ప్రత్యేక ఇంటర్వ్యూ : పి. సునీల్ కుమార్ రెడ్డి – నేను చేసే సినిమాల వల్ల యువత పెడదారి పట్టడం లేదు..

ప్రత్యేక ఇంటర్వ్యూ : పి. సునీల్ కుమార్ రెడ్డి – నేను చేసే సినిమాల వల్ల యువత పెడదారి పట్టడం లేదు..

Published on Jul 17, 2014 5:45 PM IST

sunil-kumar-reddy
‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి రియలిస్టిక్ సినిమాలు తీసి విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి ఆ తర్వాత యూత్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘వెయిటింగ్ ఫర్ యు’ అనే సినిమాలను తీసారు. అదే కోవలోనే మరోసారి యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయనతో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆయన యూత్ ని టార్గెట్ చేస్తూ ఎందుకు సినిమాలు చేస్తున్నారు, ఈ క్రిమినల్ ప్రేమకథ సంగతులను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాల తర్వాత ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాంటి సినిమాలు చేయడానికి గల కారణం ఏమిటి.?

స) ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలలో సమాజంలో జరిగే ఓ సమస్యని చూపించాను. అందులో నేను ఫిక్షన్ జత చేసినప్పటికీ అవి ఒక మెచ్యూర్ లెవల్ సినిమాలయ్యాయి. దానివల్ల అవి 18-35 వయసు వారికి అవి కనెక్ట్ కాలేదు. అప్పుడే యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫోకస్ చెయ్యడం మొదలు పెట్టాను. కాలేజీలలో జరిగే పలు కార్యక్రమాలకి, యువతతో కూర్చొని వారి సమస్యలను చర్చిండం లాంటివి చేసాను. అప్పుడే నాకు యువతకి బయట గర్ల్ ఫ్రెండ్ లేదా విలాసాలకు అలవాటు పడటం వల్ల ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీ సరిపోక దొంగలుగా మారుతున్నారు. కొందరేమో అమ్మాయిలని చీట్ చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం, ఇల్లీగల్ అబార్షన్స్ అనే విషయాలు తెలిసాయి. ఇవన్నీ నన్ను కదిలించవలడంతో ఇలా చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి అని యువతకి చెప్పడం కోసమే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చేసాను.

ప్రశ్న) ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ సినిమా తీయాలనే ఆలోచన ఎలా మొదలైంది.?

స) ‘ఒక రొమాంటిక్ క్రైమ్’ కథ తర్వాత యువతలో అమ్మాయిలని మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగితే ఓ అమ్మాయి నాతో ‘సార్ నిర్భయ, అభయ కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆ సంఘటనల్లో ఆ సమయంలో నిర్భయ అక్కడ లేకపోయినా లేదా ఆ నలుగురు అక్కడికి రాకపోయినా ఆ ఇన్సిడెంట్ జరిగే అవకాశం లేదు. అందరూ ఇలా జరిగినవే చూస్తున్నారు తప్ప మన ఇళ్ళల్లో జరిగేటివి ఎందుకు తెలియడం లేదు. ఉదాహరణకి స్కూల్ కెళ్ళిన అమ్మాయిని గురువు వేధించడం, కూతురులాంటి దాన్ని బాబాయ్ వేధించడం మొదలైనవి. ఇలాంటివి ఎందుకు సమాజానికి తెలియడంలేదు. ప్రస్తుతం అమ్మాయిలకి బయటి కంటే నా అనుకున్నవాళ్ళ మధ్యే సంరక్షణ లభించడం లేదు. కానీ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. నా వరకూ నిర్భయ లాంటి ఘటనల కంటే ఇదే పెద్ద సమస్య అని’ చెప్పింది. అది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సంఘటనే ఈ సినిమాకి స్ఫూర్తి. ఆ తర్వాత నేను దానిపై రీసర్చ్ చేశాను, నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అఫీషియల్ న్యూస్ ఏంటి అంటే 97% రేప్స్ ఇళ్లలోనే జరుగుతున్నాయి, 3% మాత్రం రోడ్ల మీద జరుగుతున్నాయి. ఇవన్నీ ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేసాను.

ప్రశ్న) మరి ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ ద్వారా ఏమి చెప్పనున్నారు.?

స) పైన చెప్పినట్టు ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ ఒక పార్ట్ అయితే, యువత తన ఎమోషన్ లేదా కోపాన్ని చూపించడం కోసం ఒక వయోలెంట్ మార్గాన్ని(ఉదా. యాసిడ్ దాడులు) ఎంచుకుంటోంది. కాని అది తప్పు అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దానికి కారణం ప్రతి ఒక్కరి ఫ్యామిలీ. ఎందుకంటే తల్లి తండ్రులు పిల్లలతో కూర్చొని వారికి సరైన మార్గాన్ని చూపించడం లేదు. ఈ సినిమా ద్వారా యువత, తల్లి తండ్రులు చేస్తున్న తప్పు ఏంటి అనేది చూపించబోతున్నాను. అలా అని మొదటి నుంచి చివరిదాకా మెసేజ్ చెప్పను. ఎంటర్టైన్మెంట్ తో బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం మెసేజ్ చెప్తాను.

ప్రశ్న) ఈ సినిమాలో నటించిన మనోజ్, ప్రియాంక ఇతర నటీనటుల గురించి చెప్పండి.?

స) మనోజ్ నాకు చిన్న తనం నుంచి తెలుసు. తనని నేనే సైలెన్స్ సినిమాతో పరిచయం చేసాను. తనతో కంఫర్ట్ ఉంటుంది. అలాగే నన్ను నమ్ముతాడు. గతంలో చూసిన మనోజ్ కి ఇందులో చూసిన మనోజ్ కి చాలా వైవిధ్యం ఉంటుంది. ఇక ప్రియాంకని ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. తను చాలా బాగా చేసింది. మిగిలిన పాత్రలు చేసిన అనిల్, దివ్యలు నా గత సినిమాల్లో చేసినవారే.

ప్రశ్న) హీరోయిన్ ప్రియాంక ఫేస్ చూపించకుండా పరదాతోనే ప్రెస్ మీట్స్, లైవ్ షోస్ ఎందుకు నిర్వహిస్తున్నారు.? అసలు అలా ముసుగుతో చూపించడానికి గల రీజన్ ఏమిటి?

స) ఇలా పరదా చూపించడం ఎవరినీ ఉద్దేశించినది కాదు. మన సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆత్మ వంచనకి ప్రతీకే ఈ పరదా.. ఈ సినిమాలో పేరెంట్స్ కి పిల్లలకి, సొసైటీకి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ లేదు అని చెప్పడానికే ఈ ముసుగు వేశాం. అది మేము 18న థియేటర్స్ లో రివీల్ చేయనున్నాం. అలాగే రొమాంటిక్ క్రైమ్ కథ టైములో అలా చేసిన ప్రమోషన్ చాలా హెల్ప్ అయ్యింది. అదే కంటిన్యూ చేద్దాం అని అందరూ చెప్పడంతో కంటిన్యూ చేసాం. ప్రియాంక సినిమాలో మాత్రం పరదాతో ఉండదు.

ప్రశ్న) మీరు సమాజంలో జరిగే ఒక విషయాన్ని చెప్పడానికి ఇదే జోనర్ ని ఎందుకు ఎంచుకున్నారు? ఇలా చెప్పడం వల్ల యువత మరింత పెడదారి పట్టే అవకాశం లేదంటారా.?

స) ఈ విషయంలో నేనొకటి చెప్తాను. ప్రతి ఒక్కరూ చావు, సెక్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ సెక్స్ లేకపోతే మనం లేము, చావు లేని మనసు ఉండదు. కావున ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడడంలో భూతేముంది. పెద్దలు కూడా పిల్లలకు ఏమీ తెలియదు అని వారి ముందే చాలా భూతు పనులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇవన్నీ వారికి తెలుసు కావున మీరు వారి ముందు చెయ్యద్దు, వారికి మహిళలను గౌరవించడం నేర్పించండి. ఇవన్నీ మీరు చేయకుండా తప్పులు చేస్తూ నేను చేసే సినిమా ద్వారానే ఇవి వాళ్ళకి తెలుస్తున్నాయి అనడం కరెక్ట్ కాదు. యువత ఫాలో అవుతున్న మార్గాన్నే నేను చూపిస్తూ దాని వల్ల వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్ని చూపించి కొందరిని అన్నా మార్చడానికి ట్రై చేస్తున్నాను. కావున నా వల్ల ఎవరూ పెడదారి పెట్టడం లేదని నా అభిప్రాయం.

ప్రశ్న) మీరొక మెసేజ్ ని ప్రజలకి చెప్పాలి అనుకుంటే.. నూతన తారలకంటే కాస్త పేరున్న హీరోలైతే బెటర్ కదా కానీ మీరెందుకు వారిని ఎంచుకోవడం లేదు.?

స) నా పరంగా సినిమాకి హీరో అంటే అవి కథ మరియు మేకింగ్ మాత్రమే. నేననుకున్న కథలకి ఎంతమంది సూట్ అవుతారో వారినే తీసుకుంటాను. మీరన్నట్టు సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియా. ఒక మెసేజ్ ని పెద్ద హీరో ద్వారా చెబితే ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. కానీ ప్రస్తుతం మార్కెట్ పరంగా ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు చెయ్యలేకపోతున్నారు. అందుకే నేను నా రేంజ్ కి తగ్గట్టు చేసాను.

ప్రశ్న) ఒక డైరెక్టర్ గా మీరు చేయాలనుకునే డ్రీం ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా.?

స) డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమీ లేవు.. ప్రస్తుత సమాజంలో నాకు కనెక్ట్ అయ్యే సమస్యల్ని చెప్పడమే నా డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఇది కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంటుంది. అందులో భాగంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నేనేం చిన్నపిల్లనా’ ట్రై చేసాను. కానీ ఈ సినిమా కథని నేను న్యాయం చేయగలను అని రామానాయుడు గారే నన్ను ఎంచుకోవడంతో ఈ సినిమా చేసాను.

ప్రశ్న) రాష్ట్ర విభజన తర్వాత సినీ ఇండస్ట్రీలో కూడా విభజన సమస్య కొనసాగుతోంది. ఈ మార్పు అనేది సినీ పరిశ్రమకి శుభదాయకం అంటారా.?

స) నాకు తెలిసిన ఈ విభజన వల్ల ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులేదు. ప్రతి ఒక్క చోటా చిన్న, పెద్ద, పవర్ అనేది ఉంటుంది. మనం చేయాల్సింది విడిపోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు వస్తాయి. అలాగే లోకల్ మరియు రీజనల్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. అది సినీ పరిశ్రమకి మంచి పరిణామం అని చెప్పాలి.

ప్రశ్న) చివరిగా ఈ సినిమాకి వచ్చే ప్రేక్షకులకు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు.?

స) నేను థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడు పెట్టే మనీ కంటే వారు స్పెండ్ చేసే సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ సినిమా కోసం థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే కొన్ని చోట్ల మిమ్మల్ని థ్రిల్ కూడా చేస్తాం. యువత, తల్లి తండ్రులు అందరూ చూడాల్సిన సినిమా ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ మరింత విజయవంతం కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు