ఎన్టీఆర్ గురించి నేనలా మాట్లాడలేదు!
Published on Dec 1, 2016 7:44 am IST

hari
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు హీరోగా ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాప్ హీరోల్లో ఒకరుగా కొనసాగుతూ వస్తోన్న ఆయనతో సినిమా చేయడానికి తెలుగు సినిమా దర్శకులే కాక, ఇతర భాషా సినిమాల దర్శకులు కూడా పోటీ పడుతుంటారు. కాగా ఈస్థాయి స్టార్‌డమ్ ఉన్న ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ తమిళ స్టార్ దర్శకుడు హరి ఒక కామెంట్ చేశారన్న వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనే లేదని హరి చెప్పినట్లు వచ్చిన ఈ వార్తలను ఈ స్టార్ డైరెక్టర్ స్వయంగా ఖండించారు.

ఇదే విషయమై మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ ఎవరో తెలియదని నేను చెప్పినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నాకు ఆయన నటనంటే చాలా ఇష్టం. ఆయన చేసిన టెంపర్ సినిమా రెండు సార్లు చూశా. ఎన్టీఆర్‌తో పనిచేయాలన్నది నా కోరిక కూడా. ఒకసారి కలిసినప్పుడు ఆయనకొక కథ కూడా చెప్పా. అప్పుడెందుకో అది కుదరలేదు. భవిష్యత్‌లో ఆయనతో తప్పక పనిచేస్తా” అని ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘సింగం 3’ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే!

 
Like us on Facebook