ఇంటర్వ్యూ : దేవిశ్రీ ప్రసాద్ – ట్యూన్ కాపీ అంటే పెద్ద నేరం, అందుకే నేను కాపీ కొట్టను.

ఇంటర్వ్యూ : దేవిశ్రీ ప్రసాద్ – ట్యూన్ కాపీ అంటే పెద్ద నేరం, అందుకే నేను కాపీ కొట్టను.

Published on Nov 23, 2015 1:13 PM IST

devi-sri-prasad
దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అభిమానుల మన్ననలు పొందుతూ దూసుకుపోతోన్న రాకింగ్ స్టార్. వరుస హిట్స్‌తో యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, తాజాగా తన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు అయిన సుకుమార్ నిర్మించిన కుమారి 21F సినిమాతో మళ్ళీ యూత్‍కు విపరీతంగా కనెక్ట్ అయ్యే ఆల్బమ్‍తో మెప్పించారు. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, గత శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలై హిట్ టాక్‍తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) కుమారి 21Fకు వస్తోన్న రెస్పాన్స్ చూశాక ఎలా ఉంది?

స) అద్భుతంగా ఉందండీ. మొదట్నుంచీ ఈ సినిమాపై విపరీతమైన నమ్మకంతో ఉన్నాం. సుకుమార్, నేను, రత్నవేలు.. ఇలా ముగ్గురు టెక్నీషియన్స్ కలిసి ఇష్టంతో చేసిన ఒక పనికి ఇంతటి రెస్పాన్స్ రావడం చూస్తే, చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే.. ఒక సినిమా హిట్ అయితే, ఓకే సినిమా హిట్ అయ్యింది, హ్యాపీస్ అనుకుంటాం. ఈ సినిమా విషయంలో మా నమ్మకం హిట్ అయ్యింది అనే ఫీలింగ్ కలిగింది. అందుకు ఇంకా హ్యాపీ!

ప్రశ్న) ఇండస్ట్రీ నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. మీకు పర్సనల్‌గా ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి?

స) ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోల్లో ఫస్ట్ రెస్పాన్స్ అంటే ఎన్టీఆర్ గారిదే! ఆయనే మొదట ఈ సినిమా చూశారు. సినిమా చూశాక ఆయనిచ్చిన రెస్పాన్స్ చూశాక ఎక్కడిలేని ఉత్సాహం వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత మహేష్ గారు, రవితేజ గారు, బన్నీ ఇలా అందరూ నాకు పర్సనల్‌గా ఫోన్ చేసి మరీ అభినందించారు.

ప్రశ్న) కుమారి 21F విషయంలో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన అంశం ఏంటి?

స) సుకుమార్ గారు అందించిన కథే కుమారికి మేజర్ హైలైట్. ఆ కథ వినగానే ఆయనెంత కొత్తగా ఆలోచిస్తారో మరోసారి స్పష్టమైంది. ఇలాంటి ఒక బోల్డ్ కథ తెలుగులో రావడం, ఈ కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మంచి కథతో చెప్పడం నన్ను బాగా ఎగ్జైట్ చేశాయి. ఇప్పుడీ సినిమా పాటల విషయంలో, బ్యాక్‌గ్రౌండ్ విషయంలో నాకు ఈ స్థాయి కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే ఆ క్రెడిట్ సుక్కుకే వెళుతుంది.

ప్రశ్న) ఈ సినిమాకు ఓ ఇంటరెస్టింగ్ ఆల్బమ్ అందించడంతో పాటు బ్యాంకాక్ పాటకు కొరియోగ్రఫీ కూడా చేశారట. ఈ కొత్త పాత్ర ఎలా ఉంది?

స) నవ్వుతూ.. అదంతా అనుకోకుండా జరిగిపోయింది. ఈ ట్యూన్ డిజైన్ చేసినప్పుడే కొన్ని మూమెంట్స్ కూడా చెప్పా. సుకుమార్‍, రత్నవేలులకు అది నచ్చి పూర్తి కొరియోగ్రఫీ చేయించేశారు. బ్యాంకాక్ నేపథ్యాన్ని కొత్తగా పరిచయం చేయడం అనే పాయింట్ లో ఈ పాట బాగా సక్సెస్ అయింది.

ప్రశ్న) దర్శకుడు సూర్య ప్రతాప్ గురించి చెప్పండి?

స) సూర్య ప్రతాప్‌తో సుకుమార్ ద్వారానే కరెంట్ సినిమా అప్పుడు పరిచయం అయింది. ఆ సినిమా కూడా ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని చూపించింది. ఇక ఈ సినిమాలో అయితే అతడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను అంత పకడ్బందీగా, ఎమోషన్ మిస్సవకుండా చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో రాజ్ తరుణ్, హేభ పటేల్‌ల యాక్టింగ్‌ను కూడా మెచ్చుకోవాలి.

ప్రశ్న) టాప్ హీరోల సినిమాలకు పనిచేయడం, ఇలా చిన్న సినిమాలకు పనిచేయడంలో ఏదైనా తేడా చూపిస్తారా?

స) అస్సలేదు. నిజం చెప్పాలంటే చిన్న సినిమాల్లో నేనిచ్చిన కొన్ని పాటలు పెద్ద సినిమాలకంటే కూడా పాపులర్ అయినవి ఉన్నాయి. ఒక సినిమా చేస్తున్నామంటే అది నచ్చితేనే చెస్తాం. అప్పుడిక చిన్న, పెద్ద అని తేడా చూసే అవకాశమే లేదు.

ప్రశ్న) సర్దార్ గబ్బర్ సింగ్, నాన్నకు ప్రేమతో.. ఇలా రెండు క్రేజీ సినిమాలకు పనిచేస్తున్నారు. అవి ఎలా ఉండబోతున్నాయి?

స) కచ్చితంగా ఈ రెండు సినిమాల ఆల్బమ్స్ కూడా అంచనాలను అందుకుంటాయన్న నమ్మకం ఉంది. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కెరీర్‌కి మరో బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్‌ పాటల విషయంలో పవన్ గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఒక మెలోడీ విని ఓ పెద్ద మెసేజ్ పెట్టారు. ఈ రెండు సినిమాల కోసం నేనూ అందర్లానే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో ట్యూన్స్ కాపీ అవుతున్నాయంటూ ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?

స) నేనైతే నా కెరీర్లో ఇప్పటివరకూ కాపీ కొట్టలేదు. చెప్పాలంటే.. ఒక దర్శకుడు ఒక వెస్ట్రన్ ట్యూన్ వినిపించి, కాపీ కొట్టమంటే నో అనేశా. మనం సంగీతం నేర్చుకొని కాపీ కొడుతున్నామంటే అసలు చేస్తున్న పనికి అర్థమే లేదు. ఎక్కడైనా ఒక స్వరం కలిస్తే చెప్పలేం కానీ, తెలిసి మాత్రం నేనెప్పుడూ వేరే ట్యూన్ తీసుకోలేదు. ఒకరి ట్యూన్ కాపీ కొట్టడమంటే అది పెద్ద నేరం కిందే లెక్క!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు