ఇంటర్వ్యూ : డి. వెంకటేష్ – అందరూ చూడదగ్గ క్లీన్ సినిమా ‘365 డేస్’!

ఇంటర్వ్యూ : డి. వెంకటేష్ – అందరూ చూడదగ్గ క్లీన్ సినిమా ‘365 డేస్’!

Published on May 23, 2015 3:15 PM IST

venkatesh
రామ్ గోపాల్ వర్మ అంటే ఓ వివాదం, రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు సినిమాకు ఓ కొత్త దారిని చూపిన మాస్టర్ ఫిల్మ్‌మేకర్. క్రైమ్, హర్రర్, డ్రామా, థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లలో సినిమాలు తీసిన వర్మ, తాజాగా రొమాన్స్ జానర్లో ‘365డేస్’ పేరుతో ప్రేమ, పెళ్ళి మధ్య నడిచే ఓ డిఫరెంట్ కథను తెరకెక్కించడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. నందు,అనైక సోతి జంటగా నటించిన ఈ సినిమా నిన్న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకు వస్తోన్న స్పందన గురించి నిర్మాత డి. వెంకటేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘365 డేస్’ సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది?

స) బాగుందండీ. టార్గెట్ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఏ సెంటర్లలో, మల్టిప్లెక్స్‌లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, కార్పోరేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు తమ జీవితాలనే తెరపై చూసుకుంటున్నారు. ఇక కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ సినిమా మంచి సందేశాన్నిస్తుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్స్ బాగున్నాయి. సాయంత్రం షో కల్లా మౌత్ టాక్‌తో కలెక్షన్లు పెరిగాయి. నేడు, రేపు కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం.

ప్రశ్న) రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో పనిచేయడం ఎలా ఉంది?

స) మా మొదటి సినిమానే రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో చేయడం నిజంగా అదృష్టమే! సినిమాలంటే ఇష్టంతో నిర్మాతగా మారి మంచి సినిమాలను తెరకెక్కించాలని ఇటువైపొచ్చా. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ గారిని కలవడం, ఆయన చెప్పిన ‘365 డేస్’ సినిమా కథ నచ్చడంతో వెంటనే చేసేశాం. ప్రొడక్షన్ దగ్గర్నుంచీ ప్రతీ విషయంలో ఆయనే దగ్గరుండి చూసుకున్నారు.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ఇప్పటివరకూ గ్యాంగ్‌స్టర్, థ్రిల్లర్ సినిమాలు తీస్తూ పోయిన రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాతో తన పంథాకు కొత్తదైన రొమాన్స్ జానర్లో ఓ సినిమా చేయడం మేజర్ హైలైట్. రామూ గారు కాకుండా ఈ సినిమా మరెవరూ చేసిన కామెడీ యాంగిల్‌తో తెరకెక్కించేవారేమో! ఒక కొత్తగా పెళ్ళైన జంట జీవితాల్లో ఈగో ప్రాబ్లమ్స్, ఇబ్బందులు వంటి వాటిని ఆయన చాలా సెన్సిబుల్‌గా, క్లీన్‌గా తెరకెక్కించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ప్రతీ ఒక్కరూ ఏ ఇబ్బంది లేకుండా చూడగలిగే క్లీన్ రొమాంటిక్ సినిమా.. ‘365 డేస్’.

ప్రశ్న) భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు?

స) భవిష్యత్‌లోనూ మంచి సెన్సిబుల్ సినిమాలనే తెరకెక్కించాలన్నది నా అభిమతం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ సినిమాలనే తెరకెక్కిస్తా. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గారే మాకు స్ఫూర్తి. ఆయనలానే సెన్సిబుల్ కథలను ఎన్నుకొని సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తా.

ప్రశ్న) ఇండస్ట్రీ నుంచి ప్రోత్సాహం ఎలా ఉంది?

స) కొంతవరకు బాగానే ఉంది. ఆడియన్స్‌కి కూడా చిన్న సినిమాల విషయంలో చిన్నచూపు పోవాలి. ప్రేక్షకులు ఆదరిస్తేనే అర్థవంతమైన చిన్న సినిమాలు వస్తాయి. వారం దాటితేగానీ చిన్న సినిమా మౌత్ టాక్ బయటకు రాదు. ఈలోపు వేరే సినిమాలు థియేటర్లలో వాలిపోతున్నాయి. ఈ విషయంలో మార్పు రావాలి.

ప్రశ్న) తరువాతి ప్రాజెక్టుల గురించి చెప్పండి?

స) దర్శకుడు వంశీ గారితో ఓ మంచి సినిమా చేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా సినిమా పూర్తి కావచ్చింది. ఆయన స్టైల్లో సాగే అందమైన సినిమా అది. జూన్‌లో ఆ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇక ప్రముఖ నటి మీరా జాస్మిన్ మళయాలంలో చేసిన థ్రిల్లర్ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు