ఇంటర్వ్యూ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి – నాగ చైతన్యతో ఒక ప్రేమ కథ చేస్తాను !

ఇంటర్వ్యూ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి – నాగ చైతన్యతో ఒక ప్రేమ కథ చేస్తాను !

Published on Jun 8, 2017 1:03 PM IST


గతేడాది ‘జెంటిల్మెన్’ చిత్రంతో మంచి విజయం అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి చేసిన తాజా చిత్రం ‘అమీ తుమీ’. ఈ సినిమా రేపు 9వ తేదీన విడుదలకానున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ సినిమా గురించి చెప్పండి ?
జ) నేను ‘అష్టా చమ్మా’ చేసిన తర్వాత దానికి సీక్వెల్ చేయమని చాలా మంది అడిగారు. కానీ నేను చేయలేదు. ఈ ‘అమీ తుమీ’ ,మరో ‘అష్టా చమ్మ’ లాంటి సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

ప్ర) ‘అష్టా చమ్మా’ కి సీక్వెల్ ఎందుకు చేయలేదు ?
జ) అంటే ముందొచ్చిన హిట్ సినిమా యొక్క క్రెడిట్ ని వేరే సినిమాకి వాడుకోవడం నాకు ఇష్టం లేదు. అంతేగాక అందులో చేసిన నటి భార్గవి కూడా చనిపోయింది. ఆమె లేకుండా సినిమానే లేదు. అందుకే సీక్వెల్ చేయాలనిపించలేదు.

ప్ర) అసలు ఈ సినిమా కథేంటి ?
జ) అడివి శేష్ – ఈషా, శ్రీనివాస్ అవసరాల – అదితి మియాకల్ రెండు జంటలు. వాళ్ళు ప్రేమలో ఉంటారు. అలాంటి వారి మధ్యకి శ్రీ చిలిపి (వెన్నెల కిశోర్) ఎంటరైన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేదే ఈ సినిమా కథ. అంతా ఒక్క రోజులో జరుగుతుంది.

ప్ర) మీ నిర్మాత గురించి ?
జ) నిర్మాత నరసింహారావుగారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన తన మొదటి సినిమాని నాతోనే చేయాలని అంటుండేవారు. షూటింగ్ సమయంలో కూడా ఏదైనా సెట్ బాగుంది, అందులో చేద్దాం అంటే బడ్జెట్ గురించి ఆలోచించకుండా సరేననేవారు.

ప్ర) ఇందులోని నటీనటుల గురించి ?
జ) ‘అష్టా చమ్మ’ లాగే ఇందులో కూడా అందరు తెలుగు నటీనటులే ఉంటారు. అందరు చాలా బాగా చేశారు. అడివి శేష్ క్యారెక్టర్ రొమాంటిక్ గా ఉంటుంది. అవసరాల పాత్రలో కాస్త హ్యూమర్, వెన్నెల కిశోర్ పాత్రలో పూర్తి కామెడీ ఉంటాయి.

ప్ర) ఈషా రెబ్బతో ‘అంతకు ముందు ఆ తర్వాత’ చేశారు. మళ్ళీ ఆమెనే తీసుకోవడానికి కారణం ?
జ) ఈషా రెబ్బ తెలుగమ్మాయి. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు యాసలు మాట్లాడగలదు. ముఖ్యంగా తెలంగాణ యాసను చాలా బాగా మాట్లాడుతుంది. నా పాత్రకు కావాల్సింది కూడా అదే. తెలుగు రాని హీరోయిన్ ను తీసుకుని ఆమెకు, తెలుగు నేర్పించి, వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించడం ఇవన్నీ ఎందుకని ఆమెనే తీసుకున్నాను.

ప్ర) మరొక నటి అదితి మియాకల్ గురించి ?
జ) ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. ‘జెంటిల్మెన్’ సినిమాలో ఆఫీస్ స్టాఫ్ గా చేసింది. అప్పుడే చూసి బాగుందనుకున్నా. ఆ తర్వాత భరణిగారు కూడా ఆమెను చూసి తనతో పాటు నాటకాలు కూడా వేసిందని, మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత నా పాత్రకు కావాల్సిన భాషకు, లుక్స్ అన్నింటికీ ఆమె సరిపోతుందనిపించి తీసుకున్నాను. ఇంతకు ముందు ‘పోష్ పోరిస్’ వంటి వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

ప్ర) సినిమాను అంత త్వరగా ఎలా చేశారు ?
జ) స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక అందరం కూర్చొని వారం పాటు ప్రాక్టీస్ చేశాం. దాంతో సెట్లోకి వెళ్ళగానే యాక్షన్, కట్ మాత్రమే ఉండేవి. అందుకే ఆలస్యం కాలేదు.

ప్ర) ఒక్క రోజులోజరిగే కథ కదా ఎలా ఉంటుంది ?
జ) సినిమా డ్యూరేషన్ 1 గంట 58 నిముషాలు. ఈ సినిమాలో బలమైనవి సంభాషణలు, పాత్రలు. అవి రెండు చాలా బాగా కుదిరాయి. డైలాగ్స్ రాసినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను.

ప్ర) ‘జెంటిల్మెన్’ లాంటి హిట్ తర్వాత చిన్న సినిమా ఎందుకు చేశారు ?
జ) అంటే నా దృష్టిలో చిన్న పెద్ద అంటూ ఏం లేదు. ఈ కథను ఐదేళ్ల క్రితమే రాసుకున్నాను. ముందుగా ‘జెంటిల్మెన్’ తర్వాత చైతన్యతో చేద్దామనుకున్నా. కానీ అతనికి కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ గ్యాప్ లో ఏదైనా చేయాలి అనుకుంటుండగా ఇదే సరైన కథని అనిపించి చేసేశాను.

ప్ర) చైతన్యతో ఎలాంటి సినిమా చేస్తారు ?
జ) చైతన్యకు రొమాన్స్ లో బాగా పట్టుంది. అందుకే అతనితో ఒక మంచి ప్రేమ కథ చేయాలని అనుకుంటున్నా.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) నెక్స్ట్ ఇలాంటి కామెడీ సినిమా కాకుండా గ్యాంగ్ స్టర్ సినిమా చేద్దామని ఉంది. అది కూడా ఒక బలమైన సోషల్ ఎలిమెంట్ ఉండే కథ చేయాలనుకుంటున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు