చిట్‍చాట్ : భాను శంకర్ – ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ ఒక్కటేనా?!

చిట్‍చాట్ : భాను శంకర్ – ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ ఒక్కటేనా?!

Published on Jun 29, 2016 5:51 PM IST

bhanu1
అర్జున్ యజత్, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించగా, దర్శకుడు భాను శంకర్ తెరకెక్కించిన సినిమా ‘అర్థనారి’. ఓ హిజ్డా వేశంలో హీరో ఒక సామాజిక సమస్యపై పోరాడే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘అర్థనారి’ అన్న టైటిల్ ఏంటి? సినిమా ఏం చెప్పబోతోంది?

స) ‘అర్థనారి’ అంటే సగం మగ, సగం ఆడ అని అర్థం. ఒక హిజ్డా వేశంలో హీరో ఒక సామాజిక సమస్యపై ఎలాంటి పోరాటం చేశాడన్నదే కథ. మొత్తం 55మంది కొత్తవాళ్ళను పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమా పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా బలమైన కథతో మెప్పించే ప్రయత్నంగా వస్తోంది.

ప్రశ్న) పెద్ద సినిమా రేంజ్ కథ అన్నపుడు కొత్తవాళ్ళతో తీశారెందుకని?

స) పెద్ద హీరోతోనే ఈ సినిమా చేయాలని చాలామందిని సంప్రదించా. ఇప్పుడు పేర్లు అప్రస్తుతం కానీ, అందరూ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ అనే అనుకుంటున్నారు. హిజ్రా పాత్రలో నటించే ప్రయోగం చేయడానికి కూడా కొందరు హీరోలు నిరాకరించారు. తెలుగులో కొద్దికాలంగా ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ అయిపోయింది. అలాంటి ఆలోచన పోతేనే మంచి ప్రయోగాలు వస్తాయి.

ప్రశ్న) మరి ఆడియన్స్‌కి చేరువయ్యే అంశం మీ సినిమాలో ఏం ఉంది?

స) బలమైన ఎమోషన్ ఉంది. నా సినిమాకు అదే ఎంటర్‌టైన్‌మెంట్. ఒక కథ ఉండి, అందులో బలమైన ఎమోషన్ ఉంటే అనవసర ఆర్భాటాలు పెట్టాల్సిన పని ఉండదు.

ప్రశ్న) హిజ్డా పాత్రలో నటించిన నటుడి గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో హిజ్డా పాత్ర లేదు. హిజ్డా వేశంలో హీరో కనిపిస్తాడు. వైజాగ్‌కి చెందిన అర్జున్‌ని ఆడిషన్ చేసి హీరోగా ఎంపిక చేశాం. సినిమా విడుదలయ్యాకే అతడ్ని పరిచయం చేస్తాం. కమల్ హాసన్, రజనీ కాంత్ స్థాయి నటుడు అర్జున్ అని కచ్చితంగా చెప్పగలను. సినిమా చూశాక మీకే తెలుస్తుంది.. నేను ఈ మాట ఎందుకన్నానో!

ప్రశ్న) సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? తదుపరి సినిమా ఏంటి?

స) ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూశాకే, మెచ్చి, కొన్నారు. సుమారు 300 థియేటర్లలో సినిమా విడుదలవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏంటీ? అంటే సినిమా విడుదలయ్యేదాకా ఏమీ చెప్పలేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు