ఇంటర్వ్యూ : బీఏ రాజు – సూపర్‌స్టార్ కృష్ణ గారే నా గాడ్ ఫాదర్!

ఇంటర్వ్యూ : బీఏ రాజు – సూపర్‌స్టార్ కృష్ణ గారే నా గాడ్ ఫాదర్!

Published on Jan 6, 2017 4:38 PM IST

ba-raju
బీఏ రాజు అన్న పేరు తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ సుపరిచితమైన పేరు. 24 ఏళ్ళుగా సినిమాలకు సంబంధించిన పత్రిక అయిన సూపర్ హిట్ మ్యాగజైన్‌ను నడుపుతూ, పలు చిత్రాలను నిర్మించి, కొన్ని వందల చిత్రాలకు పీఆర్ఓగా పనిచేసిన ఆయన జనవరి 7న తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి, ఆయన నిర్మిస్తోన్న కొత్త సినిమా ‘వైశాఖం’ గురించి తెలుసుకుంటూ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘వైశాఖం’ అనే సినిమా ఎంతవరకు వచ్చింది?

స) ధన్యవాదాలు. ‘వైశాఖం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే అన్ని పనులూ పూర్తయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తాం. 2017లో కచ్చితంగా హిట్ సినిమాల్లో ఒకటిగా వైశాఖం నిలుస్తుందన్న నమ్మకం ఉంది. మంచి నిర్మాణ విలువలతో, మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ప్రశ్న) చిన్న సినిమాల పరిస్థితి ఆశించినంతగా లేదన్న పరిస్థితుల్లో, కొత్త వాళ్ళతో, మంచి నిర్మాణ విలువలతో సినిమా అంటే రిస్క్ కాదా?

స) అలాంటిదేమీ లేదు. ‘బిచ్చగాడు’ అనే సినిమాను హిట్ కాకుండా ఎవరు ఆపగలిగారు? మన సినిమాలో మంచి కంటెంట్ ఉన్నపుడు చిన్న సినిమా అయినా నిలబడుతుందన్న అభిప్రాయం నాకుంది. రేపు మా ‘వైశాఖం’ కూడా అలాగే ప్రేక్షకుల అభిమానం చూరగొంటుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) నిర్మాతగా మీ 15 ఏళ్ళ కెరీర్‌లో తక్కువ సినిమాలే నిర్మించారు. ఎందుకని?

స) మన ఉనికిని చాటే సినిమాలే నిర్మించాలన్న అభిప్రాయంతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నా. ఇప్పటివరకూ మా బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలా చేసే ప్రతి సినిమా అందరినీ సంతృప్తి పరచేలా ఉండాలన్నది నా అభిప్రాయం. ఇప్పుడు వైశాఖం కోసం కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ స్వయంగా వచ్చి అడుగుతున్నారంటే మా బ్యానర్‌పై ఉన్న నమ్మకమే!

ప్రశ్న) మీ సినీ ప్రయాణం గురించి క్లుప్తంగా చెప్పండి?

స) మొదట సినీ జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించా. కొన్నాళ్ళకు సూపర్ హిట్ మ్యాగజైన్ స్థాపించి 24 ఏళ్ళుగా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తూ వస్తున్నా. ఆ తర్వాత పీఆర్‌ఓగా కొన్ని వందల సినిమాలకు పనిచేశా. ఈ క్రమంలో దాదాపుగా తెలుగులో ఉన్న అందరు స్టార్ హీరోలతో పనిచేశా. రెండు, మూడు తరాలకు సంబంధించిన స్టార్స్‌తో పనిచేసిన అనుభవం మరచిపోలేనిది. సినిమాలు నిర్మించాలన్న ఆలోచనతో ‘ప్రేమలో పావని కళ్యాణ్‌’తో నిర్మాతగా మారి వైశాఖం వరకూ కొనసాగుతూ వస్తున్నా.

ప్రశ్న) ఇంతమంది స్టార్స్‌తో పరిచయం ఉన్న మీరు, ఓ స్టార్ హీరోతో సినిమా ఎందుకు తీయలేకపోయారు?

స) స్టార్ హీరోతో సినిమా అంటే ప్లాన్ చేస్తే కుదరదు. అవన్నీ అనుకోకుండా జరిగిపోవాలి. స్టార్ హీరోతో సినిమా చేయాలని నాకూ ఉంది. అన్నీ కుదిరి త్వరలోనే అది నెరవేరుతుందని అనుకుంటున్నా.

ప్రశ్న) మీ సినీ ప్రయాణంలో మీకు అండగా నిలిచిన వారెవరు?

స) సూపర్ స్టార్ కృష్ణ గారు నన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయనే నాకు గాడ్ ఫాదర్ అని చెబుతా. ఆ తర్వాత చాలామంది స్టార్స్‌తో పనిచేశా. అందరూ నాతో బాగుంటారు. మంచి గౌరవమిస్తారు. ఒకేసారి చాలా సినిమాలకు పనిచేస్తూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నానంటే అది స్టార్స్‌తో నాకున్న బంధంవల్లనే అనిపిస్తూంటుంది.

ప్రశ్న) పుట్టినరోజు రిజల్యూషన్ ఏంటి?

స) నిరంతం పనిచేస్తూ ఉండడం అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతా. ప్రత్యేకంగా పుట్టినరోజుకే నిర్ణయాలు తీసుకోవాలని ఏమీ ఉండదు. గతేడాది నా పుట్టినరోజుకు ఇండస్ట్రీ హిట్ అనే వెబ్‌సైట్ ప్రారంభించా. ఆ వెబ్‌సైట్‌ను ఈ పుట్టినరోజు నుంచి తెలుగులోనూ ప్రారంభిస్తున్నా.

ప్రశ్న) నిర్మాతగా భవిష్యత్ ప్రణాళికలేంటి?

స) ప్రస్తుతం వైశాఖం మీదే పనిచేస్తున్నా. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఒక సినిమా ప్రారంభించబోతున్నా. ఇకపై వరుసగా సినిమాలు నిర్మించాలన్న ఆలోచన ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు