ఇంటర్వ్యూ : మల్కాపురం శివకుమార్ – ‘అమ్మోరు’, ‘అరుంధతి’ల్లా ‘నాగభరణం’..!

ఇంటర్వ్యూ : మల్కాపురం శివకుమార్ – ‘అమ్మోరు’, ‘అరుంధతి’ల్లా ‘నాగభరణం’..!

Published on Oct 13, 2016 1:59 PM IST

sivakumar-malkapuram
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు కోడి రామకృష్ణది ఓ ప్రత్యేకమైన శైలి. తన కెరీర్లో ఎన్నో జానర్స్‌లో సినిమాలు తీసి మెప్పించిన ఆయన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలైన ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నారు. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన ‘నాగరహవు’ అనే సినిమాను తెలుగులో ‘నాగాభరణం’ పేరుతో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రేపు (అక్టోబర్ 14న) పెద్ద ఎత్తున సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మల్కాపురం శ్రీనివాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘నాగభరణం’ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకు రావడానికి కారణం?

స) కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇదని మొదట ఎవ్వరికీ తెలియదు. టీజర్ తర్వాతే సినిమాకు ఓ క్రేజ్ వచ్చింది. రీ రికార్డింగ్ సమయంలో విజువల్స్ కొన్ని చూసి వెంటనే సినిమాను తెలుగులో విడుదల చేయాలనుకున్నా. మా బ్యానర్‌లో సూర్య వర్సెస్ సూర్య, శౌర్య లాంటి మంచి సినిమాలను అందించాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గానూ ఓ మంచి సినిమాను అందిందవచ్చని నాగభరణంతో వస్తున్నాం.

ప్రశ్న) కోడిరామకృష్ణ లాంటి లెజెండరీ డైరెక్టర్ సినిమాను విడుదల చేస్తూండడం ఎలా ఉంది?

స) కోడి రామకృష్ణ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. అమ్మోరు, దేవీ, అరుంధతి లాంటి సినిమాలతో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగాలు చేశారాయన. ఇప్పుడు ఈ సినిమాతో మరింత ముందుకెళ్ళి, అదే విజువల్ ఎఫెక్ట్స్‌తో మరో అద్భుతం సృష్టించారు. అలాంటి సినిమాను నేను విడుదల చేస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) టీజర్ విడుదలైనప్పట్నుంచీ విజువల్ ఎఫెక్ట్స్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి చెప్పండి?

స) నిజమే! టీజర్ విడుదలైనప్పుడు 48 గంటల్లో 50 లక్షల వ్యూస్ వచ్చాయి. చనిపోయిన లెజెండరీ యాక్టర్‌ విష్ణు వర్ధన్ గారిని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై ఆవిష్కరించాలన్న ప్రయత్నమే సాహసం. అలాంటి సాహసాన్ని మకుట విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా చేపట్టింది. ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాలకు పనిచేసిన ఈ సంస్థ ‘నాగభరణం’కి కూడా అదిరిపోయే విజువల్స్ ఇచ్చి సినిమాకు ప్రాణం పోసింది.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ముందే చెప్పినట్లు విజువల్ ఎఫెక్ట్స్ కట్టిపడేసేలా ఉంటాయి. అదేవిధంగా కోడి రామకృష్ణ గారి సినిమాలన్నీ మహిళలను బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలో మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అమ్మోరు, అరుంధతి సినిమాలా తరహాలో నాగభరణం ఉంటుంది.

ప్రశ్న) ఎగ్జిబిటర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవుతోంది?

స) ఎగ్జిబిటర్స్ వద్ద నుంచి సూపర్ రెస్పాన్స్ ఉంది. టీజర్, ట్రైలర్ చూసి సినిమాకు పోటీ కూడా కనిపించింది. దసరా వారానికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడుతూ ఉండడంతో వాటికి థియేటర్స్ అలాగే ఉంచాలన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి 450-500 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రిలీజ్ తర్వాత మరిన్ని థియేటర్లు పెంచుతాం. కన్నడ, తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు