ఇంటర్వ్యూ : ఎన్టీఆర్ – ‘స్టార్ హీరో’ అన్న ఇమేజ్ నాకే బోర్ కొట్టేసింది!

ఇంటర్వ్యూ : ఎన్టీఆర్ – ‘స్టార్ హీరో’ అన్న ఇమేజ్ నాకే బోర్ కొట్టేసింది!

Published on Sep 1, 2016 3:00 AM IST

ntr
‘నాన్నకు ప్రేమతో’ లాంటి క్లాస్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ‘జనతా గ్యారెజ్’ అన్న సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 1న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఎన్టీఆర్ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) కొన్ని గంటల్లో మీ సినిమా రిలీజవుతోంది. ఎలా ఉంది?

స) సినిమా విడుదలవుతుందంటే కచ్చితంగా దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచన ఉంటుంది. రేపు ప్రేక్షకులే సినిమా ఎలా ఉందో డిసైడ్ చేస్తారు. రెండు వారాలు సినిమా హడావుడిలో పడిపోతాం. మళ్ళీ ఇంకో సినిమా మొదలవుతుంది. ఇదంతా ఒక సైకిల్‌లా జరిగిపోయే విషయం. ఎప్పటికప్పుడు నటుడిగా ఎదుగుతూ, మంచి సినిమాలు చేయడమే మన పని. తప్పకుండా ‘జనతా గ్యారెజ్’ అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) కొన్నేళ్ళుగా మీ మాటల్లో చాలా మార్పు, ఆలోచనల్లో పరిణతి కనిపిస్తోంది. కారణం?

స) కారణమంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. వయసు పెరుగుతూ ఉన్నా కొద్దీ మనమేంటీ అనేది అర్థం చేసుకోవాలి. మెల్లిగా జీవితంపై అవగాహన వచ్చేస్తుంటుందప్పుడు. పరాజయాలే ఓ వేకప్ కాల్‌లా ఇవన్నీ నేర్పించాయి. మా అబ్బాయి అభయ్ రాక కూడా నన్ను పూర్తిగా మార్చేసింది.

ప్రశ్న) ‘జనతా గ్యారెజ్’ విషయానికి వస్తే, ఇక్కడ ఏమేం రిపేర్ చేస్తూంటారు?

స) (నవ్వుతూ..) ఈ ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ‘జనతా గ్యారెజ్‌’లో అన్నీ రిపేర్ చేస్తూంటాం. మనుషులను రిపేర్ చేసే గ్యారెజ్ ఇది. ఆ అంశమే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

ప్రశ్న) ఈ సినిమా కథ విని, మీ పాత్ర గురించి తెలుసుకోగానే ఎలా ఫీలయ్యారు?

స) నేను ఈ కథ రెండేళ్ళ క్రితమే విన్నా. వినగానే చాలా ఎగ్జైట్ అయ్యా. ప్రకృతి అంటే ఇష్టమనే ఓ యువకుడు, ఎక్కడో మనుషులంటే ఇష్టం ఉండే ఓ వ్యక్తి… ఈ ఇద్దరినీ కలిపే పరిస్థితులూ.. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అనుకోని కారణాల వల్ల సినిమా మొదలవ్వడానికి ఆలస్యమైంది. జనతా గ్యారెజ్ ఒక సినిమా కథగా కన్నా ఓ మంచి ఎక్స్‌పీరియన్స్. ఎంతో బాగా నచ్చడం వల్లేనేమో ఈ పాత్రలో ఒదిగిపోవడం చాలా సులభమైంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది? ఆ పాత్ర కోసం ఏయే కసరత్తులు చేశారు?

స) ముందే చెప్పినట్లు ‘జనతా గ్యారెజ్‌’లో నేనొక నేచర్ లవర్‌గా కనిపిస్తా. చెట్లు, మొక్కలంటే ఇష్టపడే ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమాలోని పాత్రకు ఇందులో పాత్రకు పూర్తి వ్యత్యాసం ఉంటుంది. అందుకనే ఈ పాత్ర కోసం లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం. మీరు సినిమా చూస్తే ఎక్కడా స్టైలిష్‌గా కనిపించాలని చేసే ప్రయత్నాలుండవు. బయట మనకు కనిపించే యువకులంతా ఎలా ఉంటారో, ఎలా డ్రెస్ అయి కనిపిస్తారో అలా ఉంటా.

ప్రశ్న) దర్శకుడు కొరటాల శివతో పనిచేయడం ఎలా అనిపించింది?

స) కొరటాల శివ అమేజింగ్ రైటర్. ఓ రచయిత అనేవాడు మనసుతో ఆలోచిస్తాడు, దర్శకుడు మెదడుతో ఆలోచిస్తాడు. తనలోని దర్శకుడిని, రచయితని సరిగ్గా హ్యాండిల్ చేయగల సమర్ధుడు కొరటాల శివ. బృందావనం అప్పట్నుంచే మేమిద్దరం మంచి స్నేహితులం. టాలెంటెడ్ దర్శకులతో పనిచేయడం ఎప్పుడూ బాగుంటుంది.

ప్రశ్న) మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్‌తో కలిసి నటించడం గురించి చెప్పండి?

స) మోహన్ లాల్ గారి లాంటి టాప్ క్లాస్ యాక్టర్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ప్రొఫెషనల్‌గానే కాక పర్సనల్‌గా కూడా ఆయన నాకు బాగా దగ్గరయ్యారు. ఒక సూపర్‌స్టార్ అయి ఉండి కూడా సింపుల్‌గా ఉండడం, పర్సనల్ లైఫ్‌లో అందరి లాంటి వ్యక్తిలా ఉండడం చూసి ఆయన్ను ఇన్స్పిరేషన్‌గా మార్చుకున్నా.

ప్రశ్న) ఇప్పటికే సినిమా చూసేశారని విన్నాం. ఎలా అనిపించింది?

స) నేను చేసిన సినిమాలన్నీ నాకు బాగానే ఉంటాయి కదండీ (నవ్వుతూ..) యా! ‘జనతా గ్యారెజ్‌’ను ఒక యాక్షన్ డ్రామాగా కన్నా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా చెప్పుకోవచ్చు అనిపించింది. ఆ డ్రామా ఎలా ఉంటుందన్నది మీరు సినిమాలో చూడాల్సిందే. రేప్పొద్దున మేమనుకున్న ఈ అంశం ప్రేక్షకులకూ నచ్చితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?

ప్రశ్న) బాక్సాఫీస్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందీ? సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందీ? ఇలాంటివి ఆలోచిస్తూంటారా?

స) ఎందుకోగానీ నేను ఈ బాక్సాఫీస్ నెంబర్స్, నెంబర్ గేమ్స్ వీటిని పెద్దగా నమ్మను. ఇప్పుడింక పరిస్థితులు మారాయి, ప్రేక్షకులు కూడా నెంబర్స్‌ని చూసే సినిమా విజయాన్ని చూస్తున్నారు కాబట్టి అవెలా ఉన్నాయన్నది గమనిస్తూంటా. ఇప్పటికీ నేనైతే సక్సెస్‌ను బాక్సాఫీస్ ఫిగర్స్‌తో కలిపి చూడలేను.

ప్రశ్న) హీరోయిజం, మాస్ ఇమేజ్ లాంటివి స్టార్ హీరోలను ఎప్పుడూ వెంటాడే అంశాలు. వీటిని మీరెలా హ్యాండిల్ చేస్తూంటారు?

స) ఈ హీరోయిజం, స్టార్ హీరో అన్నవి నాకే బోర్ కొట్టేశాయి. అనవసరమైన హీరోయిజాలు ప్రేక్షకులూ కోరుకోవట్లేదన్నది నాతో సహా అందరు హీరోలూ అర్థం చేసుకున్నారనుకుంటున్నా. ఇప్పుడంతా ఎంత బలమైన కథతో ప్రేక్షకుడిని మెప్పిస్తున్నామన్నదే ప్రధానంగా మారిపోయింది. అలాంటప్పుడు కథ అవసరానికి తగ్గట్టే డ్యాన్స్‌లు, పాటలు, ఫైట్స్ ఉండేలా చూస్తూంటాం. దీంతో నాకూ నటుడిగా నిరూపించుకునే అవకాశం ప్రతిసారీ దక్కుతుంది. నన్ను నేను హీరోగా కంటే నటుడిగానే ఎక్కువగా ప్రస్తావించుకుంటా. ఇక మాస్ ఇమేజ్ అన్నది కూడా ఇప్పుడెక్కడా లేదనే నమ్ముతా. ఎంత మంది ప్రేక్షకులకు సినిమా చేరితే అంత మాస్!

ప్రశ్న) చివరగా, మీ తదుపరి సినిమా ఏంటి?

స) ప్రస్తుతానికి జనతా గ్యారెజ్.. జనతా గ్యారెజ్. ఈ సినిమా విడుదలయ్యాక, కొత్తదేంటీ? ఎప్పుడు మొదలవుతుందీ? అన్నది ప్రకటిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు