ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – బన్నీ కూడా ఆ డైలాగ్‌కి నవ్వుకుంటాడు!

ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – బన్నీ కూడా ఆ డైలాగ్‌కి నవ్వుకుంటాడు!

Published on Jul 14, 2016 5:46 PM IST

allari-naresh
అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సెల్ఫీ రాజా’ అనే కామెడీ సినిమా రేపు (జూలై 15న) థియేటర్లలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. కొద్దికాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లరి నరేష్‍కు ఈ సినిమా తప్పకుండా మంచి హిట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రేపు పెద్ద ఎత్తున సినిమా విడుదలవుతోన్న సందర్భంగా అల్లరి నరేష్ సినిమా గురించి పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) ట్రైలర్‌తో అంతటా ‘చెప్పను బ్రదర్’ డైలాగ్‌ను మళ్ళీ గుర్తు చేశారు. అది కావాలనే పెట్టిన డైలాగా?

స) ట్రైలర్‌లో అన్ని పంచ్‌లు ఉన్నా, ఆ ఒక్క డైలాగే ఎలా ఫేమస్ అయిందో అర్థం కావట్లేదు. ఆ డైలాగ్ ఏదో వివాదం సృష్టించాలని పెట్టింది కాదు. సరదాగా నవ్వుకోవడానికే అలా పెట్టాం. బన్నీ (అల్లు అర్జున్) నాకు మంచి ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఎవరినో కించపరచడానికో, గొడవ పెట్టడానికో ఆ డైలాగ్ పెట్టలేదు. రేపు సినిమా చూశాక మీరూ అదే చెప్తారు. బన్నీ సినిమా చూసినా కూడా ఆ డైలాగ్‌కు సరదాగా నవ్వుకుంటాడనే అనుకుంటున్నా.

ప్రశ్న) ‘సెల్ఫీరాజా’ అన్న టైటిల్ వెనుక కథేంటీ?

స) నా సినిమా టైటిల్స్ విషయంలో, వినగానే అందులో ఫన్ కనిపించాలనే ముద్ర పడిపోయింది. ఈ సినిమాలో నేను సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకునే పాత్రలో కనిపించా. అందుకు సరిగ్గా కుదురుతుందని, కొత్తగా కూడా ఉందని సెల్ఫీరాజా అన్న టైటిల్ పెట్టాం. టైటిల్ విడుదల చేయడం కూడా విజయ్ మాల్యాతో నేను సెల్ఫీ దిగినట్టు ఫోటోషాప్ చేసి పెట్టాం. మేము టైటిల్ ప్రకటించిన రోజునుంచే సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.

ప్రశ్న) సెల్ఫీరాజాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) కామెడీనే పెద్ద హైలైట్. ఇప్పుడు సెల్ఫీ అనేది తెలియని వారు లేరేమో! అందరికీ అదో విపరీతమైన అలవాటుగా మారిపోయింది. అలాంటి సెల్ఫీ పిచ్చితో ఒక హీరో చేసే విచిత్రమైన ప్రయాణమే ఈ సినిమా. సెల్ఫీ పిచ్చి వల్ల హీరో ఏయే చిక్కుల్లో ఇరుక్కున్నాడూ? అన్నది ఈ సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే అంశం.

ప్రశ్న) గత కొద్దికాలంగా మీ సినిమాలు అనుకున్నంతగా విజయం సాధించకపోవడాన్ని ఎలా తీసుకుంటారు?

స) ప్రతిసారీ నా సినిమాలూ ఒకేలా అయిపోతున్నాయని కొత్తగా ప్రయత్నించా. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’, ‘జేమ్స్‌బాండ్’ సినిమాల్లో హీరోయిన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కానీ, ‘బందిపోటు’, ‘లడ్డుబాబు’ లాంటి క్లాస్ సినిమాలు కానీ.. అన్నీ కొత్తదనం కోసమే చేశా. అవి ఎక్కడో సరిగ్గా కుదరక బాగా ఆడలేదు. ఆ నిర్ణయాలన్నీ స్వతహాగా నేను తీసుకున్నవే కాబట్టి ఆ విషయంలో అసంతృప్తి లేదు.

ప్రశ్న) ఇప్పుడు హీరోలందరూ కామెడీ చేసేస్తున్నారు. మీ మార్కెట్‌కు అదేం ఇబ్బందిగా భావించడం లేదా?

స) అలాంటిదేమీ లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రతీ సినిమాలో కామెడీ అనేది కచ్చితమైన అంశంగా మారిపోయింది. మన హీరోలందరూ అది ఏ సినిమా అయినా అందులో కొంత కామెడీ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఆ తరహా కామెడీకి, నేను చేసే పూర్తి స్థాయి కామెడీకి తేడా ఉంది. అందువల్ల నా మార్కెట్‌కు ఇబ్బందని అనుకోను. ఇవన్నీ అలా ఉంచితే, హీరోలే స్వయంగా కామెడీ చేయడమన్నది ఆహ్వానించదగ్గ పరిణామం.

ప్రశ్న) మునుపటిలా కాకుండా తక్కువ సంఖ్యలో సినిమా చేస్తున్నారు. కారణం?

స) తక్కువ సినిమాలు చేస్తున్నానంటే హిట్స్ లేకపోవడం వల్లనే! ఇప్పుడు ఎంత హీరోకైనా ప్రతీ సినిమా కొత్త సినిమాలాగే మారిపోయింది. ఫ్లాప్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకోవాలి. అదే ఇప్పుడు ఫాలో అవుతున్నా. అంతేకాకుండా ఒకేసారి రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టడం నిర్మాతలకు కూడా అసౌకర్యంగా ఉంటుందనే ఇలా ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ వెళుతున్నా.

ప్రశ్న) తదుపరి సినిమాలు ఏంటి?

స) ప్రస్తుతానికి రెండు సినిమాలు ఒప్పుకున్నా. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఇంట్లో దయ్యం నాకేంటి భయం’ అనే హర్రర్ కామెడీ చేస్తున్నా. అదేవిధంగా ‘అలా ఎలా’ సినిమా డైరెక్టర్ అనీష్ కృష్ణతో ‘మేడ మీద అబ్బాయి’ అనే మరో సినిమా కూడా లైన్లో ఉంది. ఈ రెండూ కాకుండా సముద్రఖని దర్శకత్వంలో ఓ సీరియస్ సినిమా నవంబర్‌లో మొదలవుతుంది.

ప్రశ్న) మీ సొంత బ్యానర్‌లో మళ్ళీ సినిమా ఎప్పుడు? దర్శకుడిగా కూడా మారనున్నారని వినిపిస్తోంది?

స) సొంత బ్యానర్‌లో ఒక సినిమాను ప్లాన్ చేశా. దానిగురించి అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తా. ఇకపోతే దర్శకత్వం గురించి ఇప్పుడే ఏం ఆలోచించట్లేదు. ఒక రెండు, మూడేళ్ళ తర్వాత, మా సొంత బ్యానర్‍లోనే ఓ సినిమా డైరెక్ట్ చేస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు