ఇంటర్వ్యూ : అవసరాల శ్రీనివాస్- ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నా!

ఇంటర్వ్యూ : అవసరాల శ్రీనివాస్- ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నా!

Published on Sep 6, 2016 1:51 PM IST

Avasarala-Srinivas
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 9న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత మళ్ళీ మీ దర్శకత్వంలో సినిమా రావడానికి ఇంత కాలం పట్టింది. ఎందుకని?

స) ఈ గ్యాప్ కావాలనే తీసుకున్నా. నిజానికి ‘ఊహలు గుసగుసలాడే’ చాలా సింపుల్ లవ్‌స్టోరీ. అందులోని బేసిక్ ఎమోషన్ అందరికీ బాగా కనెక్ట్ అవ్వడం వల్లే ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నా రెండో సినిమా కూడా అలాగే సింపుల్ లవ్‌స్టోరీగా ఉండటం నాకిష్టం లేదు. అలా ఉంటే నాకు ఇది తప్ప మరొకటి రాదని ముద్ర పడుతుంది. అందుకనే కాస్త గ్యాప్ తీసుకొని ‘జ్యో అచ్యుతానంద’ అనే మంచి కొత్తదనమున్న కథ సిద్ధం చేసుకొని వచ్చా.

ప్రశ్న) ‘జ్యో అచ్యుతానంద’ ఎలా ఉండబోతోంది?

స) నా స్టైల్లోనే కూల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూడదగ్గ సినిమాగానే జ్యో అచ్యుతానంద ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయి వెంట పడడం అన్నది ఇంతకుముందే చాలా సినిమాల్లో వచ్చి ఉండొచ్చు. ఇందులో అందుకు భిన్నంగా అదే అంశాన్ని చెప్పానని భావిస్తున్నా. రేపు సినిమా చూశాక ప్రేక్షకులూ ఆ కొత్తదనాన్ని ఫీల్ అవుతారనే అనుకుంటున్నా.

ప్రశ్న) ఈ కథలో ఇద్దరు హీరోలకీ పెళ్ళైపోయినట్లు ప్రమోషన్స్‌లోనే చెప్పేశారు. ట్విస్ట్‌ని ఇక్కడే బయటపెట్టేశారేమో?

స) అలా అని ఏమీ లేదు. కథలో ఒక అంశాన్ని దాచిపెడదాం అని నేనెప్పుడూ అనుకోను. ఈ సినిమాలో హీరోలిద్దరికీ పెళ్ళైన విషయం మొదటి షాట్‌లోనే చెప్పేశా. అసలు కథను ఆ తర్వాత ఎలా నడిపించానన్నదే నా రైటింగ్‌లో నేను చూపిన కొత్తదనంగా భావిస్తా.

ప్రశ్న) సినిమా అంతా నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనాల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. ఈ ముగ్గురితో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

స) చాలా బాగుండేది. అందరూ ఫన్ లవింగ్. తమ తమ పాత్రల్లో అందరూ బాగా నటించారు. ప్రధాన కథ ఈ ముగ్గురి చుట్టూనే తిరిగేది కావడంతో వాళ్ళూ ఈ సినిమా కోసం లుక్స్ విషయంలో స్వయంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రశ్న) వారాహి చలన చిత్రం బ్యానర్‌లోనే రెండో సినిమా కూడా చేశారు. ప్రత్యేక కారణం?

స) వారాహి సంస్థలో, సాయి కొర్రపాటి గారితో ఎవ్వరు పనిచేసినా, వెంటనే మరో సినిమా చేయాలనుకుంటారు. నేనూ అలా ఇష్టపడి ఈ సినిమా చేసిన వాడినే. ఈ బ్యానర్‌లో టీమ్ అందరికీ మంచి కంఫర్ట్ దొరుకుతుందనిపిస్తుంది. ఇదే బ్యానర్‌లో మరో సినిమా కూడా చేయనున్నా. అది మూడోది గానీ, ఆ తర్వాతది గానీ ఉంటుంది.

ప్రశ్న) యాక్టింగ్, డైరెక్షన్.. ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయడం ఎలా ఉంది?

స) ఒకేసారి యాక్టింగ్, డైరెక్షన్.. రెండు పనులూ అస్సలు చేయను. ఒక్కసారి డైరెక్టర్‌గా మారిపోయానంటే మళ్ళీ సినిమా అయిపోయే వరకూ యాక్టింగ్ పక్కన పెట్టేస్తా. ఆ విషయంలో మొదట్నుంచీ పక్కా క్లారిటీగా ఉన్నా. సో, రెండు కెరీర్స్‌కీ ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నా.

ప్రశ్న) మీ మొదటి సినిమా విషయంలో రైటర్‌గా బాగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోనూ రైటర్‌దే డామినేషన్ ఉంటుందా?

స) వెల్.. నిజంగానే రైటర్‌గా ఎక్కువ ఆలోచిస్తూంటా. ఈ సినిమాకు ఎక్కువగా నా రైటింగే బలంగా నిలుస్తుందని చెప్పగలను. అయితే మొదటి సినిమాలో ఎక్కువగా డైలాగ్స్‌తో నడిపినట్లుగా కాకుండా, ఈసారి మరో రకంగా అదే ఫీల్ తెచ్చే ప్రయత్నం చేశా. అది రేపు సినిమా చూశాక మీరే ఎలా ఉందో చెప్పాలి.

ప్రశ్న) ‘జ్యో అచ్యుతానంద’లో నాని స్పెషల్ రోల్ చేశారని తెలిసింది. నిజమేనా?

స) నిజమే. నాని ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. ఇంతకుమించి ఆ రోల్ ఏంటి? ఎలా ఉంటుందీ? అనేది ఇప్పుడే చెప్పలేను.

ప్రశ్న) తదుపరి సినిమాలేంటి?

స) ‘హంటర్’ అనే ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ చేస్తున్నా. ఆ సినిమాలో ఎమోషన్ బాగా నచ్చడంతో, అడల్ట్ కంటెంట్ అయినా ధైర్యంగా చేయాలని డిసైడ్ అయ్యా. ఇక నానితో ఓ సినిమా, వారాహి బ్యానర్‌లో ఓ సినిమా దర్శకుడిగా కమిట్ అయిన సినిమాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు