ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – సీనియర్ డైరెక్టర్స్ తో చాన్స్ వస్తే రెమ్యునరేషన్ తీసుకోను.!

ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – సీనియర్ డైరెక్టర్స్ తో చాన్స్ వస్తే రెమ్యునరేషన్ తీసుకోను.!

Published on Oct 30, 2014 1:39 PM IST

Manchu-Manoj
మంచు వారి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన మంచు మనోజ్ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ‘పోటుగాడు’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మంచు మనోజ్ చేసిన మరో కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరెంట్ తీగ’. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన మరియు హుదూద్ తుఫాన్ బాధితుల సహాయక చర్యల విశేషాలు తెలుసుకున్నాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) హుదూద్ బాధితుల కోసం మీరు, మీ టీం అంతా వెళ్లి సహాయం చేసారు. దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది.?

స) హుదూద్ బాధితుల కోసం మేము నిర్వహించిన ప్రోగ్రాంకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పక్క వాళ్ళని కూడా పట్టించుకోకుండా మొబైల్స్ లో మునిగి పోయి ఉండే యువతని మేము కదిలించగలిగాం. ఆ విషయంలో చాలా హ్యాపీ. చాలా మంది యువత, నా అభిమానులు ముందుకు వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి ఎన్నో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. కరెంట్ తీగ రిలీజ్ ముందు కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ కుదరలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ టీం మొత్తం వెళ్లి ఎక్కడెక్కడ చెట్లు పడిపోయి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకొని మొక్కలను నాటాలనుకుంటున్నాం.

ప్రశ్న) కరెంట్ తీగ మెయిన్ టెక్నికల్ టీం గురించి చెప్పండి.?

స) దేనికైనా రెడీ అప్పుడే నాగేశ్వర్ రెడ్డి వర్కింగ్ నచ్చి మీతో సినిమా చెయ్యాలని అడిగాను. నా కెరీర్లో ఇలాంటి డైరెక్టర్ తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక డైరెక్టర్ గానే కాదు నా సొంత బ్రదర్ లా కలిసిపోయారు. చాలా విషయాల్లో నాకు గురువులా తయారయ్యారు. ఇక అన్ని సినిమాలకంటే కరెంట్ తీగలో నన్ను చాలా బాగా చూపించిన సినిమాటోగ్రాఫర్ సతీష్ కి చాలా పెద్ద థాంక్స్. ఇకపోతే అచ్చు నా బెస్ట్ ఫ్రెండ్ సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే తిరుమల కిషోర్ మంచి డైలాగ్స్ రాసాడు. వీళ్ళందరూ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.

ప్రశ్న) ముఖ్య పాత్ర చేసిన జగపతి బాబు, హీరోయిన్ రాకుల్ ప్రీత్ గురించి చెప్పండి.?

స) సినిమా స్టొరీ ఫైనలైజ్ అవ్వగానే జగపతి బాబు గారికి ఇలా మీరు నా సినిమాలో చెయ్యాలి అనగానే రెమ్యునరేషన్, డేట్స్ ఏమీ అడగకుండా ఓకే అనేసారు. ఒక్కసారి కథ వినిపించి సెట్స్ పైకి వెళ్ళిపోయాం. ఈ సినిమాకి ఆయన పాత్రే బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఇక రాకుల్ ప్రీత్ సింగ్ చాలా డెడికేషన్ ఉన్న హీరోయిన్. నేను ఇప్పటివరకూ చేసిన హీరోయిన్స్ లో ది బెస్ట్ రాకుల్ ప్రీత్. ఎందుకంటే తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక సంవత్సరమే అయినప్పటికీ తెలుగు బాగా నేర్చుకుని, ప్రతి సీన్ ని ఎలా చెయ్యాలో అడిగి చాలా బాగా చేసింది. ఈ మూవీలో తన పెర్ఫార్మన్స్ కి చాలా పెద్ద పేరు వస్తుంది.

ప్రశ్న) కరెంట్ తీగ లోని సన్నీ లియోన్ స్పెషల్ రోల్ మీ అందరినీ డామినేట్ చేస్తుందా.?

స) అవును కచ్చితంగా డామినేట్ చేస్తుంది. ఉండేది కొద్ది సేపే అయినా ఎక్కువ క్రెడిట్ కొట్టేస్తుంది. చెప్పాలంటే డామినేట్ చెయ్యాలనే తనని తీసుకున్నాం.

ప్రశ్న) కరెంట్ తీగ సినిమాని 25 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని చోట్ల చెయ్యడం ఖర్చుతో కూడుకున్న పని, మరి మీ ఖర్చు వెనక్కి వస్తుందంటారా.?

స) మీరన్నట్టు ఖర్చుతో కూడుకున్న పనే.. కానీ మేము ఈ సినిమాతో ఓ ప్రయోగం చేసాం. వర్కౌట్ అయితే అందరి సినిమాలు మినిమమ్ 20 దేశాల్లో అన్నా రిలీజ్ అవుతాయి. ఈ సినిమా విషయంలో ఏయే దేశాల్లో ఎప్పుడెప్పుడు సినిమా వేస్తే ప్రేక్షకులు వస్తారు అని రీసర్చ్ చేసి వాళ్ళ టైం కి తగ్గట్టు ఒక్కో చోట రోజుకి ఒకటి లేదా రెండు షోస్ మాత్రమే ప్లాన్ చేసాం కావున ఫైనాన్సియల్ గా కూడా లాస్ రాదని భావిస్తున్నాం.

ప్రశ్న) మీ నాన్న, అన్నయ్య రామ్ గోపాల్ వర్మతో సినిమాలు చేసారు మరి మీరెప్పుడు చేస్తారు.?

స) నేను రాము గారి లాంటి జీనియస్ తో పనిచేయడానికి ఎప్పుడూ రెడీనే. ఆయనకి నాతో చెయ్యాలి అనిపించినప్పుడు కచ్చితంగా చేస్తాను. నాకు దాసరి, రాఘవేంద్ర రావు, విశ్వనాధ్ గారి లాంటి సీనియర్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యాలని ఉంది. వాళ్ళతో పనిచెయ్యడం నాకు ఇష్టం, అందుకే ఎప్పుడు చాన్స్ వచ్చినా వదులుకోను. కావాలంటే రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తాను.

ప్రశ్న) మీ కెరీర్లో హిట్ ఉన్నాయి కానీ చెప్పుకోదగ్గ రేంజ్ హిట్ లేవు. ఆ విషయంలో మీరెప్పుడూ బాధపడలేదా.?

స) లేదనే చెప్పాలి ఎందుకంటే.. నేను ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త దానాన్ని ట్రై చేస్తూ వచ్చాను. చెప్పాలంటే మీరన్నట్టు నాకు సూపర్ డూపర్ హిట్స్ లేవు, అలాగే నిర్మాతలను బాగా ముంచేసిన సినిమాలు కూడా లేవు. నిజంగా నాకు అలానే ఫ్లాప్స్ ఉంటే సినిమా సినిమాకి నాకు ఓపెనింగ్స్ తగ్గాలి కానీ పెరుగుతున్నాయి. అంటే నేను చేసే కొత్త దనాన్ని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు.

ప్రశ్న) ఇప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మీరు నెగటివ్ షేడ్స్ చేస్తే ఆడియన్స్ చూస్తారంటారా.?

స) నేను ఇది వరకే చెప్పినట్టు నేను ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేస్తూ వస్తున్నాను,ఆదరించారు. ఇప్పుడు కూడా కచ్చితంగా ఆదరిస్తారు. ప్రస్తుతం నేను చేసే ఓ నెగటివ్ షేడ్స్ స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో అధికారికంగా అనౌన్స్ చేస్తాను.

ప్రశ్న) మీ పరంగా మంచు మనోజ్ బలం ఏమిటి.?

స) నా బలం అంటే నా కాన్ఫిడెన్స్ మరియు హార్డ్ వర్కింగ్ అని చెప్పాలి. ప్రతి పనిని ఎంతో నమ్మకంతో కష్టపడి పనిచేస్తాను. ఇక నేను తొందరగా అలసిపోను. నన్ను అలిసిపోఎలా చెయ్యడం అంత సులభం కాదు. ఇది కూడా నా బలం అనే చెప్పాలి.

ప్రశ్న) మీరు సినిమా చూసారా.. మీకనిపించిన కరెంట్ తీగ హైలైట్స్ ఏమిటి.?

స) సినిమా చూసాను. నా ప్రతి సినిమా ఫైనల్ కాపీ చూసాక ఎంత బాగున్న చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాను. ఏ రేంజ్ హిట్ అనేది విడుదలయ్యాకే చూడాలి. ఇక హైలైట్స్ అంటే సాంగ్స్, తిరుమల శెట్టి రాసిన డైలాగ్స్ తో పాటు కామెడీ, లవ్ అండ్ ఎమోషన్ సీన్స్ కూడా మెయిన్ హైలైట్ అవుతుంది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ సూపర్ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు