ఇంటర్వ్యూ : మారుతి – చిన్న సినిమాలకే ఎక్కువ కష్టపడాలి!!

ఇంటర్వ్యూ : మారుతి – చిన్న సినిమాలకే ఎక్కువ కష్టపడాలి!!

Published on Jun 29, 2016 1:59 PM IST

maruthi
దర్శకుడిగా మెప్పిస్తూనే, నిర్మాతగానూ కొత్తతరాన్ని ప్రోత్సాహించే ఉద్దేశంతో మారుతి తన సొంత బ్యానర్‌లో మొదట్నుంచీ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శ్రేయాస్ శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన సినిమా ‘రోజులు మారాయి’. కొత్త దర్శకుడు మురళి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం (జూలై 1న) విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా గురించి మారుతి చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ‘రోజులు మారాయి’ అంటూ కొత్త కథాంశంతో వస్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?

స) కొద్దికాలం క్రితం పేపర్లో, అక్కడక్కడా వార్తల్లో అమ్మాయిలు కూడా ఈమధ్య అబ్బాయిల వెంట పడుతున్నారని రావడం చూశా. ఈ ఆలోచనేదో బాగుందే అని అక్కణ్ణుంచి ‘రోజులు మారాయి’ అన్న కథ రాశా. కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా తీసుకొని, వాటిని సినిమాటిగ్గా ఎలా చెప్పొచ్చో ఆలోచించి పూర్తి కథ సిద్ధం చేశా.

ప్రశ్న) ఈ కథతో మీరే సినిమా తీయాలని ఎందుకనుకోలేదు?

స) నాకు మొదట్నుంచీ కొత్తవారిని ప్రోత్సాహించడమంటే ఇష్టం. నాతో పాటు కలిసి పనిచేసిన వారికి ఇలా అవకాశాలు ఇస్తే వాళ్ళూ నిరూపించుకుంటారు. ‘రోజులు మారాయి’ లాంటి కథలు అప్పటికప్పుడు చెప్పేయాలి. నేను నా సినిమాతో బిజీగా ఉన్నపుడు ఇలాంటి కథలను కొత్తవారితో డైరెక్ట్ చేయిస్తే వాళ్ళకూ అవకాశం దొరుకుతుందన్నదే నా ఆలోచన.

ప్రశ్న) దిల్‌రాజుతో అసోసియేట్ అవ్వడం గురించి చెప్పండి?

స) దిల్‌రాజు అన్న ఈ ప్రాజెక్టుకి రావడం మ్యాజిక్‌గా జరిగిపోయింది. ‘కేరింత’లో నటించిన పార్వతీశంను ఈ సినిమా కోసం సంప్రదించినపుడు, దిల్‌రాజుతో అతడికి అగ్రిమెంట్ ఉందని తెలిసింది. అప్పుడే దిల్‌రాజుకి కూడా కథ చెప్పా. ఈ కథేదో బాగుందే, సరదాగా నేనూ కో ప్రొడ్యూస్ చేస్తా అని ఆయన కూడా ఓ నిర్మాతగా చేరిపోయారు.

ప్రశ్న) ‘రోజులు మారాయి’లో మీ ‘బస్‌స్టాప్’ తరహా సినిమాల్లోలా అడల్ట్ కామెడీ ఏమైనా ఉంటుందా?

స) లేదు. అడల్ట్ కామెడీకి ఈ సినిమా దూరంగా ఉంటుంది. కొత్తగా ప్రయత్నించినప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు పక్కదార్లు పడుతుంటాం. ఇందులో స్ట్రైట్‌గా చెప్పాలనుకున్నది నీట్‌గా చెప్పేశాం. దిల్‌రాజు, నేను ఉన్నంత మాత్రాన ఇది పెద్ద సినిమా కాదు కాబట్టి, ఒక చిన్న సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలంటే ఎలా ఉండాలో ఈ సినిమా అలా ఉంటుంది.

ప్రశ్న) చిన్న సినిమాకు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు?

స) చిన్న సినిమాలకు కచ్చితంగా మార్కెట్ అంతంతమాత్రమే ఉంటుంది. మనం చెప్పాలనుకున్న అంశాన్ని ముందు ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. చిన్న సినిమాకు మొదటిరోజు ప్రేక్షకులు ఉండరన్నది తెలుసుకోవాలి. మరి అలాంటప్పుడు మనం ఓ మంచి బలమైన కథను చెప్తే తప్ప ఎవ్వరూ రెండు గంటల సినిమా చూడరు. చిన్న సినిమాకే ఎక్కువ కష్టపడాలని, ఆ సినిమా ఆడితే చిన్న సినిమా వల్లే పెద్ద పేరొస్తుందన్నది మర్చిపోకూడదు.

ప్రశ్న) ‘రోజులు మారాయి’లో ప్రేక్షకుడిని కట్టిపడేసే అలాంటి అంశాలేమేం ఉన్నాయి?

స) ఈతరం ప్రేమల గురించి చెప్పాం. ఇప్పుడు లవ్‌లో చాలామందికి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఊరికనే అయోమయంలో పడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది కాబట్టి కథకే అందరూ కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) ఈ సినిమా విషయంలో దర్శకుడిగా మీ ప్రమేయం ఏమైనా ఉందా?

స) అస్సలు లేదు. నేను నా సినిమాతోనే బిజీగా ఉన్నా. ఒక్కసారి కథ పూర్తి చేసి దర్శకుడు మురళికి ఇచ్చాక అంతా తానే చూసుకున్నాడు. మొన్నే సినిమా చూసినప్పుడు కూడా నేనైతే ఎలా తీసేవాడినో మురళి అలాగే తీసాడనిపించింది.

ప్రశ్న) మీ సినిమా ‘బాబు బంగారం’ విషయానికి వస్తే, మొదటిసారి ఒక పెద్ద స్టార్‌తో సినిమా చేశారు. ఎలా అనిపించింది?

స) నిజమే. వెంకటేష్ స్థాయి స్టార్‌తో చేయడం చాలా సంతోషంగా అనిపించింది. వెంకటేష్ గారి సినిమాలను చూస్తూ పెరిగా, ఆయనను నేనెలా చూడాలి అనుకుంటానో అలాగే ‘బాబు బంగారం’లో చూపించా. మొదటి ప్రేక్షకుడిగా బాబు బంగారం నాకైతే చాలా నచ్చింది. రేపు ప్రేక్షకులందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు