ఇంటర్వ్యూ : నిహారిక – గ్లామర్ రోల్స్ అస్సలు చేయను!

ఇంటర్వ్యూ : నిహారిక – గ్లామర్ రోల్స్ అస్సలు చేయను!

Published on Jun 19, 2016 3:07 PM IST

NIHARIKA
నిహారిక.. స్టార్ హీరోల వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎక్కువగా హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చే తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్. ‘మెగా ఫ్యామిలీ’ అన్న బ్రాండ్ వల్ల నిహారిక నటించిన ‘ఒక మనసు’ అనే సినిమా కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నాగ శౌర్య, నిహారిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిహారికతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) మరో ఐదు రోజుల్లో మీ మొదటి సినిమా విడుదలవుతోంది. టెన్షన్ పడుతున్నారా?

స) టెన్షన్ అయితే ఉంటుంది. ఈ కథను ఎంతో బలంగా నమ్మి చేశాం. ఫైనల్ ఔట్‌పుట్ ఎలా ఉంటుందీ? ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారూ?అన్న టెన్షన్ ఉంది. తప్పకుండా అందరినీ అలరిస్తామన్న ధీమాతోనే ఉన్నా.

ప్రశ్న) మెగా ఫ్యామిలీ అన్న బ్రాండ్ నుంచి హీరోలే వచ్చారు. హీరోయిన్‌గా మీరు ఎంట్రీ ఇవ్వాలని ఎలా అనిపించింది?

స) నాకు చిన్నప్పట్నుంచీ సినిమా అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే మొదట టీవీ, సినిమా ప్రొడక్షన్‌లోకి దిగా. యాక్టింగ్‌పై నాకున్న ఇష్టం కూడా యాంకర్‌గా టీవీ షోస్ చేస్తున్నప్పుడే బలపడింది. ‘నేనిది చేయగలను, చేస్తాను’ అన్న నమ్మకం కుదిరాకే ఇంట్లో వాళ్ళను సంప్రదించా.

ప్రశ్న) హీరోయిన్ అవుతానన్నపుడు ఇంట్లో వాళ్ళ దగ్గర్నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

స) నేనూ చిన్నప్పట్నుంచీ సినిమా వాతావరణంలో పెరిగినదాన్నే కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఇక నాన్న, పెదనాన్న, బాబాయ్ అందరూ అవే విషయాలు మరోసారి గుర్తు చేశారు. అందరూ “నీకు ఇష్టమైతే చెయ్” అనే అన్నారు. ఇక నేనూ అన్నీ ఆలోచించి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేశా.

ప్రశ్న) మొదట్లో మెగా ఫ్యాన్స్‌ నుంచి వ్యతిరేకత రావడం గురించి ఏమంటారు?

స) వ్యతిరేకత అనడం తప్పు కానీ ఫ్యాన్స్ అయితే మొదట భయపడ్డారు. వాళ్ళంతా చిరంజీవి గారిని, కళ్యాణ్ బాబాయ్‌నీ, అందరినీ తమ సొంతవాళ్ళుగా భావిస్తారు. అలాంటి కుటుంబం నుంచి వస్తూండడంతో నన్నూ వాళ్ళమ్మాయిలాగే భావించి, హీరోయిన్ అంటే గ్లామర్ అనే భయంతో వద్దన్నారు. ఆ తర్వాత నా ఆలోచనలు తెలుసుకొని అందరూ ఒప్పేసుకున్నారుగా!

ప్రశ్న) గ్లామర్ పాత్రలు కేవలం ఫ్యాన్స్ కోసమే చేయొద్దని డిసైడ్ అయ్యారా?

స) నాకూ స్వతహాగా గ్లామర్ పాత్రలంటే ఇష్టం లేదు. గ్లామర్ పాత్రలు అస్సలు చేయదల్చుకోలేదు. మెగా ఫ్యామిలీ బ్రాండ్ నుంచి వచ్చినపుడు నాకు ఎలాగూ మొదట్లో ఒక గుర్తింపు దక్కుతుంది. అయితే తర్వాత కూడా అది కొనసాగాలంటే నాదంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకొని నిరూపించుకోవాలి. అందుకోసమే నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలే చేయాలనుకుంటున్నా. లక్కీగా ‘ఒక మనసు’ లాంటి మంచి సినిమాతో పరిచయం అవుతున్నా.

ప్రశ్న) ‘ఒక మనసు’ సినిమా ఎలా ఉండబోతోంది?

స) ఇదొక మెచ్యూర్డ్ లవ్‍స్టోరీ. నన్నడిగితే ఇలాంటి ప్రేమలు ఇప్పుడు బయట ఎక్కడోకానీ కనిపించవనే చెబుతా. ఇంత స్వచ్ఛమైన ప్రేమను, ఒక అందమైన కథగా దర్శకుడు మలచిన విధానం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

ప్రశ్న) ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

స) నేను నా పాత్ర ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోగానే వెంటనే సినిమా ఒప్పేసుకున్నా అంటే ఊహించండి, ఆ పాత్రకు ఎంతగా కనెక్ట్ అయ్యానో! మొదటి సినిమాకే ఇలాంటి ఒక బలమైన పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.

ప్రశ్న) నాగశౌర్యతో కలిసి నటించడం గురించి చెప్పండి?

స) నాగశౌర్య చాలా నెమ్మదైన వ్యక్తి. ఎవ్వరితోనూ అంత సులువుగా కలిసిపోలేడు. కలిసాడంటే మాత్రం సరదాగా బాగా మాట్లాడతాడు. సినిమా పూర్తిగా మా ఇద్దరి పాత్రల చుట్టూనే తిరుగుతూంటుంది. మా ఇద్దరి మధ్యన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి.

ప్రశ్న) తెలుగులో ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా వస్తున్నారు. భవిష్యత్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు.

స) ఈ సినిమా మొదలైనప్పట్నుంచీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఎంతో అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు వారందరూ గర్వపడేలా మంచి నటిగా మెప్పిస్తూ, మంచి మంచి సినిమాలు చేయాలన్నదే నా కోరిక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు