ఇంటర్వ్యూ : కాజల్ – మొదట్లో ‘బ్రహ్మోత్సవం’ చేయాలా? వద్దా? అనుకున్నా!

ఇంటర్వ్యూ : కాజల్ – మొదట్లో ‘బ్రహ్మోత్సవం’ చేయాలా? వద్దా? అనుకున్నా!

Published on May 13, 2016 5:24 PM IST

kaj
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించారు. మహేష్‌తో ఇప్పటికే ‘బిజినెస్‌మేన్’ అనే సినిమా చేసిన కాజల్, మళ్ళీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందని తెలుపుతూ నేడు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) మహేష్‍తో కలిసి చేసిన రెండో సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

స) మహేష్, నేను కలిసి ఇదివరకు చేసిన ‘బిజినెస్‍మేన్’ సినిమాకూ, ఈ సినిమాకూ అస్సలు పోలిక ఉండదు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పేరులోనే చెప్పినట్లు, ఇదో ఉత్సవం లాంటి సినిమా. శ్రీకాంత్ అడ్డాల గారు రాసిన అద్భుతమైన కథే ఈ సినిమాకు మేజర్ హైలైట్‍గా నిలుస్తుందని చెప్పొచ్చు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమాలో నేను ఓ ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తా. మామూలుగా మన సినిమాల్లో ఎన్నారై అమ్మాయి అంటే ఆ పాత్రకు కాస్త అతి జోడించి చూపిస్తుంటారు. శ్రీకాంత్ అడ్డాల గారు మాత్రం ఈ క్యారెక్టర్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఈతరం ఆలోచనలు, స్వతంత్ర్య భావాలున్న అమ్మాయి పాత్రలో నటించడం చాలా కొత్తగా కనిపించింది.

ప్రశ్న) మీ ఇతర సినిమాల్లోని పాత్రలకు, ఈ సినిమాకు ఏవైనా పోలికలు ఉన్నాయా?

స) అస్సల్లేవు. నిజానికి శ్రీకాంత్ అడ్డాల గారు ఈ కథ చెప్పినప్పుడు చేయాలా? వద్దా? అని చాలా ఆలోచించా. నాకున్న అనుమానాలన్నీ తీర్చుకున్నాక, ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయి చేసేశా. ఇలాంటి స్వతంత్ర్య భావాలున్న అమ్మాయి పాత్రలో నేను ఇదివరకు నటించలేదు. దీంతో ఈ రోల్ నాకు చాలా స్పెషల్.

ప్రశ్న) శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించడం గురించి చెప్పండి?

స) శ్రీకాంత్ గారు చాలా కూల్ అండ్ సింపుల్. ముందే చెప్పినట్టు, కథ చెప్పినప్పటి దగ్గర్నుంచే నాకు ఈ పాత్రపై చాలా అనుమానాలు ఉండేవి. అయితే ఆయన నాకు వాటికి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికీ నా రోల్‍కి ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తారా? అని చాలా అనుకునేదాణ్ణి. సినిమా చూశాక ఇంత అద్భుతంగా దీన్ని డీల్ చేశారా అనిపించింది.

ప్రశ్న) మరో స్టార్ సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఫీలయ్యారా?

స) అలాంటి లెక్కలేసుకొని ఎవ్వరూ సినిమాలు చేయరు. సినిమాలో మన పాత్ర ఎలా ఉందీ? దానికి ప్రాధ్యాన్యత ఎలా ఉందీ? అన్నదే ముఖ్యం. బ్రహ్మోత్సవం కథ ప్రకారం ఇందులో పాత్రలుంటాయే తప్ప స్టార్ స్టామినాపై అవి ఆధారపడవు. అలాంటప్పుడు మల్టిస్టారర్ అయినా, మరింకేదైనా మనం ఇబ్బందిగా ఫీలవ్వడానికి ఏమీ లేదు.

ప్రశ్న) మహేష్‍తో మళ్ళీ కలిసి నటించడం గురించి చెప్పండి?

స) ముందుగా ఒకమాట చెప్పాలి… ‘బిజినెస్‍మేన్’ అప్పటితో పోలిస్తే మహేష్ ఇప్పుడింకా యంగ్ అయిపోయారు. విజువల్స్ చూస్తే, మీకే అర్థమవుతుందనుకుంటా, సినిమాలో ఆయనెలా ఉండబోతున్నారో! ఆయన ఛార్మింగ్ అలా ఉంచితే, ఒక నటుడిగా ఒక్కో సినిమాకూ ఎదుగుతూ వెళ్ళడం కూడా మహేష్‍ను చూసి నేర్చుకోవాలి. సూపర్ స్టార్ అయినా కూడా ఇంకా ఏమేం చేయగలమా అని నటన విషయంలో ఎప్పుడూ పూర్తి స్థాయిలో మెప్పించాలని ప్రయత్నిస్తుంటారు. ఇక ఒక స్టార్‍తో కలిసి మళ్ళీ నటించేప్పటికి ఇద్దరికీ ఒక రాపో కుదిరి ఉంటుంది. ఈ సినిమా విషయంలో మహేష్ చాలా సపోర్ట్‌గా నిలిచారు. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా క్యూట్‍గా ఉంటుంది.

ప్రశ్న) పీవీపీ సినిమా బ్యానర్ గురించి చెప్పండి?

స) పీవీపీ గారు ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వారిలా సినిమాను అలా చాకచక్యంగా పూర్తి చేస్తుంటారు. స్క్రీన్ నిండా స్టార్స్ ఉండే సినిమాను ఇలా పకడ్బందీగా పూర్తి చేయడంలో పీవీపీ టీమ్ చేసిన కృషి చాలా బాగుంది.

ప్రశ్న) చివరగా, బ్రహ్మోత్సవం సినిమాకు హైలైట్స్ అంటే ఏమని చెబుతారు?

స) ముందే చెప్పినట్లు, కథ, మహేష్ చరిష్మా ఈ సినిమాకు మేజర్ హైలైట్స్. ఇకపోతే కలర్‍ఫుల్ సీన్స్, సినిమా నిండా కనిపించే స్టార్స్, అందమైన కుటుంబ బంధాలు.. ఇవన్నీ అన్ని రకాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు. ఈ సమ్మర్‍లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుందీ సినిమా!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు