ఇంటర్వ్యూ : నితిన్ – స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం!

ఇంటర్వ్యూ : నితిన్ – స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం!

Published on May 27, 2016 1:09 PM IST

nitin1
‘అ..ఆ..’ అన్న టైటిల్ పెట్టడంతోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త సినిమాకు మొదట్నుంచే ఓ ప్రత్యేకత తీసుకురాగలిగారు. ఆయన దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. పోస్టర్స్, టీజర్‌, ట్రైలర్స్‌తో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వెళుతోన్న ఈ సినిమా తన కెరీర్‌కు చాలా ప్రత్యేకమని చెబుతూ హీరో నితిన్ పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) ‘అ..ఆ..’ విడుదలకు సిద్ధమైపోయింది. ఏమైనా టెన్షన్ పడుతున్నారా?

స) చెప్పాలంటే చాలా చాలా టెన్షన్‌గా ఉంది. ఏ సినిమా విడుదలైనప్పుడైనా ఈ టెన్షన్ అలా వచ్చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఎప్పుడెప్పుడు జూన్ 2 వస్తుందా అని ఎదురుచూస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌కు అన్నివిధాలా ప్రత్యేకమనే చెప్పాలి.

ప్రశ్న) ‘అ..ఆ..’ అనే టైటిల్, ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అనే ట్యాగ్‌లైన్ వినడానికి కొత్తగా ఉన్నాయి. సినిమాలో ఏం చెప్పబోతున్నారు?

స) ‘అ..ఆ..’ చాలా సింపుల్ లవ్‍స్టోరీ. ఏదో కొత్త కథ చెబుతున్నామని నేను చెప్పను. పక్కాగా మనకు తెలిసిన కథే ఇది. ఒక అబ్బాయి, అమ్మాయి మధ్యన ప్రేమకథ. ఆ ప్రేమకథలో ఉండే అందమైన భావోద్వేగాల చుట్టూ త్రివిక్రమ్ గారి స్టైల్లో సాగిపోయే ఫీల్ గుడ్ మూవీ. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ఏంటీ అని అడుగుతున్నారు. ప్రేమలో ఉండే చిన్న చిన్న గొడవలను త్రివిక్రమ్ అలా నిర్వచించారు.

ప్రశ్న) త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా అనగానే మొదట్లో ఎలా అనిపించింది?

స) ‘హార్ట్ అటాక్’ సినిమా కోసం స్పెయిన్‌లో ఉన్నపుడు త్రివిక్రమ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. త్రివిక్రమ్ గారితో సినిమా అనగానే చాలా ఎగ్జైట్ అయ్యా. అయితే పరిస్థితులవీ అనుకూలించక ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. మళ్ళీ నేను చేయాల్సిన ఓ పెద్ద సినిమా చివరి నిమిషంలో ఆగిపోవడం, త్రివిక్రమ్ గారి సినిమా కూడా అదే సమయానికి సెట్ అయిపోవడం.. అన్నీ అనుకోకుండా ఓ కలలా జరిగిపొయాయి.

ప్రశ్న) త్రివిక్రమ్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

స) ఆయనో మాస్టర్. లైఫ్‌లో నాకు ఏ రకమైన సమస్య వచ్చినా ఆయన్ని సంప్రదిస్తా. అంతగా ఆయన నన్ను ప్రభావితం చేశారు. నేనిప్పటివరకూ 22 సినిమాలు చేస్తే, వాటన్నింట్లోకెల్లా నటుడిగా నాకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చే సినిమాగా ‘అ..ఆ..’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది. సరదాగా, అందరినీ కలుపుకొని ఆయన ఈ సినిమా తెరకెక్కించారు. ‘అ..ఆ..’ ఏ రకంగా చూసిన త్రివిక్రమ్ స్టాంప్ ఉన్న సినిమా!

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో ఆనంద్ విహారి అనే ఓ చెఫ్‍గా కనిపిస్తా. కుటుంబ బాధ్యతలన్నీ తెలిసిన ఓ యువకుడిగా ఇందులో నా పాత్రకు ఓ డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్‌ను నేను సరిగ్గా అందుకోవడం కోసమే మొదట్లో త్రివిక్రమ్ గారు ఓ వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. ఎప్పుడూ సరదా పాత్రలే చేయడంతో ఈ పాత్రలో నటించడం నాకు కూడా కొత్తగా కనిపించింది.

ప్రశ్న) హీరోయిన్ సమంతకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీని గురించి ఏమంటారు?

స) ఈ సినిమా ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది. అనసూయ, ఆనంద్.. అందులో రెండు పాత్రలు. ప్రేమకథల్లో హీరో, హీరోయిన్లు ఇద్దరికీ ఒకే ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని హీరో సినిమానా, హీరోయిన్ సినిమానా అన్న ఆలోచనతో చూడలేం.

ప్రశ్న) సమంతతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

స) సమంత చాలా ఎనర్జిటిక్ నటి. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన వచ్చే సన్నివేశాల్లో మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమాలో మా పెయిర్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) రాజమౌళి, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడాన్ని ఎలా తీసుకుంటారు?

స) నిజంగా అది నా అదృష్టమే అని చెప్పాలి. స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయడంతో నన్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే అవకాశం దక్కింది.

ప్రశ్న) తదుపరి సినిమా ఏంటి?

స) ‘అ..ఆ..’ రిలీజ్ అయ్యాకే కొత్త సినిమా ఏంటనేది ప్రకటిస్తా!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు