ఇంటర్వ్యూ : నారా రోహిత్ – తారకరత్న లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు!

ఇంటర్వ్యూ : నారా రోహిత్ – తారకరత్న లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు!

Published on Apr 28, 2016 5:32 PM IST

nara-rohit
నారా రోహిత్.. తెలుగులో వరుసగా విలక్షణ సినిమాలు చేసుకుంటూ తనదంటూ ఓ మార్క్ సెట్ చేసుకుంటోన్న హీరో. ప్రస్తుతం ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉంటూ నెలకో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తోన్న ఈ హీరో, తాజాగా ‘రాజా చెయ్యి’ వేస్తే అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి నారా రోహిత్ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ‘తుంటరి’, ‘సావిత్రి’ సినిమాల రిజల్ట్ విషయంలో ఎలా ఫీలయ్యారు?

స) ‘తుంటరి’ సినిమా విషయంలో నేను హ్యాపీగానే ఉన్నా. ఓ తమిళ సినిమాకు రీమేక్‌గా ఆ సినిమాను తీశాం. టార్గెట్ ఆడియన్స్‌కు నచ్చడంతో పాటు నిర్మాతకు డబ్బులు కూడా వచ్చేశాయి. ‘సావిత్రి’ విషయంలో మాత్రం నిరాశ చెందా. ఆ సినిమా పరాజయం గురించి ఇంకా పూర్తిగా ఆలోచించేంత సమయం చిక్కలేదు. ఏదేమైనా అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాం. రిజల్ట్ మన చేతుల్లో లేదన్నది వాస్తవం.

ప్రశ్న) ఇలా వరుసగా సినిమాలు చేయడం వల్ల సినిమాల క్వాలిటీ తగ్గుతుందేమో అనుకోవడం లేదా?

స) క్వాలిటీ తగ్గడం అన్న మాటే లేదు. నేను పది, ఇరవై రోజుల్లో సినిమా చేసేస్తే అప్పుడు క్వాలిటీ తగ్గుతుందేమో అనుకోవచ్చు. షూటింగ్‌కు ముందే అన్నీ పకడ్బందీగా పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళుతుండడంతో క్వాలిటీ ఎక్కడా తగ్గట్లేదు. రేపు వస్తున్న ‘రాజా చెయ్యి వేస్తే’ విషయంలోనూ క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.

ప్రశ్న) ‘రాజా చెయ్యి వేస్తే’ ఎలా ఉండబోతోంది? టైటిల్‌కు, కథకు సంబంధం ఏంటి?

స) ‘రాజా చెయ్యి వేస్తే’.. హీరో, విలన్‌ల మధ్యన సాగే ఓ మైండ్ గేమ్ తరహా సినిమా. ఈ సినిమాలో నేను రాజా అనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపిస్తా. సినిమా కథకు, టైటిల్‌కు సంబంధం ఏంటంటే సినిమా చూసే తెలుసుకోవాలి. కథ కంటే కూడా క్యాచీగా ఉంటుందనే ఈ టైటిల్ పెట్టాం.

ప్రశ్న) రాజా చెయ్యి వేస్తేకి హైలైట్ ఏంటి?

స) ఈ సినిమాకు హైలైట్ అంటే స్క్రిప్ట్ అనే చెబుతా. స్క్రిప్ట్ అంటే మళ్ళీ కథలో కొత్తదనం గురించి నేను మాట్లాడడం లేదు. ఈ సినిమా అసలు కథ రొటీన్‌గానే ఉంటుంది. తెలుగులో కథలన్నీ అయిపోయాయనిపిస్తోంది. తెలిసిన కథనే స్క్రీన్‌ప్లేతో కొత్తగా ఎలా చెప్తున్నాం అన్నదే పాయింట్. ఈ సినిమా ఆ విషయంలో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే సినిమాలకే ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది.

ప్రశ్న) కొత్త దర్శకుడితో సినిమా అంటే రిస్క్ అనిపించదా?

స) కథ చెప్పేటప్పుడే చెప్పేవాళ్ళపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ‘రాజా చెయ్యి వేస్తే’ కథ చెప్పగానే ప్రదీప్ ఈ సినిమాను అనుకున్నట్లుగా తెరకెక్కించగలడనే నమ్మకం కలిగింది. మేకింగ్‌పైన ప్రదీప్‌కి మంచి పట్టుంది. మీరు ట్రైలర్ చూస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. నేను అనుకున్నదానికంటే మంచి ఔట్‌పుట్ తెచ్చాడు.

ప్రశ్న) వారాహి చలన చిత్రం బ్యానర్‌కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థతో పనిచేయడం గురించి చెప్పండి?

స) సాయి కొర్రపాటి గారు ఈ బ్యానర్‌పై మంచి సినిమాలు తీస్తూ బ్యానర్‌కి ఓ గుర్తింపు తెచ్చారు. ఈ సినిమా కూడా ఆ బ్యానర్ స్థాయిలోనే ఉంటుంది. ఇకపోతే సాయి గారితో కలిసి పనిచేయడం మంచి అనుభూతి. అందరికీ క్రియేటివ్ ఫ్రీడం ఇచ్చేసి సినిమా బాగా వచ్చేలా చూస్తూంటారు. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో ‘జో అచ్యుతానంద’ అనే మరో సినిమా చేస్తున్నా.

ప్రశ్న) విలన్‌గా తారకరత్న నటించడం సినిమాకు ఎలా ఉపయోగపడింది అనుకుంటున్నారు?

స) సింపుల్‌గా చెప్పాలంటే తారకరత్న లేకపోతే ఈ సినిమా ఇంతబాగా వచ్చేది కాదేమో! ఈ కథను నాకన్నా ముందే తారకరత్న ఓకే చేశాడు. కజిన్‌గా నా చిన్నప్పట్నుంచీ ఆయనను చూస్తున్నా, ఈ సినిమాతోనే మా బంధం బాగా పెరిగింది. సినిమాలో నాది, ఆయనది, హీరోయిన్‌ది.. ఇలా అందరి పాత్రలూ ప్రధానమైనవే!

ప్రశ్న) ఎక్కువగా కొత్తవాళ్ళ దర్శకత్వంలోనే చేస్తున్నారు. పెద్ద దర్శకులను సంప్రదించడం లేదా?

స) అలా అని ఏం లేదు. నా దగ్గరకు వచ్చిన కథల్లో, నాకు సెట్ అయ్యేవి, బాగున్నాయి అనిపించిన కథలను ఓకే చేసేస్తున్నా. ఇప్పుడున్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి నేనైతే పెద్ద దర్శకులు ఎవర్ణీ సంప్రదించలేదు.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు? బరువు తగ్గడంపై కూడా శ్రద్ధ పెట్టారని వినిపిస్తోంది?

స) ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలనే పూర్తి చేస్తున్నా. ‘జో అచ్యుతానంద’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘కథలో రాజకుమారి’ ఈ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాకే మరో కొత్త సినిమా గురించి ఆలోచిస్తా. ఇక బరువు తగ్గమని అందరూ సలహా ఇస్తున్నారు. వరుస సినిమాలతో సమయం కుదరడం లేదు. జూన్‍లో మొదలయ్యే నా కొత్త సినిమాలో నారా రోహిత్ కొత్తగా కనిపిస్తాడని మాత్రం చెప్పగలను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు