ఇంటర్వ్యూ : నందిత – ‘రామ్ లీల’లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.

ఇంటర్వ్యూ : నందిత – ‘రామ్ లీల’లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.

Published on Feb 25, 2015 7:30 PM IST

Nanditha
క్యూట్ & బబ్లీ లవర్ క్యారెక్టర్లతో పాటు, అందరిని భయపెట్టే క్యారెక్టర్లలో కూడా నటించి మెప్పించింది నందిత. వరుస విజయాలతో జోరుమీదున్న ఈ యువ హీరోయిన్ తాజాగా నటించిన సినిమా ‘రామ్ లీల’. యంగ్‌ అండ్ ఎనర్జిటిక్‌ స్టార్‌ హవీష్ హీరోగా నటించిన ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌ కుమార్ నిర్మించారు. శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అభిజిత్ మరొక హీరో. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారి ఎత్తున సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా గురించి నందితతో జరిపిన స్పషల్‌ ఇంటర్వ్యూ మీకోసం..

ప్రశ్న) ఈ సినిమాతో మీ ప్రయాణం ఎలా మొదలైంది..?

స) మొదట దర్శకుడు శ్రీపురం కిరణ్ గారు ‘రామ్ లీల’ కథతో నన్ను సంప్రదించారు. కథ, కథనం నాకు బాగా నచ్చాయి. కథలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ చాలా ఉన్నాయి. ఇలాంటి కథతో ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. దర్శకుడు కథను నేరేట్ చేసిన సమయంలో ఆయనపై నమ్మకం కలిగింది.

ప్రశ్న) ‘రామ్ లీల’ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న ఆ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ ఏంటి..?

స) యుఎస్‌లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా సినిమా కథను రాసుకున్నారు. ఇది ఒక రోడ్ జర్నీలాంటి మూవీ. సినిమాలో మొదటి 30 నిముషాలు తర్వాత ఒక జర్నీ స్టార్టవుతుంది. ఆ తర్వాత కథ టర్న్ అవుతుంది. ఆ పాయింట్‌ వినగానే నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి. ఇప్పుడు చెప్తే ఆ థ్రిల్ మిస్ అవుతారు. 27న థియేటర్లలో సినిమా చూసి ఆ థ్రిల్ పొందండి. సినిమాలో ఫ్యామిలీ డ్రామా, లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్నాయి.

ప్రశ్న) సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) ఇదొక మెచ్యూర్‌ లవ్ స్టోరి. హవీష్, అభిజిత్, నేను ప్రధాన పాత్రలు పోషించాం. అలాగని ట్రయాంగిల్‌ లవ్ స్టోరి అని కూడ చెప్పలేం. సశ్య అనే కాలేజీ గర్ల్ పాత్రలో నటించాను. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయనేదే సినిమా కథ. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. స్టోరి అంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. నాతో పాటు సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది.

ప్రశ్న) యంగ్ హీరో హవీష్ ఎలా నటించాడు..?

స) ఈ సినిమా కోసం ఫైటులు, డాన్సుల పరంగా హవీష్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. సెట్లో ఉన్నంత సేపు చాలా సరదాగా ఉంటాడు. ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళగానే.. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. తన ఎనర్జీ లెవెల్స్ తో సినిమా రేంజ్ ను పెంచాడు. మంచి కో-స్టార్. తనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది.

ప్రశ్న) ‘రామ్ లీల’తో శ్రీపురం కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అతని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది..?

స) సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లో ప్రేక్షకులకు ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తీసిన సినిమా అనే భావన రాదు. ఒక అనుభవం ఉన్న దర్సకుడిలా సినిమాను తెరకెక్కించారు. పలువురు పెద్ద దర్శకుల వద్ద కిరణ్ పని చేశారు. ఆ అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది.

ప్రశ్న) సినిమాలో ఇతర హైలైట్స్ ఏంటి..?

స) ఎస్. గోపాల్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది. సినిమాకు అది మేజర్ ప్లస్ పాయింట్. అలాగే చిన్నాగారి సంగీతం, ప్రీ – క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి.

ప్రశ్న) రామదూత క్రియేషన్స్ లో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) రామదూత క్రియేషన్స్ లో నటించడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. మలేషియాలో 21 రోజులు షూటింగ్ చేసినా ఎ ఒక్క రోజు కూడా సమస్య రాలేదు. నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలు..?

స) రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సుధీర్ బాబు సరసన నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ త్వరలో విడుదల కానుంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘రామ్ లీల’ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంటూ ఇంటర్వ్యూను ముగించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు