమాల తర్వాత ఆ తరహా కథలు వచ్చినా థ్రిల్లర్, హారర్ కథలు చేస్తే రొటీన్ అవుతుందని చేయలేదు. ఇప్పుడు ఈ లవ్ స్టొరీ చేశాను. భవిష్యత్లో కూడా ఇలా డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తాను.

ప్రశ్న) హిట్ పెయిర్ స్వాతిని ఎందుకు రిపీట్ చేయలేదు..? కొత్త హీరోయిన్ను తీసుకోవడం రిస్క్ అనిపించలేదా..?

స) ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’లకు హీరోయిన్ గా స్వాతి కరెక్ట్. ఈ సినిమాకు కొత్తమ్మాయి కరెక్ట్ అని మా దర్శకులు భావించారు. హీరోయిన్ ఎంపికలో నా జోక్యం ఏమి ఉండదు. కొత్తమ్మాయి అయితే కంఫర్ట్ ఉంటుందని కార్తీక్ ఘట్టమనేని ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా బాగా నటించింది.

ప్రశ్న) మధుబాలతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) చిన్నతనంలో నేను ఆమెకు పెద్ద ఫ్యాన్. శంకర్, మణిరత్నం వంటి గొప్ప దర్శకులతో పని చేసిన హీరోయిన్, మాతో బాగా కలిసిపోయారు. టీం అంతా కొత్తవాళ్ళే. ఒక్కోసారి 10 టేకులు అయినా ఎక్కడ అసహనం వ్యక్తం చేయలేదు. ఆమెతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) వరుసగా విజయాలు లభిస్తున్నాయి. రెమ్యునరేషన్ ఎంత పెంచారు..?

స) కథ నచ్చితే.. రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడానికి నేను రెడీ. మంచి కథ దొరకడం ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా.

ప్రశ్న) నెక్స్ట్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు..?

స) గత రెండు నెలలో ఓ 100 వరకు ఐడియాలు విన్నాను. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, దర్శకుల నుండి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం 3 నెలలు బ్రేక్ తీసుకుంటున్నాను. యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కోసం, సినిమాలకు సంబంధించి మెళకువలు నేర్చుకోవడం కోసం ఓ ఫిల్మ్ కోర్స్ చేస్తున్నాను. అమెరికా వెళ్తున్నాను. వచ్చిన తర్వాత నా తదుపరి సినిమా వివరాలు వెల్లడిస్తాను.

ప్రశ్న) ఎవరినైనా లవ్ చేశారా..? మీ పెళ్లి ఎప్పుడు..?

స) ప్రస్తుత సమయంలో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. షూటింగ్, డబ్బింగ్, ప్రమోషన్ యాక్టివిటీస్ ఇలా నా టైం అంతా సినిమాలకు సరిపోతుంది. ఒక అమ్మాయిని లవ్ చేసి, తనతో కొంత టైం స్పెండ్ చేయడం కుదరని పని. నేను ఎవరిని లవ్ చేయలేదు. పెళ్లి ప్రశ్న మా ఇంట్లో వాళ్ళను అడగాలి. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు