ఇంటర్వ్యూ : క్రిష్ – ఇకపై ధైర్యంగా నా పంథాలోనే సినిమాలు చేసుకోవచ్చు!

ఇంటర్వ్యూ : క్రిష్ – ఇకపై ధైర్యంగా నా పంథాలోనే సినిమాలు చేసుకోవచ్చు!

Published on Jan 16, 2017 4:34 PM IST

krish
దర్శకుడు క్రిష్ సినిమాలంటేనే తెలుగు సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా కావడంతో మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలను అందుకొని శాతకర్ణి హిట్ దిశగా దూసుకెళుతోన్న సందర్భంగా దర్శకుడు క్రిష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి వస్తోన్న రెస్పాన్స్ ఎలా ఉంది?

స) అద్భుతంగా ఉంది. మేము మొదట్నుంచీ అనుకున్నట్లుగానే సంక్రాంతికే సినిమాను విడుదల చేశాం. అన్నివర్గాల ప్రేక్షకులూ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటున్నా.

ప్రశ్న) మీకు ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?

స) మొదటిరోజు బాలకృష్ణ గారితో కలిసి సినిమా చూశా. సినిమా అయిపోగానే ఆయన నాకు గట్టిగా షేక్ హ్యాండ్ ఇస్తూ మంచి సినిమా తీశాం అని సంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే నాకు సక్సెస్‌పై పూర్తిగా నమ్మకం వచ్చేసింది. అదేరోజు నా భార్య రమ్యతో కలిసి మార్నింగ్ షోకు వెళ్ళా. పెళ్ళయిన తర్వాత వెంటనే సినిమా మొదలవ్వడంతో తనతో ఎక్కువ సమయం గడపలేకపోయా. ‘మనం ఎక్కువ సమయం గడపలేకపోయిన ఈ టైమ్‌లో అద్భుతమైన సినిమా తీశారు’ అంటూ తనిచ్చిన కాంప్లిమెంట్ బెస్ట్ అని చెప్పగలను.

ప్రశ్న) ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది?

స) ఇండస్ట్రీ నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు.. ఇలా స్టార్స్ అంతా ఫోన్ చేస్తూ అభినందిస్తున్నారు. ఈ మూడు రోజులుగా నా ఫోన్ మోగుతూనే ఉంది, నేను అభినందనలను అందుకుంటూనే ఉన్నా. చిరంజీవి గారు, మహేష్, వెంకటేష్ గారు, తారక్, నాగార్జున గారితో సహా చాలామంది హీరోలు ఫోన్ చేసి అభినందించారు.

ప్రశ్న) శాతకర్ణి జీవిత చరిత్రను వక్రీకరించారని కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానిపై మీరేమంటారు?

స) శాతకర్ణి కథ 2 వేల సంవత్సరాల క్రితంది. ఆ చరిత్రకు సంబంధించిన వివరాలు మన వద్ద చాలా తక్కువ ఉన్నాయి. మేము సాధ్యమైనంత మేరకు అన్నివిధాలా సమాచారాన్ని సేకరించి, ఎంతో మంది పరిశోధనాకారులతో మాట్లాడి, ఎన్నో పుస్తకాలు చదివాకే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. తెలిసిన సంఘటనలే తీసుకొని, దాన్ని సినిమాగా మలిచే క్రమంలో కల్పిత సన్నివేశాలు ఉంటాయి. అలా అని శాతకర్ణి కథను వక్రీకరించామని చెప్పలేం. ఒక గొప్ప వ్యక్తి కథను సినిమాగా తీసేప్పుడు రీసెర్చ్ లేకుండా సినిమా అయితే తీయం కదా!

ప్రశ్న) ‘భాజీరావు మస్తానీ’ అనే హిందీ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను తీసుకున్నారన్న పుకార్లపై ఎలా స్పందిస్తారు?

స) ఇలాంటి పుకార్లు విన్నపుడు నిజంగా బాధేస్తుంది. డబ్బులిచ్చి కొన్ని సన్నివేశాలను భాజీరావు మస్తానీ నుంచి తీసుకున్నామని పుకారొచ్చింది. ఇలాంటి పుకార్లు ఎక్కడ్నించి పుడతాయో కూడా నాకర్థం కాదు. మేం ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇలా ఏది పడితే అది కల్పించి చెప్పడం మంచిది కాదు.

ప్రశ్న) బాలకృష్ణ గారి వందో సినిమా అవ్వడంతో ఒత్తిడి ఏమీ అనిపించలేదా?

స) ఇది బాలయ్య గారి వందో సినిమా అనేదానికంటే శాతకర్ణి కథను చెప్పగలమా? లేదా? అన్న ఒత్తిడే ఎక్కువగా ఉండేది మొదట్లో! ఒక్కసారి సినిమా మొదలయ్యాక ఇక అందరం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఈ ఔట్‌పుట్ తీసుకురాగలిగాం. తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమైన సినిమాను బాలయ్య గారు కూడా ఇలాంటి కథతో చేయడం గొప్ప విషయం. కథ ఒప్పుకున్న రోజునుంచీ చివరిరోజు వరకూ ఆయనిచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. బాలయ్య గారిని తప్ప నేనైతే ఎప్పుడూ శాతకర్ణి పాత్రలో మరొకరిని ఊహించుకోలేదు. అదే ఇప్పుడు ప్రేక్షకులు కూడా చెబుతున్నారు.

ప్రశ్న) మొదట్లో బాలకృష్ణ వందో సినిమాకు ‘రైతు’ అనే సినిమా ఖరారైంది అన్నపుడు మీరెలా ఫీలయ్యారు?

స) రైతు అనే సినిమా అనౌన్స్ అవ్వనున్నట్లు నాకూ తెలిసింది. అయితే ఎక్కడో శాతకర్ణి చేస్తారేమో అన్న ఆశ ఉండేది. అనుకున్నట్లుగానే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పడం అలా జరిగిపోయింది. నిజానికి బాలయ్య వందో సినిమా కాకపోతే శాతకర్ణికి ఈ స్థాయి క్రేజ్ వచ్చేదని నేననుకోను.

ప్రశ్న) ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయం తర్వాత దర్శకుడిగా ఎలాంటి ధైర్యం వచ్చింది?

స) దర్శకుడిగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నాకొక గొప్ప ధైర్యాన్నిచ్చింది. కామెడీ, ఫైట్లు ఉండేలా చూసుకునే కమర్షియల్ సినిమాలే కాక, డిఫరెంట్‌గా కొత్త కథ ఏదైనా చెప్పినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఋజువైంది. ఇకపై నా పంథాలో, డిఫరెంట్ సినిమాలను ధైర్యంగా చేసుకోవచ్చు!

ప్రశ్న) 79 రోజుల్లో ఈ స్థాయి విజువల్స్‌తో సినిమా ఎలా తీశారన్నదే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. అదెలా సాధ్యమైంది?

స) మా బడ్జెట్ పరిధులు, ఎన్ని రోజుల్లో సినిమా పూర్తి చేయాలన్న లెక్కలు, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలన్న ఆలోచన.. ఇలా అన్నీ ముందే దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ప్రొడక్షన్‌ను ప్లాన్ చేశాం. మొత్తం సినిమాను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఎలా పూర్తి చేయాలో ముందుగా ఒక అవగాహనకు వచ్చాం. మొత్తం మూడు యూనిట్స్‌గా మారి ఒక్కో టీమ్ ఒక్కో భాగంపై పనిచేసేలా చూశాం. షూటింగ్‍లో మెయిన్ టీమ్ ఉంటే, మిగతా రెండు టీమ్స్ తర్వాతి భాగాలకు సంబంధించిన ప్రొడక్షన్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తూ ఉంటుంది. ఇలా ఒక భాగం షూట్ అయిపోగానే, వెంటనే మరో భాగం షూట్ మొదలవుతుంది. దీంతో ఇటు రిలీజ్ డేట్‌ను అందుకోవడంతో పాటు తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయగలిగాం.

ప్రశ్న) స్టార్స్ అంతా ఫోన్లు చేస్తూ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మరి వీరిలో ఎవరితో సినిమా చేస్తున్నారు?

స) (నవ్వుతూ..) వెంకటేష్ గారి 75వ సినిమా చేయనున్నా. అశ్వినిదత్‌ గారు ఆ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఒక సినిమా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు