ఇంటర్వ్యూ : చాందినీ చౌదరి – తెలుగమ్మాయిలను ఎందుకు తక్కువ చేస్తారో అర్థం కాదు!

ఇంటర్వ్యూ : చాందినీ చౌదరి – తెలుగమ్మాయిలను ఎందుకు తక్కువ చేస్తారో అర్థం కాదు!

Published on Jun 23, 2016 1:22 PM IST

chandini
షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన నటి చాందిని చౌదరి, ఆ తర్వాత ఫీచర్ సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ హీరోయిన్‌గా మెప్పించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే ‘కేటుగాడు’ అనే సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన ఆమె, తాజాగా ‘కుందనపు బొమ్మ’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైంది. వరా ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదలవుతోన్న సందర్భంగా చాందినీ చౌదరితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకొచ్చి ఇప్పుడు ‘కుందనపు బొమ్మ’తో వస్తున్నారు. ఈ సినిమాతోనే మీరు పరిచయం కావాల్సింది కదా?

స) అవును. మొదట ‘కుందనపు బొమ్మ’తోనే నేను తెలుగు సినిమాకు పరిచయం కావాల్సింది. కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ రావడంతో ‘కేటుగాడు’ మొదట విడుదలై అదే డెబ్యూట్ సినిమా అయింది.

ప్రశ్న) కుందనపు బొమ్మ ఎలా ఉండబోతోంది?

స) పక్కా తెలుగు సాంప్రదాయాలు, పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో నడిచే అందమైన కథే ఈ ‘కుందనపు బొమ్మ’. అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా మంచి కామెడీ ఈ సినిమాలో ఉంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) నేను సుచి అనే ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సుచికి ఉండే కొన్ని సమస్యలు, తన చుట్టూ ఉండే ఇద్దరు వ్యక్తుల వల్లే మారే పరిస్థితులూ.. ప్రధానంగా కథంతా ఇక్కడే తిరిగే ఇలాంటి పాత్రలో నటించడానికి మొదట భయపడ్డా. నాకు, సుచి పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ పాత్రను అర్థం చేస్కొని తర్వాత దర్శకుడి సలహాల మేరకు చేసేశా.

ప్రశ్న) షార్ట్ ఫిల్మ్స్‌ నుంచి పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారడానికి మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు?

స) షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సరదాగా చేసినవే! ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర చేరడం, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం చూసి అందులో నేను కేవలం సరదాకే నటిస్తుండేదాన్ని. ఫీచర్ సినిమా అందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంటుంది. ఇదే నా ప్రొఫెషన్ అనుకున్నాకే ఇక్కడికి వచ్చా. ఇకపోతే ఇక్కడ పరిస్థితులు కూడా వేరేలా ఉంటాయి. అందరినీ నమ్మడానికి లేదు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా.

ప్రశ్న) ‘అందరినీ నమ్మడానికి లేదు’ అంటున్నారు.. ఎవరివల్లైనా ఇబ్బందులు వచ్చాయా?

స) మొదట్లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు నా రెండేళ్ళ కెరీర్‌ను వృథా చేశాయి. అప్పుడే అందరి మాటలూ నమ్మడానికి లేదని ఫిక్స్ అయిపోయా.

ప్రశ్న) తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు తక్కువ అవకాశాలు వస్తూంటాయని అంటారు. ఈ విషయంపై మీరేమంటారు?

స) ఈ విషయమే నాకూ అస్సలు అర్థం కాదు. చక్కగా తెలుగు మాట్లాడే, బాగా నటించగలిగే అమ్మాయిలు ఉన్నా కూడా ఎక్కువగా బయటివారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో తెలియదు. ఈమధ్య కాస్త పరిస్థితులు మారుతున్నాయనే అనుకుంటున్నా.

ప్రశ్న) తదుపరి సినిమాలు ఏంటి? కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?

స) ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు చేస్తున్నా. ఈ రెండిట్లో దర్శకుడు ఫణీంద్ర తెరకెక్కించే ‘మను’, తెలుగులో ఇప్పటివరకూ రానటువంటి జానర్‌లో వస్తోంది. ప్రస్తుతానికి వేరే అవకాశాలు వస్తున్నా, ఈ రెండు సినిమాలపైనే శ్రద్ధ పెట్టా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు